 
															సుప్రీం ఆదేశాల మేరకు చర్యలు
రాష్ట్రంలో చిత్రదుర్గం, బళ్లారి, తుమకూరు జిల్లాల పరిధిలోని 51 సీ కేటగిరి గనుల వేలానికి సంబంధించి సుప్రీంకోర్టు, సీఈ
	సీ కేటగిరీ గనుల వేలంపై స్పందించిన సీఎం
	తుంగభద్ర పూడికతీత అసాధ్యం
	ప్రత్యామ్నాయలపై దృష్టి
	మంత్రి జారకిహోళికి శాఖ మార్పు
	మార్చిలో బడ్జెట్ సమావేశాలు
	 
	బళ్లారి : రాష్ట్రంలో చిత్రదుర్గం, బళ్లారి, తుమకూరు జిల్లాల పరిధిలోని 51 సీ కేటగిరి గనుల వేలానికి సంబంధించి సుప్రీంకోర్టు, సీఈసీ ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఆయన శనివారం బెంగళూరు నుంచి బాగల్‌కోటకు వెళుతూ జిందాల్ విమానాశ్రయంలో కాసేపు బస చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ...  ఇప్పటికే ఆ గనులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిశీలించారని, ఆయనతో చర్చించిన అనంతరం సుప్రీంకోర్టు, సీఈసీ ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుంటుందన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి పలు జిల్లాలకు తాగు, సాగు నీరందించే తుంగభద్ర డ్యాంలో పూడికతీత సాధ్యం కాదని తేల్చి చెప్పారు.
	
	అయితే ప్రత్యామ్నాయ మార్గాలపై అన్వేషణ చేస్తున్నామన్నారు. తుంగభద్రలోని పూడిక ద్వారా నష్టపోతున్న నీటిని ఎలా వినియోగించుకోవాలనే విషయంపై నిపుణులతో చర్చిస్తున్నట్లు గుర్తు చేశారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖమంత్రి సతీష్ జారకిహోళి శాఖ మార్పు, ఆయనకు ఏ శాఖ కేటాయించాలనే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల అనంతరం జారకిహోళికి సముచిత శాఖ కల్పిస్తామన్నారు. 2014-15వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చిలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయన్నారు. ఈసారి రాష్ట్ర ప్రజలు మెచ్చే విధంగా బడ్జెట్ ఉంటుందన్నారు. వచ్చే వారం బడ్జెట్‌కు సంబంధించి నిపుణులతో చర్చిస్తామన్నారు.   ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
