కౌంట్‌డౌన్‌ 5..4..3..2..1...

Today is India first ODI in Hyderabad - Sakshi

నేడు హైదరాబాద్‌లో భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డే

వరల్డ్‌ కప్‌కు ముందు చివరి సిరీస్‌

శక్తియుక్తులను పరీక్షించుకోనున్న టీమిండియా 

ఉత్సాహంతో ఆసీస్‌

భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్‌ అనేది పేరుకు మాత్రమే. అటు భారత ఆటగాళ్ల దృష్టిలో, మన అభిమానుల కోణంలో కూడా రాబోయే వరల్డ్‌ కప్‌ గురించే ఆలోచనలన్నీ. ప్రతిష్టాత్మక టోర్నీకి ముందు మనవాళ్లు ఎలా ఆడతారు? మిగిలిపోయిన లోపాలేమైనా ఉంటే వాటిని ఎలా సరిదిద్దుకుంటారు? అన్ని బాగా కుదిరాయి అనుకున్నా మెరుగుపర్చుకోవాల్సిన అంశాలు ఇంకా ఉన్నాయేమో? ఆసీస్‌తో సిరీస్‌ను కెప్టెన్‌ కోహ్లి సహా టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఇదే రీతిలో చూస్తోంది. ప్రపంచ కప్‌ కోసం దాదాపుగా ఇదే జట్టు అయినా చివరి ఒకటి లేదా రెండు స్థానాలు దక్కించుకునే ప్రయత్నంలో అవకాశం అందుకున్న వారు ఎలా రాణిస్తారనేది కీలకం కానుంది. ఈ నేపథ్యంలో విశ్వపోరుకు కౌంట్‌డౌన్‌గా సాగబోతున్న సిరీస్‌ తొలి మ్యాచ్‌కు భాగ్యనగరం వేదికైంది. టి20 సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా 50 ఓవర్ల పోరును ఎలా ప్రారంభిస్తుందనేది ఆసక్తికరం.  

సాక్షి, హైదరాబాద్‌:వన్డే ప్రపంచ కప్‌లో భారత్‌ తమ తొలి మ్యాచ్‌ ఆడేందుకు దాదాపు వంద రోజుల సమయం ఉంది. అయితే మెగా టోర్నీకి ముందు ఆడనున్న ఆఖరి వన్డే సిరీస్‌తో ఇప్పటి నుంచే వరల్డ్‌ కప్‌ వేడి కనిపిస్తోంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌తో పోరుకు తెర లేవనుంది. అనూహ్యంగా స్వదేశంలో టి20 సిరీస్‌ ఓడిన అనంతరం కోహ్లి సేన తన అసలు సత్తాను ప్రదర్శించాలని పట్టుదలగా ఉండగా, అటు విజయం ఇచ్చిన కొత్త ఉత్సాహంతో కంగారూలు ఆటకు సిద్ధమయ్యారు.  

