ఒసాకా ఆర్జన రూ. 284 కోట్లు

Naomi Osaka Earns Rs 284 Crore In Past Year - Sakshi

ఏడాదిలో అత్యధిక సంపాదన కలిగిన క్రీడాకారిణిగా ఘనత

రెండో స్థానానికి సెరెనా

వాషింగ్టన్‌: ఏడాది కాలంలో అత్యధికంగా ఆర్జించిన క్రీడాకారిణిగా జపాన్‌ టెన్నిస్‌ ప్లేయర్, ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ నయోమి ఒసాకా గుర్తింపు పొందింది. ‘ఫోర్బ్స్‌’ పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం 2019 జూన్‌ నుంచి 2020 జూన్‌ కాలానికి 22 ఏళ్ల ఒసాకా ప్రైజ్‌మనీ, ఎండార్స్‌మెంట్ల ద్వారా మొత్తం 3 కోట్ల 74 లక్షల డాలర్లు (రూ. 284 కోట్లు) సంపాదించింది. గత నాలుగేళ్లుగా టాప్‌ ర్యాంక్‌లో నిలిచిన అమెరికా టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్‌ 3 కోట్ల 60 లక్షల డాలర్ల (రూ. 273 కోట్లు) సంపాదనతో రెండో స్థానానికి పడిపోయింది.

ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో ఒసాకా 29వ ర్యాంక్‌లో, సెరెనా 33వ ర్యాంక్‌లో ఉన్నారు. 2016 తర్వాత టాప్‌–100లో ఇద్దరు క్రీడాకారిణులు ఉండటం ఇదే తొలిసారి. 2020 సంవత్సరానికి ఎక్కువ మొత్తం ఆర్జించిన క్రీడాకారుల పూర్తి జాబితాను వచ్చే వారం విడుదల చేస్తామని ‘ఫోర్బ్స్‌’ పత్రిక తెలిపింది. 2013లో ప్రొఫెషనల్‌గా మారిన ఒసాకా 2018 యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో సెరెనాను... 2019 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లో క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌)ను ఓడించి ‘బ్యాక్‌ టు బ్యాక్‌’ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌నూ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో పదో ర్యాంక్‌లో ఉన్న ఒసాకా  15 అంతర్జాతీయ కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top