మ్యాచ్‌కు రూ. 1.92 కోట్లు | Star India wins ‘Team Sponsorship’ rights | Sakshi
Sakshi News home page

మ్యాచ్‌కు రూ. 1.92 కోట్లు

Dec 10 2013 2:18 AM | Updated on Sep 2 2017 1:25 AM

మ్యాచ్‌కు రూ. 1.92 కోట్లు

మ్యాచ్‌కు రూ. 1.92 కోట్లు

దాదాపు పదేళ్లపాటు భారత క్రికెట్ జట్టుతో మమేకమైన సహారా గ్రూప్ లోగో ఇకపై ఆటగాళ్ల జెర్సీలపై కనిపించదు. సహారా స్థానంలో స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జట్టు నూతన స్పాన్సర్‌గా వ్యవహరించనుంది.

చెన్నై: దాదాపు పదేళ్లపాటు భారత క్రికెట్ జట్టుతో మమేకమైన సహారా గ్రూప్ లోగో ఇకపై ఆటగాళ్ల జెర్సీలపై కనిపించదు. సహారా స్థానంలో స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జట్టు నూతన స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. మూడేళ్లపాటు బీసీసీఐతో ఈ ఒప్పందం కొనసాగుతుంది.

అయితే సహారా.. స్టార్ ఇండియా కన్నా ఎక్కువ మొత్తంతో వేలంలో పాల్గొన్నప్పటికీ గత విభేదాల దృష్ట్యా బోర్డు సహారా బిడ్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. ‘బీసీసీఐ, ఐసీసీ, ఏసీసీ ఈవెంట్స్‌లో ఆడే భారత జట్టు స్పాన్సర్‌షిప్ హక్కులను స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. ఇవి జనవరి 1, 2014 నుంచి మార్చి 31, 2017 వరకు అమల్లో ఉంటాయి. ఈ హక్కుల కోసం పోటీలో ఉన్న ఏడు బిడ్‌లను పరిశీలించాం.

 ఈ సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు బిడ్స్‌ను ఆహ్వానించాం. చివరికి పోటీలో స్టార్, సహారా ఇండియా ఫైనాన్షియల్ కార్పొరేషన్ నిలిచాయి. దీంట్లో సహారా బిడ్ ఆమోదయోగ్యం కాదని గుర్తించాం. అలాగే స్టార్ గ్రూప్ 2018 వరకు భారత క్రికెట్ ప్రసార, ఇంటర్నెట్, మొబైల్ హక్కులను కూడా కలిగి ఉంటుంది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి వచ్చే మార్చి 31 వరకు బీసీసీఐ అంతర్జాతీయ, దేశవాళీ మ్యాచ్‌లకు స్టార్ గ్రూప్ టైటిల్ స్పాన్సర్‌గా ఇప్పటికే వ్యవహరిస్తోంది’ అని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. అధికారిక టీమ్ స్పాన్సర్ హోదాలో స్టార్ గ్రూప్ తమ లోగోను పురుషుల జాతీయ జట్టు, అండర్-19 పురుషుల జట్టు, ‘ఎ’ జట్టు, మహిళల జట్టు ఆటగాళ్ల జెర్సీలపై కలిగి ఉంటుంది. అయితే స్టార్‌తో ఏర్పరుచుకున్న ఒప్పందం ద్వారా తమకు ఎంత మొత్తం సమకూరేదీ బీసీసీఐ వెల్లడించలేదు. ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత్ ఆడే ఒక్కో మ్యాచ్‌కు రూ.కోటీ 92 లక్షలు ఇవ్వనున్నట్టు సమాచారం. ఐసీసీ ఆధ్వర్యంలో జరిగే మల్టీనేషనల్ టోర్నీలలో భారత్ ఆడే మ్యాచ్‌లకు మాత్రం రూ. 61 లక్షల చొప్పున చెల్లిస్తారు.
 మ్యాచ్‌కు కనీస ధర తగ్గించిన బోర్డు
 మూడేళ్ల క్రితం బీసీసీఐ తమ ఒక్కో మ్యాచ్‌కు కనీస ధరను రూ.2.5 కోట్లుగా నిర్ణయించింది. అప్పట్లో పోటీకి వచ్చిన ఎయిర్‌టెల్ (రూ.2.89 కోట్లు)ను అధిగమించి సహారా ఒక్కో మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో రూ.3.34 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఆర్థిక ప్రపంచంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా ఈసారి బీసీసీఐ తమ కనీస ధరను తగ్గించుకుని రూ. కోటీ 50 లక్షలుగా నిర్ణయించింది. ఇప్పుడు ఒక్కో మ్యాచ్‌కు బోర్డు గతంతో పోలిస్తే రూ.కోటీ 42 లక్షల ఆదాయం కోల్పోనుంది.
 ముందే ఎందుకు వద్దనలేదు: సహారా
 జట్టు స్పాన్సర్‌షిప్ వ్యవహారమంతా లోపభూయిష్టంగా ఉందని సహారా గ్రూప్ ధ్వజమెత్తింది. తమతో విభేదాల దృష్ట్యానే బిడ్ నుంచి పక్కకు తప్పించారని ఆరోపించింది. ‘మాతో గొడవ ఉందనుకుంటే ప్రారంభంలోనే మాపై ఎందుకు అనర్హత వేటు వేయలేదు. ఇదంతా ముందే అనుకున్న వ్యవహారంగా స్పష్టంగా తేలిపోయింది.  బీసీసీఐ ప్రతీ మ్యాచ్‌కు మేం రూ.2.35 కోట్లు, ఐసీసీ మ్యాచ్‌కు రూ.91 లక్షలు ఇస్తామని బిడ్ వేశాం. ఓవరాల్‌గా మా మొత్తం బిడ్ రూ.252 కోట్లుగా ఉంది. స్టార్ మాత్రం రూ.203 కోట్లు మాత్రమే ఇస్తామంది’ అని సహారా కార్పొరేట్ కమ్యూనికేషన్స్ హెడ్ అభిజిత్  ఆరోపించారు. ఐపీఎల్ నుంచి పుణే వారియర్స్ జట్టును బీసీసీఐ తొలగించినప్పటి నుంచి సహారాకు, బోర్డుకు పడటం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement