క్రికెట్‌ కోసం ఫుట్‌బాల్‌ స్టేడియాన్ని  నాశనం చేస్తారా!  | Will you destroy the football stadium for cricket | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ కోసం ఫుట్‌బాల్‌ స్టేడియాన్ని  నాశనం చేస్తారా! 

Mar 21 2018 1:20 AM | Updated on Oct 2 2018 8:39 PM

Will you destroy the football stadium for cricket - Sakshi

తిరువనంతపురం: నవంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో ఒక మ్యాచ్‌ను కొచ్చి నగరానికి కేటాయించడం వివాదాస్పదంగా మారింది. ఫుట్‌బాల్‌కు గుర్తింపు పొందిన నెహ్రూ స్టేడియాన్ని క్రికెట్‌ కోసం పాడుచేయడం ఏమిటని పలువురు ఫుట్‌బాలర్లు, అభిమానులు కేరళ క్రికెట్‌ సంఘం (కేసీఏ) తీరును ఎండగడుతున్నారు. ఇప్పటికే కేసీఏ తిరువనంతపురంలో అత్యున్నత ప్రమాణాలతో క్రికెట్‌  స్టేడియాన్ని నిర్మించింది. గత నవంబర్‌లో భారత్, కివీస్‌ మధ్య మూడో టి20 కొత్త స్టేడియంలో జరిగింది. కానీ ఇక్కడ క్రికెట్‌ మ్యాచ్‌లు కాకుండా కొచ్చిలోని నెహ్రూ స్టేడియం (మల్టీపర్పస్‌)లో నిర్వహించేందుకు కేసీఏ సిద్ధమవుతుంది. ఇక్కడ గతేడాది  అండర్‌–17 ప్రపంచకప్‌ మ్యాచ్‌లు కూడా జరిగాయి. దీని కోసం స్టేడియంను ‘ఫిఫా’ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించాలంటే మైదానంలో తవ్వకాలు, పెనుమార్పులు తప్పవు.   

సచిన్‌ కూడా... 
ఐఎస్‌ఎల్‌లో కేరళ బ్లాస్టర్స్‌ జట్టుకు యజమాని అయిన క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కూడా దీనిపై స్పందించాడు. ‘ఫిఫా గుర్తింపు పొందిన కొచ్చి స్టేడియానికి జరగబోయే నష్టం గురించి ఆందోళనగా ఉంది. అటు క్రికెట్, ఇటు ఫుట్‌బాల్‌ రెండింటికీ సమస్య రాకుండా వ్యవహరించాలని కేరళ క్రికెట్‌ సంఘాన్ని కోరుతున్నా. రెండు ఆటల అభిమానులు నిరాశ పడరాదు. దీనిపై వినోద్‌రాయ్‌తో కూడా మాట్లాడాను. ఆయన ఈ విషయాన్ని పరిశీలిస్తానని చెప్పారు’ అని సచిన్‌ ట్వీట్‌ చేశాడు.  

Advertisement
 
Advertisement
Advertisement