పాకిస్తాన్తో జరుగుతున్న చివరిదైన రెండో టెస్టులో న్యూజిలాండ్ 369 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
హామిల్టన్:పాకిస్తాన్తో జరుగుతున్న చివరిదైన రెండో టెస్టులో న్యూజిలాండ్ 369 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. సోమవారం ఆటలో ఐదు వికెట్ల నష్టానికి 313 పరుగుల వద్ద ఉండగా న్యూజిలాండ్ తన రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. న్యూజిలాండ్ వెటరన్ ఆటగాడు రాస్ టేలర్(102;134 బంతుల్లో 16 ఫోర్లు) శతకంతో మెరిశాడు.
ఓవరాల్గా టేలర్ టెస్టు కెరీర్లో ఇది 16వ సెంచరీ కాగా, హామిల్టన్లో రాస్ టేలర్కు నాల్గో శతకం. తద్వారా ఈ వేదికలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా టేలర్ గుర్తింపు సాధించాడు. ఇదిలా ఉండగా దాదాపు మూడు నెలల తరువాత టేలర్ సెంచరీ సాధించాడు. ఈ ఏడాది ఆగస్టులో జింబాబ్వేతో బులావాయోలో జరిగిన టెస్టులో టేలర్ చివరిసారి శతకం నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో టేలర్ కు జతగా టామ్ లాధమ్(80;150 బంతుల్లో 12 ఫోర్లు) రాణించడంతో న్యూజిలాండ్ భారీ లక్ష్యాన్ని పాక్ ముందు ఉంచకల్గింది.