ప్రియా సెంచరీ వృథా

Priya Punia scores century but Australia win Second ODI - Sakshi

రెండో వన్డేలో భారత మహిళల ‘ఎ’ జట్టు ఓటమి

బ్రిస్బేన్‌: తొలి వన్డేలో భారీ విజయం సాధించిన భారత మహిళల ‘ఎ’ జట్టు రెండో వన్డేలో మాత్రం తడబడింది. ఆస్ట్రేలియా ‘ఎ’తో మూడు అనధికారిక వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్‌ ‘ఎ’ 81 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ‘ఎ’ 50 ఓవర్లలో 5 వికెట్లకు 315 పరుగులు చేసింది. జార్జియా రెడ్‌మేన్‌ (128 బంతుల్లో 113; 10 ఫోర్లు, సిక్స్‌), ఎరిన్‌ అలెగ్జాండ్రా బర్న్స్‌ (59 బంతుల్లో 107; 13 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీలు సాధించారు.

భారత ‘ఎ’ బౌలర్లలో దేవిక వైద్యకు రెండు వికెట్లు లభించాయి. 316 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ ‘ఎ’ 44.1 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు ప్రియా పూనియా (127 బంతుల్లో 112; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు), షెఫాలీ వర్మ (36 బంతుల్లో 46; 5 ఫోర్లు, సిక్స్‌) తొలి వికెట్‌కు 17 ఓవర్లలో 98 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. అయితే షెఫాలీ అవుటయ్యాక... ప్రియా సెంచరీ పూర్తి చేసుకోగా... మిగతా వారు క్రీజులో నిలదొక్కుకోవడంలో విఫలమయ్యారు. హేమలత, అరుంధతి రెడ్డి, అనూజా పాటిల్, తనూజ కన్వర్‌ ఖాతా తెరవకుండానే అవుటయ్యారు. ఫలితంగా భారత ‘ఎ’ మహిళలకు ఓటమి తప్పలేదు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు 1–1తో సమంగా ఉన్నాయి. చివరిదైన మూడో వన్డే సోమవారం జరుగుతుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top