క్వార్టర్‌ ఫైనల్లో సింధు, సమీర్‌ | Korea Open - PV Sindhu, Sameer Verma enter to quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో సింధు, సమీర్‌

Sep 15 2017 1:00 AM | Updated on Sep 19 2017 4:33 PM

క్వార్టర్‌ ఫైనల్లో సింధు, సమీర్‌

క్వార్టర్‌ ఫైనల్లో సింధు, సమీర్‌

ప్రపంచ చాంపియన్‌షిప్‌ రజత పతక విజేత పీవీ సింధు జోరు కొరియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లోనూ కొనసాగుతోంది.

∙ సాయిప్రణీత్, కశ్యప్‌ అవుట్‌ 
∙ కొరియా సూపర్‌ సిరీస్‌ టోర్నీ


సియోల్‌: ప్రపంచ చాంపియన్‌షిప్‌ రజత పతక విజేత పీవీ సింధు జోరు కొరియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లోనూ కొనసాగుతోంది. ఈ భారత బ్యాడ్మింటన్‌ సంచలనం మహిళల సింగిల్స్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల ఈవెంట్‌లో సమీర్‌ వర్మ క్వార్టర్స్‌ చేరగా... భమిడిపాటి సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్‌ ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ షెట్టి జోడి క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఐదో సీడ్‌ సింధు 22–20, 21–17తో ప్రపంచ 16వ ర్యాంకర్‌ నిచావోన్‌ జిందాపోల్‌ (థాయ్‌లాండ్‌)పై విజయం సాధించింది. 42 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో ప్రత్యర్థి జిందాపోల్‌ నుంచి తొలి గేమ్‌లో గట్టిపోటీ ఎదురైంది. ఆరంభంలో సింధు కాస్త వెనుకబడింది. దీంతో థాయ్‌లాండ్‌ అమ్మాయి 9–7తో ఆధిక్యంలో నిలిచింది. మరో నాలుగు పాయింట్లు చేసి 13–10తో జోరు కొనసాగించింది. అనంతరం కాసేపటికి 16–14 స్కోరు వద్ద సింధు వరుసగా 6 పాయింట్లు చేసి తొలిసారిగా ఆధిక్యంలోకి వచ్చింది. దీటుగా బదులిచ్చిన జిందాపోల్‌ కూడా నాలుగు పాయింట్లు చేయడంతో స్కోరు సమమైంది. ఈ దశలో సింధు రెండు పాయింట్లు చేసి గేమ్‌ను కైవసం చేసుకుంది. రెండో గేమ్‌ కూడా ఆరంభంలో హోరాహోరీగా సాగడంతో 8–8 వద్ద, 15–15 వద్ద స్కోరు సమమైంది. ఈ క్రమంలో జాగ్రత్తగా ఆడిన తెలుగమ్మాయి వరుసగా నాలుగు పాయింట్లు సాధించి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను ముగించింది. క్వార్టర్‌ ఫైనల్లో సింధు... జపాన్‌కు చెందిన మినత్సు మితానితో తలపడనుంది.

సమీర్‌ దూకుడు
సయ్యద్‌ మోడి గ్రాండ్‌ ప్రి చాంపియన్‌ సమీర్‌ వర్మ పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో  21–19, 21–13తో హాంకాంగ్‌కు చెందిన వోంగ్‌ వింగ్‌ కీ విన్సెంట్‌పై విజయం సాధించాడు. మిగతా మ్యాచ్‌ల్లో పారుపల్లి కశ్యప్‌ 16–21, 21–17, 16–21తో సన్‌ వాన్‌ మో (కొరియా) చేతిలో కంగుతినగా... సాయిప్రణీత్‌ 13–21, 24–26తో వాంగ్‌ జు వీ (చైనీస్‌ తైపీ) చేతిలో పరాజయం చవిచూశారు. పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ షెట్టి జోడి 23–21, 16–21, 21–8తో ఏడో సీడ్‌ లీ జె హుయి–లీ యాంగ్‌ (చైనీస్‌ తైపీ) ద్వయంపై విజయం సాధించింది. క్వార్టర్స్‌లో భారత జంట...మూడో సీడ్‌ తకెషి కముర–కెయిగో సొనోడా (జపాన్‌) జోడీతో తలపడుతుంది. సమీర్‌ వర్మ... టాప్‌ సీడ్‌ సన్‌ వాన్‌ హో (కొరియా)ను ఎదుర్కొంటాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement