నవ్య ‘డబుల్‌’

Navya Got Two Medals In Singapore Youth International Series Tournament - Sakshi

లోకేశ్, సాయిప్రసాద్‌ జోడీలకు టైటిల్స్‌

సింగపూర్‌ యూత్‌ ఇంటర్నేషనల్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

సాక్షి, విజయవాడ/హైదరాబాద్‌: ఆద్యంతం నిలకడగా రాణించిన ఆంధ్రప్రదేశ్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి కందేరి నవ్య సింగపూర్‌ యూత్‌ ఇంటర్నేషనల్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లో రెండు విభాగాల్లో విజేతగా నిలిచి ‘డబుల్‌’ సాధించింది. సింగపూర్‌లో జరిగిన ఈ టోర్నీలో చిత్తూరు జిల్లాకు చెందిన నవ్య అండర్‌–13 బాలికల సింగిల్స్, డబుల్స్‌ విభాగాల్లో టైటిల్స్‌ గెల్చుకుంది. సింగిల్స్‌ ఫైనల్లో నవ్య 21–8, 21–13తో నాలుగో సీడ్‌ నిసా అలిఫెనియా తానెవగస్తిన్‌ (ఇండోనేసియా)పై నెగ్గగా... డబుల్స్‌ ఫైనల్లో నవ్య–వలిశెట్టి శ్రియాన్షి (భారత్‌) ద్వయం 21–18, 17–21, 21–16తో సుకిత్త సువచాయ్‌–నారద ఉడోర్న్‌పిమ్‌ (థాయ్‌లాండ్‌) జంటను ఓడించింది.

మరోవైపు ఇదే టోర్నీ బాలుర అండర్‌–15, అండర్‌–13 డబుల్స్‌ విభాగాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ కుర్రాళ్లు కలగోట్ల లోకేశ్‌ రెడ్డి, తీగల సాయిప్రసాద్, నాగలింగ ప్రణవ్‌ రామ్‌ టైటిల్స్‌ గెలిచారు. అండర్‌–15 బాలుర డబుల్స్‌ ఫైనల్లో లోకేశ్‌ రెడ్డి–అంకిత్‌ మోండల్‌ (బెంగాల్‌) ద్వయం 25–23, 4–21, 21–18తో రెండో సీడ్‌ జొనాథన్‌ గొసాల్‌–అడ్రియన్‌ ప్రతమ (ఇండోనేసియా) జంటపై... అండర్‌–13 బాలుర డబుల్స్‌ ఫైనల్లో సాయిప్రసాద్‌–ప్రణవ్‌ రామ్‌ జోడీ 21–11, 21–16తో చౌ యు సియాంగ్‌–ఫాన్‌ వాన్‌ చున్‌ (చైనీస్‌ తైపీ) జంటపై విజయం సాధించాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top