కన్నవారిని గాలికి వదిలేసేవారికి గుణపాఠం

Collector Deregistration Assets On Old Couple In Tamil Nadu - Sakshi

కుమారులకు రాసిచ్చిన సొత్తును రద్దుచేసి తల్లిదండ్రులకు అప్పగింత

తిరువణ్ణామలై జిల్లా కలెక్టర్‌ కందస్వామి చొరవ

కృతజ్ఞతతో కన్నీరుపెట్టుకున్న వృద్ధదంపతులు

సాక్షి ప్రతినిధి, చెన్నై: జన్మనిచ్చారు, జీవితాన్ని ఇచ్చారు, తమకోసం ఏమీ ఉంచుకోకుండా కష్టించి కూడబెట్టిన ఆస్తి యావత్తూ అప్పగించేశారు ఆ వృద్ధ దంపతులు. అన్నీ పుచ్చుకున్న కనికరంలేని ఇద్దరు కుమారులు కన్నవారికి పట్టెడన్నం కూడా పెట్టకుండా కడుపుమాడ్చేశారు. కడుపున పుట్టకపోతేనేం జిల్లా కలెక్టరే కన్నబిడ్డగా మారి వృద్ధదంపతులను ఆదుకున్న ఉదంతం తమిళనాడులో చోటుచేసుకుంది. తిరువణ్ణామలై జిల్లా కీళ్‌పెన్నాత్తూరు గ్రామానికి చెందిన కన్నన్‌ (75), పూంగావనం (63) దంపతులకు పళని (40), సెల్వం (37) అనే ఇద్దరు కుమారులున్నారు. ప్రభుత్వ బస్సులో కండక్టరుగా పనిచేసే పళని, భవన నిర్మాణ కార్మికునిగా పనిచేసే సెల్వం వివాహాలు చేసుకుని వేర్వేరుగా కాపురం ఉంటున్నారు. కన్నన్‌ తనకు చెందిన ఐదు ఎకరాల భూమిని ఇద్దరు కుమారులకు సరిసమానంగా పంచి రిజిస్ట్రేషన్‌ చేశాడు. అయితే ఆస్తులు దక్కగానే తల్లిదండ్రులకు కుమారులిద్దరూ అన్నంపెట్టడం మానివేశారు.

అంతేగాక కుమారుడు సెల్వం తండ్రిపై తరచూ భౌతికదాడులకు పాల్పడసాగాడు. తామిచ్చిన ఐదు ఎకరాల నుంచి కనీసం 60 సెంట్ల భూమైనా ఇస్తే సాగుచేసుకుని పొట్టపోసుకుంటామని తల్లిదండ్రులు బతిమాలారు. ఇందుకు కుమారులిద్దరూ నిరాకరించారు. దీంతో తీవ్ర ఆవేదనకు లోనైన ఆ వృద్ధదంపతులు వారం రోజుల క్రితం జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన గ్రివెన్స్‌ సెల్‌కు హాజరై కలెక్టర్‌ కందస్వామికి మొరపెట్టుకున్నారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆర్డీఓ ఉమామహేశ్వరీ కుమారులిద్దరిని పిలిచి విచారించారు. 60 సెంట్ల భూమిని, జీవనా«ధారం కోసం కొంత సొమ్మును ఇచ్చేందుకు పెద్ద కుమారుడు పళని అంగీకరించగా, చిన్న కుమారుడు సెల్వం ససేమిరా అన్నాడు. ఆర్డీఓ నుంచి నివేదిక అందుకున్న జిల్లా కలెక్టర్‌ తల్లిదండ్రులు, సీనియర్‌ సిటిజన్స్‌ సంక్షేమ, పర్యవేక్షణ చట్టాన్ని ప్రయోగించి కన్నన్‌ తన కుమారులుకు రాసిచ్చిన ఐదు ఎకరాల భూమి రిజిష్ట్రేషన్‌ను రద్దు చేయించారు.

చిన్న కుమారుడు తన వాటాను మరొకరికి అమ్మగా ఆ రిజిస్ట్రేషన్‌ను కూడా రద్దు చేయించారు. సోమవారం వృద్ధ దంపతులను జిల్లా కలెక్టరేట్‌కు పిలిపించుకుని సదరు ఐదు ఎకరాల భూమిలో 2.15 ఎకరాలు కన్నన్‌ పేరున, 2.85 ఎకరాల భూమిని పూంగావనం పేరిట పట్టాగా ఇచ్చారు. కన్నబిడ్డలే నిర్ధాక్షిణ్యంగా వదిలివేయగా ఏ తల్లి కన్నబిడ్డో కలెక్టర్‌ గారు చొరవతీసుకుని మా కన్నీళ్లు తుడిచారని వృద్ధదంపతులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ కందస్వామి మాట్లాడుతూ వృద్ధాప్యానికిచేరుకున్న కన్నవారిని కంటికి రెప్పలా కాపాడడం కన్నబిడ్డల కర్తవ్యమని అన్నారు. కన్నవారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించేవారికి కన్నన్‌ ఉదంతం ఒక గుణపాఠం కావాలని చెప్పారు. ఇంత ముసలితనంలోనూ 60 సెంట్ల భూమిని సాగుచేసుకుని బతుకేందుకు సిద్ధమైన ఆ దంపతుల మనోధైర్యాన్ని కలెక్టర్‌ కొనియాడారు. సదురు ఐదెకరాల భూమిని వృద్ధ దంపతులు తమకిష్టమైన వారికి రాసిచ్చే అధికారాన్ని సైతం కట్టబెట్టినట్లు కలెక్టర్‌ వివరించారు. కన్నన్‌ దంపతుల్లా ఇంకా ఎవరైనా కష్టపడుతున్నట్లు ఫిర్యాదు అందితే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top