
ఎకటెరిన్‌బర్గ్: ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మరో హోరాహోరీ పోరులో ఇరు జట్లు సమంగా నిలిచాయి. గ్రూప్ ‘హెచ్’లో భాగంగా ఆదివారం జపాన్, సెనెగల్ మధ్య జరిగిన మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. రెండు సార్లు కూడా ముందుగా గోల్ కొట్టి సెనెగల్ ఆధిక్యంలో నిలవగా... ఆ తర్వాత జపాన్ సమంచేసి మ్యాచ్‌ను కాపాడుకుంది. సెనెగల్ తరఫున ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సాదియో మానె (11వ నిమిషం), మూసా వేగ్ (71వ నిమిషం) గోల్స్ కొట్టారు.
జపాన్ తరఫున తకషి నుయ్ (34వ నిమిషం), కీసుకే హోండా (78వ నిమిషం) గోల్స్ సాధించారు. ఈ గోల్‌తో హోండా... జపాన్ తరఫున వరుసగా మూడు ప్రపంచ కప్ మ్యాచ్‌లలో (2010, 2014, 2018) గోల్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. తాజా ఫలితం అనంతరం ఈ గ్రూప్‌లో ఇరు జట్లు చెరో 4 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానం లో ఉన్నాయి. గురువారం జరిగే మ్యాచ్‌ల్లో పోలాండ్‌తో జపాన్, కొలంబియాతో సెనెగల్ ఆడతాయి.