ఉద్యోగులే ఆటగాళ్లుగా ఉండాలి

Employees should be players - Sakshi

రైల్వేస్‌ అండర్‌–19 జట్టుపై బీసీసీఐ  

న్యూఢిల్లీ: బీసీసీఐ సాంకేతిక కమిటీ ఇటీవల తీసుకున్న నిర్ణయం దేశంలో క్రీడాకారులను ఉద్యోగులుగా నియమించేకునే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్వేస్‌ను సంకటంలో పడేయనుంది. దేశవాళీ అండర్‌–19 టోర్నీ అయిన కూచ్‌ బెహార్‌ ట్రోఫీలో రైల్వేస్‌ జట్టు తరఫున ఉద్యోగులు కాకుండా వారి పిల్లలు ఆడుతున్నారంటూ వచ్చిన ఫిర్యాదులను కోల్‌కతాలో కొద్ది రోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో సాంకేతిక కమిటీ చర్చించింది. ఇకపై దీనికి అనుమతించకూడదని నిర్ణయించింది. అనుబంధ సంఘాలకు సంబంధించి బీసీసీఐ అన్ని స్థాయిల టోర్నీల్లో ఈ విషయమై కఠినంగా ఉండాలని భావిస్తోంది.

మరోవైపు కూచ్‌ బెహార్‌లో తమ ఉద్యోగుల పిల్లల ప్రాతినిధ్యం వాస్తమేనని రైల్వే స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డ్‌ (ఆర్‌ఎస్‌పీబీ) కార్యదర్శి రేఖా యాదవ్‌ అంగీకరించారు. ఏటా 15–20 మంది అండర్‌–19 క్రీడాకారులతో జట్టును రూపొందించి టోర్నీకి పంపడం తమకు సాధ్యం కానందునే ఇలా చేస్తున్నట్లు ఆమె వివరణ ఇచ్చారు. చాలామంది కుర్రాళ్లు ముంబై, ఢిల్లీ, కర్ణాటక వంటి రాష్ట్రాల జట్లకు ఆడేందుకు ప్రాధాన్యం ఇస్తుండటంతో తమ సొంత ఎంపిక ప్రక్రియలో కూడా సరిపడినంత మంది దొరకడం లేదని వివరించారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top