టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన మారియా షరపోవా

Maria Sharapova Says Goodbye To Tennis Announces Retirement - Sakshi

మాస్కో: రష్యా టెన్నిస్‌ స్టార్‌ మారియా షరపోవా ఆటకు గుడ్‌బై చెప్పారు. క్రీడా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ స్టార్‌ ప్లేయర్‌.. బుధవారం రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. ఈ మేరకు... ‘‘28 ఏళ్ల తర్వాత.. ఐదు గ్రాండ్‌ స్లామ్‌ టైటిళ్లు నెగ్గిన నేను... ప్రస్తుతం మరో శిఖరాన్ని అధిరోహించేందుకు సిద్ధమయ్యాను. విభిన్నమైన మైదానంలో పోటీపడబోతున్నాను. టెన్నిస్‌కు గుడ్‌బై చెబుతున్నా’’ అని షరపోవా తన నిర్ణయాన్ని వెల్లడించారు. కాగా గతంలో టెన్నిస్‌ నెంబర్‌ 1 ర్యాంకర్‌గా వెలుగొందిన షరపోవా ప్రస్తుతం వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నారు. పదహారేళ్ల క్రితం టీనేజర్‌గా కోర్టులో అడుగుపెట్టి వింబుల్డన్‌ చాంపియన్‌గా అవతరించి మహిళల టెన్నిస్‌లో మెరుపుతీగలా దూసుకొచ్చిన ఆమె... ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో 373వ స్థానంలో ఉన్నారు. ఈ క్రమంలో 32 ఏళ్ల వయస్సులో బుధవారం ఆమె ఆటకు వీడ్కోలు పలికారు.

ఈ సందర్భంగా.. ‘‘టెన్నిస్‌కు నా జీవితాన్ని ధారపోశాను. అదే విధంగా టెన్నిస్‌ నాకు జీవితాన్నిచ్చింది. ఇక నుంచి ప్రతిరోజూ నేను దానిని మిస్సవుతాను. ట్రెయినింగ్‌, రోజూ వారీ దినచర్య అంతా మారిపోతుంది. నిద్రలేచిన తర్వాత.. కుడికాలు ముందు.. ఎడమ కాలు పెట్టి షూలేసులు కట్టుకోవడం.. మొదటి బాల్‌ను కొట్టే ముందు కోర్టు గేటును మూసివేయడం... నా టీం అంతటినీ మొత్తం మిస్సవుతాను. నా కోచ్‌లను కూడా. మా నాన్నతో కలిసి కోర్టు బెంచ్‌ మీద కూర్చునే క్షణాలు అన్నీ మిస్సవుతాను. ఓడినా.. గెలిచినా.. పరిచయం ఉన్నా లేకపోయినా... ఇచ్చిపుచ్చుకునే షేక్‌హ్యాండ్లు, వెన్నుతట్టి ఆటలో నన్ను ప్రోత్సహించిన వారిని మిస్సవుతాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే.. టెన్నిస్‌ ఓ పర్వతంలా కనిపిస్తోంది. నా దారి అంతా లోయలు, మలుపులతో నిండి ఉంది. అయితేనేం.. శిఖరం అంచు నుంచి చూస్తే అపురూపమైన ఘట్టాలు ఎన్నో కనిపిస్తున్నాయి’’అంటూ షరపోవా భావోద్వేగానికి గురయ్యారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top