అందరి దృష్టి కోహ్లిపైనే | India, Australia 'A' in the second Unauthorized Test | Sakshi
Sakshi News home page

అందరి దృష్టి కోహ్లిపైనే

Jul 29 2015 1:14 AM | Updated on Sep 3 2017 6:20 AM

అందరి దృష్టి కోహ్లిపైనే

అందరి దృష్టి కోహ్లిపైనే

ఆల్‌రౌండ్ షోతో అద్భుతంగా ఆడినా తొలి టెస్టు డ్రాగా ముగియడంతో కాస్త నిరాశ చెందిన భారత్ ‘ఎ’ జట్టు...

భారత్, ఆసీస్ ‘ఎ’ జట్ల మధ్య రెండో అనధికార టెస్టు లోకేశ్ రాహుల్, మిశ్రా, ఉమేశ్‌లకు విశ్రాంతి
చెన్నై:
ఆల్‌రౌండ్ షోతో అద్భుతంగా ఆడినా తొలి టెస్టు డ్రాగా ముగియడంతో కాస్త నిరాశ చెందిన భారత్ ‘ఎ’ జట్టు... రెండో అనధికార టెస్టు కోసం సిద్ధమైంది, నేటి నుంచి చెన్నైలో జరగనున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ‘ఎ’తో అమీతుమీ తేల్చుకోనుంది. భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రాక్టీస్ కోసం ఈ మ్యాచ్ బరిలోకి దిగుతుండటంతో ఇప్పుడు అందరి దృష్టి అతనిపైనే నెలకొంది. వచ్చే నెలలో భారత్... శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో చెన్నై, కొలంబో వాతావరణ పరిస్థితులు దాదాపుగా ఒకే రకంగా ఉండనుండటంతో ఈ మ్యాచ్‌తో ఫామ్‌లో రావాలని విరాట్ భావిస్తున్నాడు.

సోమవారం జరిగిన భారత జట్టు ప్రాక్టీస్‌లోనూ అతను పాల్గొన్నాడు. మందకొడి పిచ్‌పై బ్యాటింగ్ చేయడానికి ఇబ్బందిపడ్డ ఆసీస్ తొలి మ్యాచ్‌లో డ్రాతో గట్టెక్కింది. అయితే రెండో టెస్టులో మంచి పిచ్ లభిస్తుందని ఆశిస్తున్న ఇరుజట్ల కెప్టెన్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. తుది జట్టులో కోహ్లి ఉండనుండటంతో గత మూడు రోజులుగా మైదానం సిబ్బంది వికెట్ రూపొందించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ మ్యాచ్‌లో లోకేశ్ రాహుల్, అమిత్ మిశ్రా, ఉమేశ్ యాదవ్‌లకు విశ్రాంతి ఇచ్చారు.

కెప్టెన్ పుజారా ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. బ్యాటింగ్‌లో విజయ్ శంకర్, శ్రేయాస్ అయ్యర్‌లు మంచి సమన్వయంతో ఆడుతుండటం కలిసొచ్చే అంశం కాగా... కరుణ్ నాయర్, నమన్ ఓజా, అభినవ్ ముకుంద్‌లు గాడిలో పడాల్సి ఉంది. స్పిన్నర్లలో ప్రజ్ఞాన్ ఓజా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. పేసర్లు కాస్త విజృంభిస్తే ఆసీస్‌కు కష్టాలు తప్పవు.
 
మరోవైపు ఆసీస్ బ్యాటింగ్ కంటే బౌలింగ్, ఫీల్డింగ్‌లో మెరుగ్గా కనిపిస్తోంది. నాణ్యమైన పేస్ అటాకింగ్‌తో పాటు స్పిన్నర్ స్టీఫెన్ ఓ కీఫీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. తొలి మ్యాచ్‌లో శుభారంభం ఇవ్వడంలో విఫలమైన ఆసీస్ ఈ మ్యాచ్‌లో దాన్ని పునరావృతం కాకుండా చూడాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement