
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో సైతం టీమిండియా గెలిచి సిరీస్‌ను ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. సూపర్ ఓవర్‌కు దారి తీసిన మూడో టీ20లో భారత్ విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఆ సూపర్ ఓవర్‌లో టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా 17 పరుగులిచ్చాడు. ఆ ఓవర్‌లో కేన్ విలియమ్సన్, మార్టిన్ గప్టిల్‌లు దూకుడుగా ఆడి భారత్‌కు 18 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించారు. దాన్ని రోహిత్-కేఎల్ రాహుల్‌లు ఛేదించడంతో భారత్ చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది.
కాగా, సూపర్ ఓవర్‌లో బుమ్రా 17 పరుగులివ్వడాన్ని భారత కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ వేలెత్తి చూపాడు. ‘ బుమ్రా వేసిన సూపర్ ఓవర్‌ను చూడండి. అతనొక అద్భుతమైన బౌలర్. కానీ బుమ్రా తన బౌలింగ్‌ను కాస్త మార్చుకోవాల్సి ఉంది. ఇంకా వైవిధ్యమైన బంతులు వేయడానికి క్రీజ్‌ను కాస్త పెంచుకో’ అని మంజ్రేకర్ ట్వీట్ చేశాడు. ఇది నెటజన్లకు మరొకసారి ఆగ్రహం తెప్పించింది. ఇప్పటికే అనేకసార్లు నెటిజన్ల విమర్శల బారిన పడ్డ మంజ్రేకర్‌ను మళ్లీ దుమ్మెత్తిపోశారు. బుమ్రా బౌలింగ్‌కే పేరు పెట్టే స్థాయి నీకుందా అనే అర్ధం వచ్చేలా మండిపడుతున్నారు. ‘ ఇక ఆ చెత్త వాగుడు ఆపు. నువ్వొక యావరేజ్ ప్లేయర్‌వి అనే సంగతి గుర్తుంచుకో’ అని ఒకరు విమర్శించగా, ‘ 2019వ సంవత్సరం అయిపోయింది... 2020లో మళ్లీ మొదలెట్టేశావా. నీకు తిట్లు తినడమే పనిగా మారిపోయినట్లుందే’ అని మరొకరు ఎద్దేవా చేశారు. ‘ఒకసారి బౌలింగ్ ఎలా వేయాలో చేసి చూపిస్తే బాగుంటుంది మంజ్రేకర్’ అని మరొకరు సెటైర్ వేశారు. (ఇక్కడ చదవండి: వారికి విశ్రాంతి..ఈ ముగ్గురికీ అవకాశం)