సిరీస్‌ ఎవరి సొంతం?

Last T20 Between India And Bangladesh At Nagpur - Sakshi

చివరి టి20 బరిలో భారత్, బంగ్లాదేశ్‌

నేడు నాగ్‌పూర్‌లో పోరు

ఉత్సాహంగా టీమిండియా

రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

బంగ్లాదేశ్‌తో టి20 పోరు అంటే భారత జట్టుకు ఏకపక్ష విజయం అని సిరీస్‌కు ముందు అంతా భావించారు. అయితే అనూహ్యంగా తొలి మ్యాచ్‌లో ఓటమి ఎదురు కావడంతో టీమిండియా వ్యూహం మార్చాల్సి వచ్చింది. తర్వాతి సమరంలో కసితీరా ప్రత్యర్థిపై చెలరేగిన రోహిత్‌ సేన ఇప్పుడు అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. మరో అవకాశం ఇవ్వకుండా సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు తొలి టి20 స్ఫూర్తితో ఇంకో విజయం సాధిస్తే బంగ్లా  కొత్త చరిత్ర సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో నాగ్‌పూర్‌ వేదికగా జరిగే మూడో టి20తో సిరీస్‌ ఫలితం తేలనుంది.

నాగ్‌పూర్‌: భారత్, బంగ్లాదేశ్‌ మధ్య తొలి టి20 ద్వైపాక్షిక సిరీస్‌లో విజేతను తేల్చే పోరుకు రంగం సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల పోరులో రెండు జట్లు 1–1తో సమంగా నిలవగా, నేడు జామ్తా మైదానంలో చివరి మ్యాచ్‌ జరుగుతుంది. గత మ్యాచ్‌ ఫలితాన్ని బట్టి చూస్తే టీమిండియా ప్రత్యర్థికంటే బలంగా కనిపిస్తుండగా, తప్పులు సరిదిద్దుకొని మరో అద్భుత విజయం సాధించాలనే లక్ష్యం బంగ్లా జట్టులో కనిపిస్తోంది.

శార్దుల్‌కు చాన్స్‌!  
రాజ్‌కోట్‌ మ్యాచ్‌లో భారత్‌ అన్ని విధాలా ఆధిపత్యం ప్రదర్శించింది. ముందుగా ప్రత్యర్థిని తక్కువ స్కోరుకు కట్టడి చేయడంతోపాటు ఆ తర్వాత రోహిత్‌ మెరుపులతో 26 బంతుల ముందే మ్యాచ్‌ గెలుచుకుంది. రోహిత్‌ ఒక్కసారి లయను అందుకుంటే అతడిని ఆపడం ఎవరి వల్లా కాదని మరోసారి రుజువైంది. ధావన్‌ కూడా కొన్ని పరుగులు చేసినా తొలి టి20లాగే తగినంత ధాటి అతని బ్యాటింగ్‌లో కనిపించడం లేదు. రాహుల్‌ను కాదని ఓపెనర్‌గా అవకాశం ఇస్తుండటం వల్ల ఈసారి ధావన్‌ బ్యాటింగ్‌పై అందరి దృష్టి నిలవడం ఖాయం. శ్రేయస్‌ అయ్యర్, రిషభ్‌ పంత్‌లతో బ్యాటింగ్‌ పటిష్టంగా ఉంది.

గొప్పగా ఆడకపోయినా యువ ఆటగాడు శివమ్‌ దూబేను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించవచ్చు. మధ్య ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో తన విలువేమిటో చహల్‌ మరోసారి నిరూపించాడు. అతడి బౌలింగ్‌లో బంగ్లాకు మళ్లీ ఇబ్బందులు తప్పకపోవచ్చు. అయితే సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల తర్వాత చూస్తే లెఫ్టార్మ్‌ పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ వైఫల్యం మాత్రం కొట్టొచ్చినట్లు కనిపించింది. 8 ఓవర్లలో అతను ఏకంగా 81 పరుగులు సమర్పించుకున్నాడు. ఖలీల్‌ స్థానంలో శార్దుల్‌ ఠాకూర్‌ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. భారత్‌ తమ స్థాయికి తగిన ప్రదర్శన ఇస్తే మాత్రం విజయానికి ఢోకా ఉండదు.

అదనపు స్పిన్నర్‌తో... 
బంగ్లాదేశ్‌ తొలి మ్యాచ్‌ విజయంలో ముష్ఫికర్‌ రహీమ్‌దే కీలక పాత్ర. అతను గత మ్యాచ్‌లో విఫలం కాగా, కెప్టెన్‌ మహ్ముదుల్లా ఫర్వాలేదనిపించాడు. సీనియర్లయిన వీరిద్దరు మరోసారి రాణించడంపై ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఓపెనర్‌ నయీమ్‌ రెండు మ్యాచ్‌లలోనూ చెప్పకోదగ్గ స్కోర్లు చేసినా 105 స్ట్రయిక్‌రేట్‌ మాత్రమే ఉండటం అతని బలహీనతను చూపిస్తోంది. సౌమ్య సర్కార్, లిటన్‌ దాస్‌లు కూడా దూకుడుగా ఆడితేనే ఆ జట్టు భారీ స్కోరు చేసేందుకు అవకాశం ఉంటుంది. మిగతా వారంతా తలా ఒక చేయి వేసేవారే తప్ప ఒంటి చేత్తో మ్యాచ్‌ను శాసించలేరు. మడమ గాయంతో బాధపడుతున్న ముస్తఫిజుర్‌ తన స్థాయికి తగినట్లుగా బౌలింగ్‌ చేయలేకపోవడం బంగ్లాకు సమస్యగా మారింది. అమీనుల్, అల్‌ అమీన్‌లకు పెద్దగా అనుభవం లేదు. గత మ్యాచ్‌లో భారీగా పరుగులిచ్చిన పేసర్‌ షఫీయుల్‌ స్థానంలో స్పిన్నర్‌ తైజుల్‌కు చాన్స్‌ దక్కవచ్చు.  

తుది జట్లు (అంచనా)
భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ధావన్, రాహుల్, అయ్యర్, పంత్, దూబే, కృనాల్, సుందర్, చహల్, చహర్, శార్దుల్‌. 
బంగ్లాదేశ్‌: మహ్ముదుల్లా (కెప్టెన్‌), సర్కార్, దాస్, నయీమ్, ముష్ఫికర్, అఫీఫ్, మొసద్దిక్, అమీనుల్, ముస్తఫిజుర్, అల్‌ అమీన్, తైజుల్‌.

పిచ్, వాతావరణం 
సాధారణ బ్యాటింగ్‌ వికెట్‌. దేశంలోని పెద్ద గ్రౌండ్‌లలో ఒకటి. భారీ స్కోర్లకు అవకాశం తక్కువ. ముందుగా బ్యాటింగ్‌ చేసిన జట్టుకే అనుకూలం. స్పిన్నర్లు కూడా మంచి ప్రభావం చూపిస్తారు. వాతావరణం చాలా బాగుంది. ఆటకు ఎలాంటి ఇబ్బందీ లేదు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top