
సూపర్... మేవెదర్
అద్భుతమేమీ జరగలేదు. అనుభవమే గెలిచింది.
లాస్ వేగాస్: అద్భుతమేమీ జరగలేదు. అనుభవమే గెలిచింది. అంచనాలకు అనుగుణంగా రాణించిన అమెరికా స్టార్ బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్ రూ. 1700 కోట్ల ‘మెగా ఫైట్’లో పైచేయి సాధించాడు. ఐర్లాండ్‌కు చెందిన కానర్ మెక్‌గ్రెగర్‌తో జరిగిన సూపర్ వెల్టర్‌వెయిట్ బౌట్ లో మేవెదర్ విజేతగా నిలిచాడు. తద్వారా తన కెరీర్ లో అజేయంగా 50 మ్యాచ్ లు గెలిచిన తొలి బాక్సర్ గా చరిత్ర సృష్టించాడు. రెండేళ్ల క్రిత పకియావ్ తో జరిగిన బిగ్ ఫైట్ లో గెలిచిన తరువాత బాక్సింగ్ కు వీడ్కోలు పలికిన మేవెదర్.. మళ్లీ మనసు మార్చుకుని మెక్ గ్రెగర్ తో పోరుకు సిద్ధమయ్యాడు.
భారత కాలమాన ప్రకారం ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు జరిగిన పోరులో మేవెదర్ తన జైత్రయాత్రను కొనసాగించాడు. అల్టిమేట్ ఫైటింగ్ చాంపియనషిప్(యూఎఫ్సీ ) చాంపియన్ అయిన మెక్‌గ్రెగర్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఏకపక్ష విజయాన్ని సాధించాడు. మెక్ గ్రెగర్ నుంచి ప్రతిఘటన ఎదుర్కొన్నప్పటికీ అనుభవాన్ని ఉపయోగించి మేవెదర్ సూపర్ వెల్టర్‌వెయిట్ టైటిల్ ను దక్కించుకున్నాడు. ఈ విజయంతో దాదాపు రూ.1200 కోట్లను మేవెదర్ తన ఖాతాలో వేసుకోగా, సుమారు రూ. 400 కోట్లు మెక్ గ్రెగర్ కు దక్కనున్నాయి.