రాహుల్‌కు అవకాశముందా!  
కోహ్లి నాయకత్వంలో భారత జట్టు న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో చివరిసారిగా ఆడింది. సిరీస్‌ గెలిచాక జరిగిన తర్వాతి రెండు వన్డేలలో టీమిండియా ప్రయోగాలు చేసింది. కాబట్టి మూడో వన్డే జట్టునే తీసుకుంటే తుది 11 మంది విషయంలో సందేహాలు అనవసరం. రోహిత్, ధావన్‌ల ఓపెనింగ్‌కు తోడు కోహ్లి మూడో స్థానంలో ఎప్పటిలా చెలరేగితే భారత్‌ ఆధిపత్యం ప్రదర్శించడం ఖాయం. నాలుగో స్థానాన్ని ఖాయం చేసుకున్న అంబటి రాయుడు  సొంతగడ్డపై తనదైన శైలిలో మరో చక్కటి ఇన్నింగ్స్‌ ఆడాలని పట్టుదలతో ఉన్నాడు. మిడిలార్డర్‌లో ఆ తర్వాత జాదవ్, ధోని అతడిని అనుసరిస్తారు. వీరిద్దరినుంచి జట్టు మేనేజ్‌మెంట్‌ మెరుగైన ప్రదర్శన ఆశిస్తోంది. హార్దిక్‌ పాండ్యా గైర్హాజరు నేపథ్యంలో ఆల్‌రౌండర్‌గా విజయ్‌ శంకర్‌కు మరో అవకాశం దక్కడం ఖాయం. ఇద్దరు స్పిన్నర్లుగా చహల్, కుల్దీప్‌ యాదవ్‌ మళ్లీ చెలరేగితే ఆసీస్‌కు కష్టాలు తప్పవు. బుమ్రా, షమీ ప్రధాన పేసర్లుగా బరిలోకి దిగుతారు. కాబట్టి మూడో పేసర్‌గా సిద్ధార్థ్‌ కౌల్‌ తొలి రెండు వన్డేలకు ఎంపికైనా... అతనికి తుది జట్టులో చోటు కష్టమే. మరోవైపు వన్డేల్లో సత్తా నిరూపించుకోవాలని ఆశిస్తున్న కేఎల్‌ రాహుల్, రిషభ్‌ పంత్‌లకు మేనేజ్‌మెంట్‌ ఎలా అవకాశం కల్పిస్తుందనేది చూడాలి. విజయ్‌ శంకర్‌కు బదులుగా వీరిద్దరిలో ఒకరికి చోటిస్తే ఐదో బౌలర్‌ కోటా పూర్తి చేయడం కష్టమవుతుంది. రాహుల్‌పై జట్టు పెంచుకున్న నమ్మకం, కోహ్లి మద్దతు చూస్తే అతడిని ఈ సిరీస్‌లో తగిన విధంగా పరీక్షించాలని జట్టు భావిస్తోంది. అదే జరిగితే రాయుడు స్థానంలో ఆడించవచ్చు. మరోవైపు అనూహ్యంగా వన్డేల్లో చోటు కోల్పోయిన దినేశ్‌ కార్తీక్‌ కూడా టీమ్‌ బయట నుంచి జట్టు ప్రదర్శన చూస్తూ తన ఆశలు పెంచుకుంటాడనడంలో సందేహం లేదు.  

ఫించ్‌తోనే సమస్య! 
టి20 సిరీస్‌ను 2–0తో గెలుచుకున్న జోరులో ఉన్న ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌పై కూడా కన్నేసింది. భారత గడ్డపై వన్డేల్లో మంచి రికార్డు ఉండటం ఆసీస్‌ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. ఆసీస్‌ టి20, వన్డే సిరీస్‌ల కోసం ఒకే జట్టుతో భారత్‌కు వచ్చింది. అయితే కొందరు ప్రధాన ఆటగాళ్లు వన్డేల్లోకి బరిలోకి దిగనున్నారు. రెగ్యులర్‌ ఆటగాళ్లు ఫించ్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, హ్యాండ్స్‌కోంబ్‌లను మినహాయిస్తే కొన్ని మార్పులు ఉంటాయి. వికెట్‌ కీపర్‌గా అలెక్స్‌ క్యారీ జట్టులోకి వచ్చే అవకాశం ఉండగా, మూడో స్థానంలో ఉస్మాన్‌ ఖాజా ఆడతాడు. ఇద్దరు స్పిన్నర్ల కూర్పు అయితే∙ఆడమ్‌ జంపాతో పాటు ఆఫ్‌ స్పిన్నర్‌ నాథన్‌ లయన్‌ బరిలోకి దిగుతాడు. టెస్టుల్లో అద్భుతమైన ఆటగాడైన లయన్‌ భారత గడ్డపై తెల్ల బంతితో ఎలా రాణిస్తాడో చూడాలి. వన్డే స్పెషలిస్ట్‌ ఆస్టన్‌ టర్నర్‌పై కూడా ఆసీస్‌ బాగా ఆశలు పెట్టుకుంది. అయితే టి20లతో పోలిస్తే భారత బౌలింగ్‌ను ఎదుర్కొని 50 ఓవర్ల పాటు ఆస్ట్రేలియా నిలబడగలదా అనేదే సమస్య. ఇటీవల సొంతగడ్డపైనే ఆ జట్టు భారత్‌ చేతిలో సిరీస్‌ కోల్పోయింది. అటు పేసర్లు, ఇటు స్పిన్నర్లు చెలరేగుతుండగా ఏ ఒక్క బ్యాట్స్‌మన్‌ కూడా తన ముద్ర వేయలేకపోయారు. సిరీస్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన షాన్‌ మార్‌‡్ష వ్యక్తిగత కారణాలతో తొలి వన్డేకు దూరమయ్యాడు. శుక్రవారం ఉదయమే అతను హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అన్నింటికి మించి కెప్టెన్‌ ఫించ్‌ ఫామ్‌ జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. గత 7 వన్డేల్లో అతను ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేదు. టాపార్డర్‌లో అతను చెలరేగితేనే ఆసీస్‌ విజయంపై ఆశలు పెంచుకోవచ్చు. పేస్‌లో కమిన్స్‌తో పాటు కూల్టర్‌నీల్, రిచర్డ్సన్‌లలో ఒకరికి అవకాశం దక్కుతుంది.  

