రోడ్డెక్కిన బస్సు | called off the strike in mumbai | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన బస్సు

Apr 2 2014 10:47 PM | Updated on Sep 2 2018 3:21 PM

బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్(బెస్ట్) బస్సులు మళ్లీ రోడ్డెక్కాయి.

సాక్షి, ముంబై: బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్(బెస్ట్) బస్సులు మళ్లీ రోడ్డెక్కాయి. హాంకాంగ్ రవాణా వ్యవస్థ తరహాలో ఉద్యోగుల డ్యూటీ షెడ్యూల్‌లో మార్పులు చేయాలని బెస్ట్ యాజమాన్యం తీసుకున్న  నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు మంగళవారం చేపట్టిన మెరుపు సమ్మెను బుధవారం సాయంత్రం విరమించారు. బెస్ట్ అధికారులతో యూనియన్ నాయకులు జరిపిన చర్చలు సఫలీకృతమవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బెస్ట్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో జరిగిన చర్చలు సఫలీకృతమవడంతో సమ్మె విరమిస్తున్నట్లు బెస్ట్ కార్మిక నాయకుడు శరద్ రావ్ ప్రకటించారు. అంతకుముందు బెస్ట్ ఉద్యోగుల సమ్మెవల్ల ముంబైకర్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవడంతో ఇటు కోర్టు, అటు వివిధ రంగాల నుంచి బెస్ట్ యజమాన్యంపై ఒత్తిడి వచ్చింది.

 దీంతో బుధవారం మధ్యాహ్నం కార్మిక నేతలు, బెస్ట్ అధికారులు మధ్య దాదాపు రెండు గంటలపాటు చర్చలు జరిగాయి. అయినా ఓ కొలిక్కి రాలేదు. కొత్త డ్యూటీ షెడ్యూల్‌ను రద్దు చేయాలని శరద్‌రావ్ పట్టుబట్టారు. బెస్ట్ అధికారులు కొత్త షెడ్యూల్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని, ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలనుబట్టి తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒక్కసారి అమలుచేసిన తర్వాత అలాగే కొనసాగిస్తారని శరద్ రావ్ వాగ్వాదానికి దిగారు. ఎటూ తేలకపోవడంతో కార్మిక నాయకులు సమావేశం నుంచి బయటకు వచ్చారు. చర్చలు విఫలమవడంతో సమ్మె తీవ్రత పెరిగే అవకాశముండటంతో బెస్ట్ యాజమాన్యం కొంతసేపటికి మళ్లీ యూనియన్ నాయకులను చర్చలకు ఆహ్వానించింది. డ్యూటీ షెడ్యూల్‌లో మార్పులు చేసి జూన్ ఒకటో తేదీ నుంచి అమలుచేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చారు. దీంతో సమ్మె విరమిస్తున్నట్లు రావ్ ప్రకటించారు.  

 సమ్మె కారణంగా బెస్ట్‌కు రూ.3.50 కోట్ల నష్టం..
 13 వేల మంది  డ్రైవర్లు, 14 వేల మంది కండక్టర్లు చేపట్టిన సమ్మె వల్ల మంగళవారం రోజున బెస్ట్ సంస్థకు రూ. 3.50 కోట్ల నష్టం వచ్చింది. బుధవారం కూడా బస్సులు రోడ్డెక్కకపోవడంతో రూ.1.75 కోట్లకు పైగా నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. మంగళవారం కేవలం 20 మంది డ్రైవర్లు, 17 మంది కండక్టర్లు మాత్రమే విధులకు హాజరయ్యారు. అయితే సమ్మె వల్ల బస్సులు బయటకు తీయలేదు. అనంతరం అధికారులు కొన్ని బస్సులు నడిపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పశ్చిమ కాందివలి ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు 276 నంబర్ బస్సుపై రాళ్లు విసిరి పారిపోయారు. ఈ ఘటనలో బస్సు ముందున్న అద్దాలు పగిలిపోయాయి. డ్రైవర్ మోతిలాల్ చవాన్ గాయపడ్డాడు. శతాబ్ది ఆస్పత్రికి తరలించగా, వైద్యులు తలకు మూడు కుట్లు వేశారు. స్థానిక చార్‌కోప్ పోలీసు స్టేషన్‌లో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదుచేశారు.

 రెండోరోజూ తిప్పలే...
 బెస్ట్ బస్సులు నడవకపోవడంతో మొదటిరోజు ఎదురైనా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బుధవారం ఉదయం అనేకమంది ఉద్యోగులు, పరీక్షలు రాసే విద్యార్థులు త్వరగానే రోడ్లెక్కారు. బస్సు కోసం వేచి చూడకుండా ట్యాక్సీ, ఆటోలను ఎక్కి తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఒకవైపు బస్సులు లేక ముంబైకర్లు ఉరుకులు పరుగులు తీస్తుంటే, మరోవైపు సందేట్లో సడేమియా అన్నట్లుగా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు ప్రయాణికుల నుంచి అందినకాడికి దండుకున్నారు. సమ్మె కారణంగా లోకల్ రైళ్లలో విపరీతంగా రద్దీ పెరిగింది. నిత్యం బస్సుల్లో రాకపోకలు సాగించేవారు లోకల్ రైళ్లను ఆశ్రయించారు. ఒక్కసారిగా జనం ఇటువైపు రావడంతో లోకల్ రైలు టికెట్ కౌంటర్లవద్ద క్యూ పెరిగిపోయింది. మరికొందరు రోడ్లపై ప్రైవేటు బస్సులు, టెంపోలు, త్రీ వీలర్లు, ఇలా ఏ వాహనం దొరికినా ఎక్కి తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఎట్టకేలకు సమ్మె విరమించడంతో ముంబైకర్లు ఊపిరి పీల్చుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement