ఆఖరి వన్డేలో కివీస్‌ అలవోక విజయం

New zealand womens Beats India By 8 Wickets In 3rd ODI Against Team india - Sakshi

హామిల్టన్‌: న్యూజిలాండ్‌ మహిళల క్రికెట్‌ జట్టు ఆఖరి వన్డేలో టీమిండియాపై ఆలవోక విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మిథాలీ సేన క్లీన్‌స్వీప్‌ చేయకుండా కివీస్‌ జట్టు విజయవంతంగా అడ్డుకుంది. చివరి వన్డేలో ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందిన కివీస్‌ జట్టు మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో అంతరాన్ని తగ్గించింది.  ఇక ఇప్పటికే వన్డే సిరీస్‌ను చేజిక్కించుకున్న టీమిండియా చివరి వన్డేలో అన్ని విభాగాల్లో పూర్తిగా విఫలమైంది. దీంతో టీమిండియా నిర్దేశించిన 150 పరుగుల సునాయస లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు 29.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి పూర్తి చేసింది.  కివీస్‌ స్టార్‌ బ్యాటర్‌ సజై బేట్స్‌ (57; 64 బంతుల్లో 8ఫోర్లు, 1 సిక్సర్‌), సారథి సాటర్త్‌వెయిట్‌ (66 నాటౌట్‌; 74 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్‌)లు అర్థసెంచరీలు సాధించి విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇక చివరి వన్డేలో టీమిండియాను స్వల్పస్కోర్‌కే కట్టడి చేయడంతో కీలకపాత్ర పోషించిన కివీస్‌ బౌలర్‌ పీటర్సన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్’‌.. సిరీస్‌లో విశేషంగా రాణించిన స్మృతి మంధనాకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’  అవార్డులు గెలుచుకున్నారు. 

అంతకముందు కివీస్‌ బౌలర్‌ అన్నా పీటర్సన్‌(4/21) ధాటికి భారత జట్టు 149 పరుగులకే ఆలౌటైంది. పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో టాస్‌ గెలిచిన కివీస్‌ సారథి ఏ మాత్రం ఆలోచించకుండా బౌలింగ్‌ను ఎంచుకుంది. తొలి రెండు వన్డేల్లో అదరొట్టిన స్మృతి మంధన(1), రోడ్రిగ్స్‌(12), మిథాలీ(9)లు ఈ మ్యాచ్‌లో పూర్తిగా విఫలమయ్యారు. దీంతో 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది.

ఈ క్రమంలో దీప్తి శర్మ, హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. నాలుగో వికెట్‌కు 48 పరుగులు జోడించిన అనంతరం హర్మన్‌ను పీటర్సన్‌ పెవిలియన్‌కు చేర్చింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. జట్టును దీప్తి శర్మ ఆదుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆర్ధసెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం దీప్తి శర్మ(52)కూడా పీటర్సన్‌ బౌలింగ్‌లోనే  వెనుదిరిగింది. చివర్లో హేమలత(13), గోస్వామి(12)లు రాణించడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోర్‌ను సాధించగలిగింది. కివీస్‌ బౌలర్లలో పీటర్సన్‌ నాలుగు, లీ తహుహు మూడు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top