మహాకూటమిలోకి ఎమ్మెన్నెస్‌ను చేర్చుకోవడంపై మోడీ దృష్టి | BJP will focus on AMNS | Sakshi
Sakshi News home page

మహాకూటమిలోకి ఎమ్మెన్నెస్‌ను చేర్చుకోవడంపై మోడీ దృష్టి

Oct 25 2013 10:43 PM | Updated on Mar 29 2019 9:18 PM

వచ్చే ఏడాదిలో జరగనున్న ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఇప్పటినుంచే రాజకీయ ఎత్తుగడలను ప్రారంభించింది.

సాక్షి, ముంబై: వచ్చే ఏడాదిలో జరగనున్న ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఇప్పటినుంచే రాజకీయ ఎత్తుగడలను ప్రారంభించింది. అధికారమే లక్ష్యంగా చేసుకొని ప్రణాళికలు రూపొందిస్తోంది. మూడుసార్లు అధికారానికి దూరంగా ఉన్న కాషాయ కూటమి ఈసారి విజయమే లక్ష్యంగా చేసుకొని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్‌పీఐ)ని చేర్చుకొని మహాకూటమిగా అవతరించింది. ఇప్పటికే ఈ కూటమి ఆధ్వర్యంలో ప్రజల సమస్యలతో పాటు అవినీతిపై ఆందోళనలు కూడా చేసింది. ప్రజల్లో కొంత క్రేజీ సంపాదించుకున్న ఈ మహాకూటమిలో రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) పార్టీని చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలెట్టింది.
 
 గత ఎన్నికల్లో శివసేన, బీజేపీల అత్యధిక శాతం ఓట్లు చీల్చి అధికారానికి దూరంగా ఉంచేలా చేసిన ఎమ్మెన్నెస్‌ను కలుపుకుంటే ఈసారి మరింత బలపడొచ్చని ఆశలు పెట్టుకుంది. ఇందుకోసం బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు ప్రముఖ నాయకులు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఒక వేళ ఈ ప్రయత్నాలు సఫలీకృతమైతే వచ్చే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో మహాకూటమితో ఎమ్మెన్నెస్ కూడా జతకట్టి బరిలోకి దిగే అవకాశముంది. ఇదేగనుక జరిగితే  ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీల డీఎఫ్ కూటమిని అధికార గద్దె దింపడానికి మార్గం మరింత సులభం కానుంది. గత ఎన్నికల్లో శివసేన, బీజేపీల అత్యధిక శాతం ఓట్లు ఎమ్మెన్నెస్ చీల్చింది. ఎమ్మెన్సెస్ అభ్యర్థులు లక్షాకుపైగా ఓట్లు రాబట్టుకున్నారు.
 
 దీంతో శివసేన, బీజేపీలకు తగిన మెజారిటీ రాలేదు. ఫలితంగా కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రధానంగా ముంబైలో ఈ పార్టీ తీవ్ర ప్రభావం చూపింది. కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు అభ్యర్థులు, ఎన్సీపీకి చెందిన కొందరు అభ్యర్థులు కేవలం ఐదు నుంచి 10 వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ మహాకూటమితో పొత్తు పెట్టుకుంటే గత ఎన్నికల పరిస్థితులతో పోలిస్తే పూర్తిగా తారుమారుకావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ మహాకూటమి నాయకులు లోక్‌సభ స్థానాలు చాలా తక్కువగా ఇచ్చే అవకాశాలున్నాయని ఎమ్మెన్నెస్ సీనియర్ నాయకులు అంటున్నారు. దీంతో ఎమ్మెన్నెస్ రాష్ట్రంలో సొంతంగా బరిలో దిగకూడదని మోడీ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి రాలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలు వేర్వేరుగా బరిలో దిగుతాయా..? లేక పొత్తు పెట్టుకుంటాయా..? అనే అంశం ఇంకా సందిగ్ధంలోనే ఉంది.
 
 ఇలాంటి కీలక సందర్భంలో మహాకూటమికి ఎమ్మెన్నెస్ లాంటి ధీటైన పార్టీ తోడు దొరికితే కాంగ్రెస్, ఎన్సీపీలను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇబ్బందుల్లోకి నెట్టేందుకు మార్గం సులభమవుందని మోడీ నమ్ముతున్నారు. రాజ్‌ఠాక్రేతో మరింత సన్నిహిత్యం ఉండటంతో తొందరగానే పొత్తు విషయం తెలుతుందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు గత రెండు దశాబ్ధాలుగా శివసేన, బీజేపీ కూటములుగా కొనసాగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మోడీ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎమ్మెన్నెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి మోడీ చేస్తున్న ప్రయత్నాలపై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఎంతవరకు సహకరిస్తారనే అనుమానాలు బీజేపీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement