తప్పని నిరాశ.. రేపటికి వాయిదా

World Cup 2019 Rain Shifts India Vs New Zealand Semis To Reserve Day - Sakshi

మాంచెస్టర్ ‌: ప్రపంచకప్‌ తొలి సెమీస్‌ వర్షం కారణంగా రిజర్వ్‌డే(బుధవారం)కు వాయిదా పడింది. దీంతో క్రికెట్‌ ఫ్యాన్స్‌ తీవ్రంగా నిరాశచెందారు. మరో మూడు ఓవర్లలో న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ ముగుస్తుందనుకున్న సమయంలో చిరుజల్లులతో కూడిన వర్షం పడింది. అదికాస్త భారీ వర్షంగా మారడంతో మ్యాచ్‌ నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను రేపటికి వాయిదా వేశారు. మ్యాచ్‌ నిలిచిపోయే సమయానికి కివీస్‌ 46.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రాస్‌ టేలర్‌(67 నాటౌట్‌), లాథమ్‌(3 నాటౌట్‌)లు ఉన్నారు. రేపటి ఆట మధ్యాహ్నం 3 గంటలకు న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌తో మొదలవుతుంది. 

మ్యాచ్‌ను రేపటికి వాయిదా వేయడానికి ముందు అంపైర్లు తర్జనభర్జన పడ్డారు. ఎట్టిపరిస్థితిల్లోనూ ఈ రోజే మ్యాచ్‌ ముగించాలని భావించారు. వీలు కుదిరితే ఛేదనలో టీమిండియాను 20 ఓవర్లైనా ఆడించేందుకు ప్రయత్నించారు . అయితే వర్షం వస్తూ పోతుండటంతో మ్యాచ్‌ కొనసాగించడం కష్టమని భావించిన అంపైర్లు రిజర్వ్‌డేకు వాయిదా వేశారు. రిజర్వ్‌డే రోజు కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంటే లీగ్‌ దశలో ఎక్కువ పాయింట్లతో ఉన్న కోహ్లీసేన ఫైనల్‌ చేరుకుంటుంది.

అంతకుముందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు టీమిండియా బౌలర్లు చెడుగుడు ఆడుకున్నారు. భువనేశ్వర్‌ (1/30), జస్ప్రీత్‌ బుమ్రా (1/25) తొలి రెండు ఓవర్లను మెయిడిన్‌ వేశారు. ఒక్క పరుగు వద్దే ఫామ్‌లో లేని కివీస్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌ (1; 14 బంతుల్లో)ను బుమ్రా ఔట్‌ చేసి కివీస్‌కు షాక్‌ ఇచ్చాడు. ఈ క్రమంలో హెన్రీ నికోలస్‌ (28; 51 బంతుల్లో 2×4)తో కలిసి సారథి కేన్‌ విలియమ్సన్‌ (67; 95 బంతుల్లో 6×4) ఇన్నింగ్స్‌ చక్కదిద్దారు. జట్టు స్కోరు 69 వద్ద ఓ అద్భుతమైన బంతితో నికోలస్‌ను జడేజా క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. దీంతో 68 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఆ తర్వాత వచ్చిన సీనియర్‌ ఆటగాడు రాస్‌ టేలర్‌ (67నాటౌట్‌; 85 బంతుల్లో 3×4, 1×6)తో కలిసి విలియమ్సన్‌ ఇన్నింగ్స్‌ నడిపించాడు. అనంతరం అర్ధశతకం అందుకున్నాడు. భారత బౌలింగ్‌ దెబ్బకు కివీస్‌ 29 ఓవర్లకు గానీ 100 పరుగులు దాటలేదు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 65 పరుగులు జోడించారు. అర్ధశతకం తర్వాత దూకుడుగా ఆడే క్రమంలో చాహల్‌ బౌలింగ్‌లో విలియమ్సన్‌ ఔటయ్యాడు. అప్పుడు స్కోరు 134/3. జేమ్స్‌ నీషమ్‌ (12; 18 బంతుల్లో 1×4) కాసేపు నిలిచాడు. అతడిని పాండ్య ఔట్‌చేశాడు. క్రీజులోకి వచ్చిన  గ్రాండ్‌హోమ్‌ (16; 10 బంతుల్లో 2×4)తో కలిసి టేలర్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. దూకుడుగా ఆడుతూ అర్ధశతకం అందుకున్నాడు. అంతలోనే వర్షం ప్రారంభం అవడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top