పగ, ప్రతీకారాల వన్మం | Sakshi
Sakshi News home page

పగ, ప్రతీకారాల వన్మం

Published Sun, Oct 19 2014 12:08 AM

పగ, ప్రతీకారాల వన్మం

వ్యక్తిగత పగ, ప్రతీకారాల ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్న చిత్రం వన్మం అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు జై కృష్ణ.  తాజాగా ఆర్య, విజయ్ సేతుపతి కలిసి నటిస్తున్న పొరంబోకు, నకుల్, దినేష్ నటిస్తున్న తమిళుక్కు ఎన్ ఒండ్రై అళుత్తువుం, విష్ణు, విజయ్ సేతుపతి కలిసి నటిస్తున్న ఇడం పొరుళ్ ఎవల్ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ఆ వరుసలో వస్తున్న మరో చిత్రం వన్మం. విజయ్ సేతుపతి, కృష్ణలు నటిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రంలో సునైనా, హీరోయిన్‌గా నటిస్తున్నారు. చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్ర దర్శకుడు జైకృష్ణతో చిట్‌చాట్.    
                      
  చిత్ర టైటిల్ గురించి కాస్త వివరిస్తారా?
  వన్మం అంటే ప్రతీకారేచ్ఛ అని అర్థం. ఒక వ్యక్తి పగ, ప్రతీకారాలే చిత్ర కథ. పగ అనేది ప్రతి వ్యక్తిలోను ఏదో ఒక మూల దాగి ఉంటుంది. సమయం వచ్చినప్పుడు అది మనకు తెలియకుండానే బయటకు వస్తుంది. పోతుంది. అలాంటి ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న చిత్రమే వన్మం. అయితే అది మాత్రమే చిత్ర కథ కాదు.
 
  ఇంకా ఎలాంటి విషయాలుంటాయి?
  మాటలు గొంతు దాటనంత వరకే మర్యాద ఉంటుంది. వాటిని బయటకు అనేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఎలాంటి కోపంలోనైనా ఆచితూచి మాట్లాడాలి. లేదంటే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఒక్కమాట తూలినా సమస్యలు చుట్టుకునే ప్రమాదం ఉంటుంది. దేశంలో పలు సమస్యలు ఇలాంటి వ్యాఖ్యల వలనే తలెత్తుతున్నాయి. అలాంటి ఒక వ్యాఖ్య చిత్రంలోని పాత్రల్ని ఎలాంటి పరిస్థితులకు తీసుకెళ్లిందన్నది వన్మం చిత్రం.
 
  చిత్రంలో విజయ్‌సేతుపతి, కృష్ణలు స్నేహితులా?
  చిత్రంలోనే కాదు నిజ జీవితంలోనూ స్నేహితులే. ఈ చిత్రానికి వారిద్దరి సహకారం అపారం. ఉద్యోగవేటలో ఉండే కృష్ణ, ఆజన్మ ధనవంతుడైన విజయ్ సేతుపతి అద్భుతంగా నటించారు.
 
 నటి సునైన ఎవరికి జంటగా నటిస్తున్నారు?
  ప్రస్తుతానికి ఆ ఒక్కటి అడగకండి. చిత్రం చూసి సునైన ఎవరికి జోడి అన్నది తెలుసుకోండి.
 
 సునైన చాలా గ్లామరస్‌గా నటించారట?
 అలాంటిదేమి లేదు. కాకపోతే కొలనులో స్నానమాడే సన్నివేశం చిత్రంలో చోటు చేసుకుంటుంది. అది అంత గ్లామరస్‌గా ఉండదు. అయితే చిత్ర కథకు ఏమేమి అవసరమో అన్నీ వుంటాయి.
 
  చిత్ర షూటింగ్ మొత్తం నాగర్‌కోవిల్‌లోనే నిర్వహించారట?
 అవును. నా సొంత ఊరు నాగర్‌కోవిల్. కథకు ఆ ప్రాంతాన్నే నేపథ్యంగా ఎంచుకున్నాను. నిర్మాత జెపక్‌కు కథ చెప్పగానే బాగుందన్నారు. ఇప్పటి వరకు తెరపై చూడని  లొకేషన్స్, నాగర్‌కోవిల్‌లో వున్నాయి. దీంతో షూటింగ్ మొత్తం నాగర్‌కోవిల్, కన్యాకుమారి ప్రాంతాల్లో పూర్తి చేశాం.
 

Advertisement
 
Advertisement
 
Advertisement