విమాన విషాదం


 చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నై కోస్ట్‌గార్డ్ విమానం తీరని విషాదాన్ని మిగిల్చింది. ఇద్దరు పెలైట్లు, ఒక అసిస్టెంట్ కమాండర్‌ను పొట్టనపెట్టుకుని కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది. చెన్నైలో గత నెల 8వ తేదీన అదృశ్యమైన కోస్ట్‌గార్డ్ విమానం నెంబరు 791 సముద్రంలో కూలిపోయిందని, ముగ్గురు అధికారుల ఎముకలు, విమానశకలాలు దొరికాయని ఇండియన్ కోస్ట్‌గార్డ్ (తూర్పు) ఐజీ ఐజీ సత్యప్రకాష్ శర్మ సోమవారం రాత్రి అధికారికంగా ప్రకటించారు. అయితే డీఎన్‌ఏ పరీక్షలు తరువాతన అధికారులు ప్రాణాలతో ఉన్నారా లేదా అనే అంశాన్ని అధికారికంగా నిర్దారిస్తామని స్పష్టం చేశారు.

 

 ఇండియన్ కోస్ట్‌గార్డ్ (తూర్పు)దళానికి చెందిన డోర్నియర్ విమానం (సీజీ-791) గత నెల 8వ తేదీ సాయంత్రం  6,30 గంటలకు చెన్నై నుండి పుదుచ్చేరికి వెళ్లి క్షేమంగా తిరుగు ప్రయాణమైంది. అయితే అదే రోజు రాత్రి 9.23 గంటల సమయంలో రాడార్ కేంద్రంతో సంబంధాలు తెగిపోగా కానరాకుండా పోయింది. అదృశ్యమైన విమానంలో విద్యాసాగర్ ( పెలైట్), సుభాష్ సురేష్ (అసిస్టెంట్ పెలైట్), ఎంకే సోని అనే అసిస్టెంట్ కమాండర్ ప్రయాణిస్తున్నారు. అదృశ్యమైన విమానం ఆచూకి కోసం అనేకరకాలుగా గాలింపు నిర్వహించారు. ఆకాశమార్గాన విమానాలు, సముద్రంలో యుద్ధ నౌకలు, సముద్ర గర్భంలో సబ్‌మెరైన్‌లు విస్తృతంగా గాలింపులు జరిపాయి. ఐఎన్‌ఎస్ సుదుద్వాజ్, ఐఎన్‌ఎస్ సంధ్యాస్ సబ్‌మెరైన్‌లు గాలింపులోపాల్గొన్నాయి. 33 రోజులుగా జరిపిన గాలింపులు ఎట్టకేలకూ ఫలించగా అదృశ్యమైన విమాన బ్లాక్స్‌బాక్స్‌ను ఈనెల 10వ తేదీన కనుగొన్నారు.సదరు బ్లాక్స్‌ను బెంగళూరులోని పరిశోధనా కేంద్రానికి పంపి గాలింపును విస్తృతం చేశారు.

 

  రిలయన్స్ కంపెనీకి చెందిన ఒలింపిక్ కెన్‌యాన్ అనే నౌక చిదంబరంలోని సముద్రం 16 నాటికల్ మైళ్ల దూరంలో 950 అడుగుల లోతులో మురుగులో కూరుకుపోయిన స్థితిలో బ్లాక్‌బాక్స్‌ను కనుగొన్నారు. గాలింపు కొనసాగిస్తున్నదశలో సోమవారం రాత్రి విమాన శకలాలు దొరికాయి. తిరుచ్చిరాపల్లికి 32 మైళ్ల దూరంలో కారైక్కాల్‌కు ఈశాన్యంలో కూలిపోయినట్లు గుర్తించారు. కాగా కడలూరుకు ఆగ్నేయంలో 17 నాటికల్‌మైళ్ల దూరంలో 990 అడుగుల లోతు సముద్ర గర్భంలో రెండు ఇంజన్లు, ప్రొఫెల్లర్లు, విమానం తోకభాగం, శిఖరభాగం తదితర విమాన శకలాలు దొరికాయి.

 

  అలాగే అధికారుల ఎముకలు, వారిలో ఒకరు ధరించిన రిస్ట్‌వాచ్ లభ్యమైంది. లైఫ్‌జాకెట్‌కూడా దొరికింది. వీటన్నింటినీ చెన్నైకి చేర్చి ఆ తరువాత మీనంబాకం విమానాశ్రయంలో భద్రపరిచారు. విమానంలో ప్రయాణించిన అధికారుల తల్లిదండ్రులకు కబురుపెట్టామని,వారి నుంచి డీఎన్‌ఏను సేకరించి పరీక్షలు నిర్వహించిన తరువాతనే మృతుల వివరాలను నిర్ధారిస్తామని ఐజీ శర్మ తెలిపారు. విమానం గాలింపునకు 700 గంటలు సముద్రగర్భంలో, 200 గంటలు ఆకాశయానంలో వెచ్చించినట్లు తెలిపారు. కూలిన కోస్ట్‌గార్డ్ విమానంకు చెందిన 80 శాతం శకలాలు లభ్యమైనందున గాలింపును నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.



 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top