
సాక్షి, స్పోర్ట్స్ : హాలీవుడ్ ‘బ్లాక్ పాంథర్’ మూవీలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అదరగొట్టడం ఏంటని అనుకుంటున్నారా? పాండ్యా దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నాడు కదా! ఈ సినిమాలో అతనేందుకుంటాడనే సందేహం కలుగుతోందా? అవును పాండ్యా ఈ సినిమాలో ఏం నటించలేదు. టీ20 సిరీస్‌లో ఈ ఆల్‌రౌండర్ బిజీగా ఉన్నాడు. కానీ నెటిజన్లు ఈ సినిమాలో పాండ్యా నటించినట్లు సృష్టించారు. బ్లాక్ పాంథర్‌లో విలన్ పాత్ర పోషించిన మైఖేల్ బి జోర్డాడన్‌తో పాండ్యాను పోలుస్తూ సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఈ పోస్టులిప్పుడు ట్రెండ్ అయ్యాయి.
మైఖేల్ బి జోర్డాన్ హెయిర్ స్టైల్ పాండ్యా హెయిర్ స్టైల్ పోలిక ఉండటంతో అతని పేలవ ప్రదర్శనను దృష్టిలో ఉంచుకొని నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'పాండ్యా నువ్వు అదుర్స్' అని ఒకరు ట్వీట్ చేస్తే.. "హాలీవుడ్ మూవీలను నేను పెద్దగా చూడను.. కానీ బ్లాక్ పాంథర్‌లో హార్దిక్ నటన మాత్రం అద్భుతం" అంటూ మరొకరు ట్వీట్ చేశారు. హెయిర్ స్టైల్, హావభావాలు, లుక్స్ సినిమాకు అచ్చుగుద్దినట్టు సరిపోయాయి అని ఇంకొదరు ట్రోల్ చేస్తున్నారు.
ఇక పాండ్యా దక్షిణాఫ్రికా పర్యటనలో పేలవ ప్రదర్శనతో అభిమానులు ఆగ్రహానికి గురవుతున్న విషయం తెలిసిందే. తొలి టెస్టు 93 పరుగులు మినహా అంతకు మించి పాండ్యా బ్యాట్‌కు పనిచెప్పలేదు. ఇటు బౌలింగ్‌లోను అంతగా రాణించడం లేదు. దీంతో మాజీ క్రికెటర్లు, సోషల్ మీడియా నుంచి పెద్ద ఎత్తున్న విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
Hardik Pandya Was Lit In Black Panther🔥 pic.twitter.com/6FgJCiGygr
— Preeyesh Babaria🇮🇳 (@Preeyesh07) 19 February 2018