వీవీఎస్ అకాడమీ సిద్ధం | VVS laxman academy ready | Sakshi
Sakshi News home page

వీవీఎస్ అకాడమీ సిద్ధం

Mar 12 2015 12:29 AM | Updated on Sep 2 2017 10:40 PM

వీవీఎస్ అకాడమీ సిద్ధం

వీవీఎస్ అకాడమీ సిద్ధం

చాలా మంది మాజీ క్రికెటర్ల బాటలోనే హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఇప్పుడు కోచింగ్‌లోకి ప్రవేశిస్తున్నాడు.

వచ్చే నెలలో ప్రారంభించనున్న లక్ష్మణ్
 సాక్షి, హైదరాబాద్: చాలా మంది మాజీ క్రికెటర్ల బాటలోనే హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఇప్పుడు కోచింగ్‌లోకి ప్రవేశిస్తున్నాడు. 134 టెస్టుల్లో 8,781 పరుగులు చేసిన ఈ దిగ్గజ ఆటగాడు త్వరలోనే నగరంలో సొంత క్రికెట్ కేంద్రాన్ని ప్రారంభించనున్నాడు. ‘వీవీఎస్ స్పోర్ట్స్ అకాడమీ’ పేరుతో సిద్ధమవుతున్న ఈ అకాడమీ ఏప్రిల్ 4న ప్రారంభం కానుంది. బుధవారం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ ఈ వివరాలు వెల్లడించారు. నగర శివార్లలోని శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ మైదానంలో ఇది ఏర్పాటవుతోంది.
 
 ప్రాథమికంగా రెండు నెలల పాటు ప్రత్యేక వేసవి శిక్షణ శిబిరం నిర్వహించి, ఆ తర్వాత పూర్తి స్థాయిలో కోచింగ్‌ను కొనసాగిస్తారు. భిన్న రకాల వికెట్లతో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని, తనకు ఇంతటి స్థాయి కల్పించిన ఆటకు ఇది సేవ చేయడమేనని అన్నాడు. ‘2012లో నేను రిటైర్ అయిననాటినుంచి చాలా మంది అకాడమీ ఎప్పుడు పెడుతున్నారని అడిగేవారు. నాకున్న గుర్తింపు ప్రకారం, వారి అంచనాలను ఏ మాత్రం తగ్గకుండా అత్యుత్తమ శిక్షణ అందించడం నా బాధ్యత. ఇది నా కలల ప్రాజెక్ట్. సీనియర్ కోచ్‌లు ఇక్కడ శిక్షణ ఇవ్వనుండగా...నాకున్న స్నేహాలతో పలు విదేశీ క్రికెటర్ల ద్వారా కూడా ప్రత్యేక కోచింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాను.
 
 సాధ్యమైనంత ఎక్కువ సమయం నేను కూడా శిక్షణ అందించేందుకు వెచ్చిస్తాను. వచ్చే కొన్నేళ్లలో గొప్ప ఆటగాళ్లు నా అకాడమీలో తయారు కావాలని, ఆటగాడిగానే కాకుండా యువ ఆటగాళ్లను తీర్చిదిద్దిన వ్యక్తిగా కూడా నన్ను గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటున్నా’ అని ఈ సందర్భంగా లక్ష్మణ్ వ్యాఖ్యానించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement