గులాబీ కథ షురూ కావళి | Sakshi
Sakshi News home page

గులాబీ కథ షురూ కావళి

Published Fri, Nov 22 2019 3:49 AM

India VS Bangladesh Ready To Play Pink Ball Test - Sakshi

సాధారణంగా అయితే ఒక టెస్టు మ్యాచ్‌ మొదలవుతుందంటే మ్యాచ్‌ ఫలితం గురించో, ఆటగాళ్ల ప్రదర్శన గురించో చర్చ జరుగుతుంది. కానీ ఇప్పుడు భారత్, బంగ్లాదేశ్‌ మధ్య జరగబోయే టెస్టులో అలాంటివన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. గత మ్యాచ్‌లో భారత్‌ ప్రదర్శించిన ఆధిపత్యం, బలహీన ప్రత్యర్థిని చూసిన తర్వాత సగటు క్రికెట్‌ అభిమాని ఫలితం గురించి ఒక అంచనాకు వచ్చేశాడు. కానీ ఇప్పుడంతా గులాబీమయంగా మారిపోయిన టెస్టు గురించే చర్చ. పింక్‌ బంతి ఎలా కనిపిస్తుంది, ఎలా స్పందిస్తుంది, పట్టు చిక్కుతుందా, పరుగులు ధారాళంగా వస్తాయా, ప్రేక్షకులకు తగిన వినోదం లభిస్తుందా, ఫ్లడ్‌లైట్ల వెలుగులో టెస్టు మ్యాచ్‌ అనుభూతి ఎలా ఉండబోతోంది... ఇవి మాత్రమే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. భారత గడ్డపై ఫ్లడ్‌లైట్ల వెలుగులో తొలిసారి జరగబోతున్న పింక్‌ టెస్టు తొలి బంతి పడక ముందే అమితాసక్తిని రేపి సూపర్‌ హిట్‌ టాక్‌ ఇప్పటికే తెచ్చుకుంది. ఇక మైదానంలో ఆట ఎలా ఉండబోతోందో చూడాల్సిందే.

కోల్‌కతా: భారత గడ్డపై తొలి పింక్‌ బాల్‌ టెస్టుకు రంగం సిద్ధమైంది. ప్రఖ్యాత ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో నేటినుంచి జరిగే పోరులో భారత్, బంగ్లాదేశ్‌ తలపడబోతున్నాయి. ఇండోర్‌లో జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించి 1–0తో ఆధిక్యంలో నిలిచిన టీమిండియా సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరో వైపు పేలవ ప్రదర్శనతో గత మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన బంగ్లా ఈ మ్యాచ్‌లోనైనా పోరాడి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది.

మార్పుల్లేకుండానే... 
ఈ టెస్టుకు సంబంధించి పింక్‌ బంతి, మంచు ప్రభావం తదితర అంశాలకు సంబంధించి ప్రాధాన్యత పెరిగినా... జట్టు బలాబలాల విషయంలో భారత్‌  ఎప్పటిలాగే తిరుగులేనిదిగా కనిపిస్తోంది. జట్టులో ఒకరితో పోటీ పడి మరొకరు చెలరేగుతుండటంతో కోహ్లి సేన వరుస విజయాలతో దూసుకుపోతోంది. డబుల్‌ సెంచరీ హీరో మయాంక్‌ అగర్వాల్‌తో పాటు రోహిత్‌ శర్మ ఓపెనింగ్‌ జోడి జట్టుకు మరో చక్కటి ఆరంభాన్నిచ్చేందుకు సిద్ధంగా ఉంది. మూడో స్థానంలో టెస్టు స్టార్‌ పుజారా సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. గత మ్యాచ్‌లో డకౌట్‌ అయిన కోహ్లి తనదైన స్థాయిలో చెలరేగితే బంగ్లాకు కష్టాలు తప్పవు. తర్వాతి స్థానాల్లో రహానే, జడేజా, సాహా తమ బ్యాటింగ్‌తో చెలరేగిపోగల సమర్థులు. భారత పేస్‌ బౌలింగ్‌ పదును ఏమిటో గత మ్యాచ్‌లో మరోసారి కనిపించింది. షమీ, ఉమేశ్, ఇషాంత్‌ ఈ సారి గులాబీ బంతిని ఎలా వాడతారనేది ఆసక్తికరం. పింక్‌ బాల్‌తో గతంలో క్లబ్‌ స్థాయి మ్యాచ్‌ ఆడిన అనుభవం షమీకి ఉంది. ప్రధాన స్పిన్నర్‌ అశ్విన్‌ ఇప్పటికే పింక్‌ బాల్‌తో తీవ్ర సాధన చేశాడు. మొత్తంగా గులాబీ బంతి అనుభవం కొత్తదే అయినా పటిష్టమైన టీమిండియాకు అది పెద్ద సమస్య కాకపోవచ్చు.

రెండు మార్పులతో... 
టెస్టు క్రికెట్‌లోకి ప్రవేశించి రెండు దశాబ్దాలు అవుతున్నా బంగ్లాదేశ్‌ ఇప్పటికీ పసికూనగానే కనిపిస్తోంది. ఆటగాళ్లు కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోతుండటంతో ఆ జట్టుకు కష్టాలు తప్పడం లేదు. ఇండోర్‌లో బంగ్లా జట్టు ఇన్నింగ్స్‌ తేడాతో ఓడటం అది మళ్లీ చూపించింది. ఈ మ్యాచ్‌లో జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. బౌలర్లు తైజుల్, ఇబాదత్‌ స్థానాల్లో అల్‌ అమీన్, ముస్తఫిజుర్‌ రానున్నారు. దురదృష్టవశాత్తూ జట్టు రిజర్వ్‌ ఆటగాళ్లలో స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌లు ఎవరూ లేరు. ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేయాల్సిన సైఫ్‌ హసన్‌ గాయంతో చివరి నిమిషంలో దూరం కావడంతో మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మరోసారి సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ ముష్ఫికర్‌పైనే జట్టు అతిగా ఆధారపడుతోంది. గత మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన ఓపెనర్లు షాద్‌మన్, కైస్‌ ఈ సారైనా రాణిస్తారో చూడాలి. కెప్టెన్‌ మోమినుల్‌ హక్‌ రాణించడం కూడా కీలకం. ఎంతో సీనియర్‌ అయిన మహ్ముదుల్లా ఇప్పటికీ టెస్టుల్లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడలేకపోతున్నాడు. దాస్, మిథున్‌ ఏమాత్రం రాణిస్తారో చూడాలి. బంగ్లాకు కూడా ఇదే తొలి పింక్‌ టెస్టు.

తుది జట్లు (అంచనా) 
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, మయాంక్, పుజారా, రహానే, జడేజా, సాహా, అశ్విన్, ఇషాంత్, ఉమేశ్, షమీ  
బంగ్లాదేశ్‌: మోమినుల్‌ (కెప్టెన్‌), కైస్, షాద్‌మన్, ముష్ఫికర్, మహ్ముదుల్లా, మిథున్, లిటన్‌ దాస్, మెహదీ హసన్, ముస్తఫిజుర్, అబూ జాయెద్, అల్‌ అమీన్‌ 

పిచ్, వాతావరణం
ఈ టెస్టు మొత్తానికి కీలక  అంశం పిచ్‌ గురించే. పింక్‌ బాల్‌ పాడవకుండా వికెట్‌పై కొంత మేర పచ్చిక ఉంచుతున్నారు. మరీ గ్రీన్‌ టాప్‌ స్థాయిలో కాకపోయినా కొంత ఎక్కువగా పేసర్లకు అనుకూలించవచ్చు. ఇప్పటి వరకు జరిగిన 10 పింక్‌ టెస్టుల్లో స్పిన్నర్లకంటే రెట్టింపు సంఖ్యలో ఓవర్లు వేసిన పేసర్లు మూడు రెట్లు ఎక్కువ సంఖ్యలో వికెట్లు తీశారు. ఇక్కడా అదే జరగవచ్చని అంచనా. వర్షం సమస్య లేదు. అన్ని రోజులూ ఆటకు అనుకూల వాతావరణం ఉంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement