
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ తర్వాత టీమిండియాతో పాటు హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌కు కూడా విశ్రాంతి లభించింది. దాదాపు నెలరోజులుగా ఈ మాజీ క్రికెటర్ ఎక్కువగా కుటుంబానికే సమయం కేటాయించాడు. ఇక ఇటీవల ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL)-2025 ఫైనల్‌కు కూడా గౌతీ హాజరయ్యాడు.
ఈ క్రమంలో ఓ ఫన్ సెగ్మెంట్‌లో గంభీర్ భాగమయ్యాడు. ఈ పదం వినగానే మీకు ఏ క్రికెటర్ గుర్తుకువస్తారు అంటూ యాంకర్ అడుగగా.. ఈ ఢిల్లీ స్టార్ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చాడు. ‘క్లచ్ (క్లిష్ట పరిస్థితులు, ఒత్తిడిలో గొప్పగా రాణించే ఆటగాడు’ ఎవరన్న ప్రశ్నకు గంభీర్.. సచిన్ టెండుల్కర్ పేరు చెప్పాడు.
ఇక ‘దేశీ బాయ్’గా విరాట్ కోహ్లిని అభివర్ణించిన గౌతీ.. స్పీడ్ అన్న పదం వినగానే తనకు భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా గుర్తుకువస్తాడన్నాడు. అదే విధంగా.. ‘గోల్డెన్ ఆర్మ్ (పార్ట్ టైమ్ బౌలరే అయినా కీలక వికెట్లు పడగొట్టే ఆటగాడు)’ అనగానే నితీశ్ రాణా పేరు చెప్పిన గంభీర్.. ‘మోస్ట్ స్టైలిష్’ అన్న పదానికి శుబ్‌మన్ గిల్ పేరు చెప్పాడు.
ఇక ‘మిస్టర్ కన్సిస్టెంట్’గా రాహుల్ ద్రవిడ్‌ను పేర్కొన్న గంభీర్.. ‘రన్‌మెషీన్’ అనగానే తనకు వీవీఎస్ లక్ష్మణ్ గుర్తుకువస్తాడని తెలిపాడు. ‘మోస్ట్ ఫన్నీ’గా రిషభ్ పంత్ పేరు చెప్పిన గంభీర్.. ‘డెత్ ఓవర్ స్పెషలిస్టు’గా జహీర్ ఖాన్‌కు ఓటేశాడు.
కాగా 2024లో టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత రాహుల్ ద్రవిడ్ హెడ్‌కోచ్ పదవి నుంచి తప్పుకోగా.. గంభీర్ ఆ బాధ్యతలు చేపట్టాడు. వన్డే, టీ20లలో కోచ్‌గా వరుస విజయాలు సాధించిన ఈ ఢిల్లీ మాజీ బ్యాటర్.. టెస్టుల్లో మాత్రం విఫలమయ్యాడు.
గంభీర్ మార్గదర్శనంలో స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో తొలిసారి 3-0తో వైట్‌వాష్‌కు గురైన టీమిండియా.. తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (3-1)తో కోల్పోయింది. అయితే, ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో టీమిండియా మెరుగైన ప్రదర్శన కనబరిచింది.
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టెస్టు రిటైర్మెంట్ తర్వాత.. శుబ్‌మన్ గిల్ సారథ్యంలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు.. ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఇందులో బర్మింగ్‌హామ్ టెస్టు విజయం ప్రత్యేకమైనది. ఈ వేదికపై తొలిసారి భారత్ టెస్టు గెలవడం విశేషం. ఈ సానుకూల ఫలితాలు గంభీర్‌కు కాస్త ఉపశమనం కలిగించాయి.
ఇక తదుపరి ఆసియా కప్-2025 టోర్నమెంట్‌తో టీమిండియాతో పాటు గంభీర్ బిజీ కానున్నాడు. ఈసారి టీ20 ఫార్మాట్లో సెప్టెంబరు 9-28 వరకు ఈ టోర్నీ జరుగనుంది. కాగా ఈ ఏడాది గంభీర్ మార్గదర్శనంలో టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. గతేడాది ప్రారంభమైన ఢిల్లీ ప్రీమియర్ లీగ్.. రెండో ఎడిషన్ ఆదివారం ముగిసింది. అరుణ్‌జైట్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో.. నితీశ్ రాణా కెప్టెన్సీలోని వెస్ట్ ఢిల్లీ లయన్స్.. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా డీపీఎల్-2025 చాంపియన్‌గా అవతరించింది.