సెక్స్‌ ఫర్‌ సెలక్షన్‌.. పెను కలకలం

Sex For Selection Sting Rajeev Shukla Aide Resigned - Sakshi

‘జట్టులో చోటు దక్కాలంటే అమ్మాయిలను ఫైవ్‌స్టార్‌ హోటళ్లకు పంపాల్సిందే... అలా అయితేనే టీమ్‌లో నువ్వు ఉంటావ్‌... లేకపోతే  ఈ జన్మలో టీమ్‌ తరపున ఆడలేవ్‌’.. ఇది సెక్స్‌ ఫర్‌ సెలక్షన్ స్టింగ్‌ ఆపరేషన్‌లో వెలుగు చూసిన విషయం.  ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ)లో వెలుగు చూసిన ఈ స్కాండల్‌తో క్రీడా రంగం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.  ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మహమ్మద్ అక్రమ్ సైఫీ  ఇందులో భాగస్వామి కావటంతో.. ఈ అంశం మరింత చర్చనీయాంశంగా మారింది. 

సాక్షి, ముంబై/న్యూఢిల్లీ:  రాష్ట్ర స్థాయి క్రికెట్ జట్టులోకి ఎంపిక చేయాలంటే తనకు అందమైన అమ్మాయిలను సరఫరా చేయాలని అక్రమ్ సైఫీ డిమాండ్ చేసినట్లు యూపీ యువ క్రికెటర్ రాహుల్‌ శర్మ ఆరోపణలు చేశాడు. ఈ మేరకు ఓ ప్రముఖ న్యూస్‌ ఛానెల్‌ సాయంతో స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించి వ్యవహారం మొత్తం వెలుగులోకి తెచ్చాడు.  ఈ మేరకు అక్రమ్, శర్మ మధ్య జరిగిన ఫోన్ సంప్రదింపుల ఆడియో టేప్‌ను కూడా ఆ న్యూస్ ఛానెల్ ప్రసారం చేసింది. 

స్టింగ్‌ ఆపరేషన్‌... ‘ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ)లో చాలా మంది పెద్దలున్నారు. వాళ్లందరినీ ఒప్పించాలంటే న్యూఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్‌కి అమ్మాయిలను పంపించాలి’ అని శర్మను అక్రమ్ అడిగినట్లు ఆడియో టేప్‌లో తెలుస్తోంది. జట్టులో తనకు కచ్చితంగా స్థానం కల్పిస్తానని శర్మకు అక్రమ్ చెప్పడం మరో ఫోన్ సంభాషణలో స్పష్టమైంది. జట్టులోకి ఎంపిక చేయాలంటే డబ్బుకు బదులు తనకు అమ్మాయిలను సరఫరా చేయాలని అక్రమ్ అడిగినట్లు ఉత్తర ప్రదేశ్ క్రికెటర్ రాహుల్ శర్మ ఆరోపించాడు. అంతేకాకుండా చాలా మంది ఆటగాళ్లకు ఆయన నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి బీసీసీఐ టోర్నమెంట్లలో పాల్గొనేందుకు సహాయపడుతున్నాడని శర్మ ఆరోపించాడు. శర్మతో పాటు మరికొంత మంది ఆటగాళ్లు అక్రమ్‌పై ఆరోపణలు చేశారు. అయితే వారు తమ పేర్లను బయటపెట్టడానికి ఇష్టపడలేదు. యూపీ క్రికెట్ అసోసియేషన్‌లో అక్రమ్‌కు ఎలాంటి పదవి లేకపోయినప్పటికీ.. ఈ వ్యవహారాలను అతనే దగ్గరుండి నడిపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 

రాజీనామా.. తొలుత ఆరోపణలుగా ఖండిచిన సైఫీ.. విమర్శలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో గురువారం తన పదవికి రాజీనామా చేశాడు. మరోవైపు అనుచరుడి రాజీనామాను శుక్లా వెంటనే ఆమోదించినట్లు తెలుస్తోంది. అయితే శుక్లా లాంటి పెద్దల అండ ఉన్న తనపై.. కావాలనే కుట్ర పన్నుతున్నారని అక్రమ్‌ చెబుతున్నారు. బీసీసీఐ దర్యాప్తులో అసలు వాస్తవాలు వెల్లడౌతాయన్న ఆశాభావం సైఫీ వ్యక్తం చేస్తున్నాడు.

దిగ్భ్రాంతి... కాగా, ఈ వ్యవహారంపై పలువురు ఆటగాళ్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్పీ సింగ్, మహమ్మద్ కైఫ్‌ తదితరులు ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ విషయంలో శుక్లా పారదర్శకంగా వ్యవహరించి.. యంగ్‌ టాలెంట్‌కు న్యాయం చేస్తారని భావిస్తున్నట్లు ట్వీట్లు చేశారు. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top