
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత సుశీల్ కుమార్‌తో పాటు అతడి మద్దతు దారులపై ఢిల్లీ పోలీసులు శనివారం ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే భారత రెజ్లర్ల సెలెక్షన్ ట్రయల్స్ సందర్భంగా శుక్రవారం సుశీల్, మరో రెజ్లర్ ప్రవీణ్ రాణా మద్దతుదారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వివాదం కెమెరాల్లో రికార్డయి పోలీసుల వరకు చేరింది. ఈ నేపథ్యంలో సుశీల్, అతని మద్దతుదారులపై ఐపీసీ సెక్షన్ 341 (తప్పుడు పద్ధతుల్లో అడ్డుకోవడం), సెక్షన్ 323 (ఉద్దేశపూర్వకంగా కించపరచడం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ట్రయల్స్‌లో భాగంగా సెమీఫైనల్ బౌట్ అనంతరం సుశీల్ మద్దతుదారులు తనపై, తన అన్నయ్యపై దాడి చేసి చంపుతామని బెదిరించినట్లు ప్రవీణ్ రాణా ఆరోపించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఎఫ్‌ఐఆర్ నమోదును ఢిల్లీ సెంట్రల్ డీసీపీ మన్‌దీప్‌సింగ్ రణ్‌ధవా ధ్రువీకరించారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.