పిచ్, వాతావరణం 
రాజీవ్‌గాంధీ స్టేడియంలో చక్కటి బ్యాటింగ్‌ వికెట్‌ సిద్ధం. ముందుగా బ్యాటింగ్‌ చేసే జట్టు భారీ స్కోరు చేసేందుకు అవకాశం ఉంది.  నగరంలో మార్చి తొలి వారం ఎండలు ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి వాతావరణం వల్ల ఆటకు ఎలాంటి సమస్య లేదు.

ఆ ‘175’ గుర్తుందా? 
463 వన్డేలాడిన క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కెరీర్‌లో డబుల్‌ సెంచరీ తర్వాతి స్థానం 175 పరుగుల ఇన్నింగ్స్‌దే. దానికి వేదికగా నిలిచింది ఉప్పల్‌ మైదానమే. నాటి ప్రత్యర్థి కూడా ఆస్ట్రేలియానే కావడం విశేషం. 2009 నవంబరు 5న జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 4 వికెట్ల నష్టానికి 350 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో తొలుత వీరేంద్ర సెహ్వాగ్‌ (38), తర్వాత సురేశ్‌ రైనా (59) తోడుగా సచిన్‌ వీరోచిత ఇన్నింగ్స్‌ (141 బంతుల్లో 175; 19 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆడాడు. కానీ, లక్ష్యానికి 18 బంతుల్లో 19 పరుగులు అవసరమైన స్థితిలో సచిన్‌ ఔటవడంతో టీమిండియా 347 పరుగుల వద్దే ఆగి 3 పరుగులతో ఓడింది. అయినా సరే భారీ స్కోర్ల ఈ మ్యాచ్‌ అభిమానులకు, ముఖ్యంగా హైదరాబాదీలకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

 0–2 
ఈ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య 2 వన్డేలు  జరగ్గా రెండూ ఆసీస్‌ గెలిచింది. 2007లో 47 పరుగులతో, 2009లో 3 పరుగులతో నెగ్గింది.

తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, ధావన్, రాయుడు/రాహుల్, జాదవ్, ధోని, విజయ్‌ శంకర్, చహల్, కుల్దీప్, బుమ్రా, షమీ. 
ఆస్ట్రేలియా: ఫించ్‌ (కెప్టెన్‌), ఖాజా, టర్నర్, హ్యాండ్స్‌కోంబ్, స్టొయినిస్, మ్యాక్స్‌వెల్, కారీ, జంపా, కమిన్స్, రిచర్డ్సన్, బెహ్రన్‌డార్ఫ్‌/లయన్‌. 

ఓటమి ఎదురైనా ప్రయోగాలు చేయాలని లేదు...
ఒక్కో ఆటగాడిని వేర్వేరు పరిస్థితుల్లో పరీక్షిస్తున్నాం. ప్రతీ జట్టులాగే వరల్డ్‌ కప్‌కు ముందు అన్నీ చక్కబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నాం. నాలుగో స్థానంలో ఆడేందుకు నాకెలాంటి సమస్య లేదు. çవరల్డ్‌ కప్‌ తుది జట్టు ఎలా ఉంటుందో నేను చెప్పలేను కానీ రాహుల్‌ తన ఆటతో కచ్చితంగా అవకాశం సృష్టించుకున్నాడు. టి20 సిరీస్‌ ముగిసిన కథ. బాగా ఆడలేదు కాబట్టే ఓడాం. ఓటమి ఎదురైనా ప్రయోగాలు చేయాలని నేను అనుకోను. మేమంతా గెలవడం కోసమే ఆడుతున్నాం. వరల్డ్‌ కప్‌ జట్టు ఎంపికలో ఐపీఎల్‌ ప్రదర్శన పాత్ర ఏమీ ఉండదు. ఎందుకంటే ఐపీఎల్‌ మొదలయ్యే సమయానికే జట్టు ఏమిటో తెలిసిపోతుంది.     
– విరాట్‌ కోహ్లి, భారత కెప్టెన్‌  

మధ్యాహ్నం గం.1.30 నుంచి  స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top