భారీ జన సమీకరణే లక్ష్యం | dmdk mahanadu in Second February Villupuram | Sakshi
Sakshi News home page

భారీ జన సమీకరణే లక్ష్యం

Jan 14 2014 12:18 AM | Updated on Mar 29 2019 9:18 PM

డీఎండీకే మహానాడుకు భారీ ఎత్తున జన సమీకరణ చేపట్టాలని నిర్ణయించింది. 50 లక్షల మందిని సమీకరించడం లక్ష్యంగా పార్టీ శ్రేణులు కసరత్తుల్లో పడ్డారు.

డీఎండీకే మహానాడుకు భారీ ఎత్తున జన సమీకరణ  చేపట్టాలని నిర్ణయించింది. 50 లక్షల మందిని సమీకరించడం లక్ష్యంగా పార్టీ శ్రేణులు కసరత్తుల్లో పడ్డారు. ‘ఏకం అవుదాం... అవినీతిని నిర్మూలిద్దాం’ అనే నినాదాన్ని మహానాడు పేరుగా తీర్మానించారు. సరికొత్త హంగులతో కూడిన లోగోలను, ప్రజాకర్షణ నినాదాల పిలుపుతో కూడిన ఎస్‌ఎంఎస్‌లను ఆ పార్టీ విడుదల చేసింది.
 
 సాక్షి, చెన్నై:రాష్ట్రంలోని డీఎంకే, కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెస్‌లు తన చుట్టూ పొత్తు కోసం తిరుగుతుండటంతో డీఎండీకే అధినేత విజయకాంత్ తన వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడ్డారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తన సత్తాను అటు డీఎంకేకు ఇటు జాతీయ పార్టీలకు రుచి చూపించేందుకు నిర్ణయించారు. ఫిబ్రవరి రెండో తేదీ విల్లుపురం జిల్లా ఉలందరూ పేట వేదికగా భారీ మహానాడుకు పిలుపునిచ్చారు. 250 ఎకరాల స్థలాన్ని ఈ మహానాడుకు ఎంపిక చేశారు. భారీ వేదికతో పాటుగా యాభై లక్షల మందిని జనసమీకరించడం లక్ష్యంగా కసరత్తుల్లో పడ్డారు. సోమవారం ఆ పార్టీ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన లోగోల ఆవిష్కరణ, ప్రజాకర్షణ నినాదాలతో కూడిన ప్రచార భేరికి శ్రీకారం చుట్టారు.
 
 ఏకమవుదాం: కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో ఉదయం డీఎండీకే యువజన నేత సుదీష్, పార్టీ ఎమ్మెల్యేలు చంద్రకుమార్, పార్థసారథి, పార్థీబన్, అనగై మురుగేషన్  నేతృత్వంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. మహానాడు వేదికపై ఏర్పాటు చేయనున్న కటౌట్ నమూనాను సుదీష్ విడుదల చేశారు. ఏకం అవుదాం...అవినీతిని నిర్మూలిద్దాం నినాదాన్ని మహానాడుకు పేరుగా నామకరణం చేశారు. అశేష జన సమూహం నడుమ విజయకాంత్ ఉండే రీతిలో ఆ లోగో తీర్చిదిద్దారు. చూపుడు వేలు సంకేతంగా మరో లోగోను, కార్యకర్తలు ధరించాల్సిన రబ్బర్‌బ్యాండ్‌లను విడుదల చేశారు. సరికొత్తగా రూపొందించిన ఎస్‌ఎంఎస్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడుతూ, మహానాడు వివరాల్ని వెల్లడించారు.
 
 యాభై లక్షలు లక్ష్యం
 రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో తమ మహానాడుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉలందరూ పేటలో 250 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశామని వివరించారు. యాభై లక్షల మంది ఈ మహానాడుకు హాజరు కాబోతున్నారన్నారు. ఇతర రాష్ట్రాల్లోని అభిమానులు, కార్యకర్తలు, నాయకులు రైళ్లలోను, విదేశాల్లో ఉన్న నాయకులు విమానాల్లోను ఇక్కడికి రాబోతున్నారని వివరించారు. అవినీతికి వ్యతిరేకంగా రాష్ట్రంలో పోరాడుతున్న ఏకైక పార్టీ డీఎండీకే మాత్రమేనన్నారు. అన్నాడీఎంకే గతంలో అవినీతి ఊబిలో కూరుకు పోయిన పార్టీ అని, వాళ్లల్లో మార్పు వచ్చిందని భావించిన తాము గత ఎన్నికల్లో కలసి పోటీ చేశామన్నారు. అయితే, వారిలో ఎలాంటి మార్పు రాలేదని, రాష్ట్రాన్ని దోచుకుంటుండడంతోనే, తాము ఆ కూటమి నుంచి బయటకు వచ్చామని స్పష్టం చేశారు. త్వరలో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ పెను రాజకీయ మార్పు చోటుచేసుకోబోతోందన్నారు. లోగోలో ఉన్న చూపుడు వేలు సంకేతం ఎవర్ని సూచిస్తున్నట్టు..? అని విలేకరులు ప్రశ్నించగా, అసెంబ్లీలో తమ నేత విజయకాంత్ చూపుడు వేలు చూపించారన్న నెపంతో సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. ఆ రోజు తమకు జరిగిన అన్యాయం, అసెంబ్లీలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రజల్లోకి తీసుకెళ్లడం లక్ష్యంగా చూపుడు వేలు లోగోను ప్రచారాస్త్రంగా నిర్ణయించామన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement