ఓపెనింగ్‌ చెయ్‌... లేదంటే కూర్చో 

Dont ask questions. If you dont want to open, sit on the bench: Ganguly told Sehwag - Sakshi

సెహ్వాగ్‌ టెస్టులాడాలంటే చెప్పింది చెయ్యాలన్న గంగూలీ

ఓపెనింగ్‌ చరిత్రపై స్పందించిన వీరూ   

కోల్‌కతా: టెస్టుల్లో తను ఓపెనింగ్‌ చేయాల్సిందేనని అప్పటి కెప్టెన్‌ ఖరాఖండిగా చెప్పినట్లు మాజీ డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తెలిపాడు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన వీరూ... 2002లో ఇంగ్లండ్‌ టూర్‌లో తనకెదురైన అనుభవాన్ని మీడియాతో పంచుకున్నాడు. ‘లార్డ్స్‌ టెస్టులో ఓపెన్‌ చేయాలని గంగూలీ చెప్పాడు. నేనెందుకు అని కోచ్‌ (జాన్‌రైట్‌), కెప్టెన్‌లను ప్రశ్నించా. అప్పుడు వాళ్లిద్దరు... ఇప్పటికే వన్డేల్లో ఓపెనర్‌గా రాణించావు కాబట్టి  టెస్టుల్లో నీవు ఓపెనింగ్‌ చేసేందుకు ఈ అనుభవం చాలని బదులిచ్చారు.

అప్పుడు మళ్లీ నేను వారితో సచిన్‌ దశాబ్దంపైగా ఓపెనర్‌. మీరు (గంగూలీ) కూడా 1998 నుంచి ఓపెనింగ్‌ చేస్తున్నారు కదా. మీరే ఓపెన్‌ చేయండి. నేను మిడిలార్డర్‌లో దిగుతానని చెప్పా. వెంటనే గంగూలీ... టెస్టులాడాలంటే ఓపెనింగ్‌ స్థానమే ఖాళీగా ఉంది. ప్రశ్నలు వేయకుండా ఓపెనింగ్‌ చెయ్‌ లేదంటే బెంచ్‌పై కూర్చోమని తెగేసి చెప్పాడు’ అని సెహ్వాగ్‌ నాటి సంగతుల్ని వివరించాడు.

చివరకు తప్పకపోవడంతో ఒకవేళ ఓపెనర్‌గా విఫలమైతే జట్టు నుంచి తీసేయకుండా మిడిలార్డర్‌లో చాన్స్‌ ఇవ్వాలని గంగూలీతో వాగ్ధానం కోరగా... ‘దాదా’ సరేననడంతో ఓపెనర్‌గా లార్డ్స్‌లో ఆడిన తొలి టెస్టులో 84 పరుగులు చేశాడు సెహ్వాగ్‌. అయితే లార్డ్స్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో ఏ ఆటగాడు సెంచరీ చేయలేదని ఆ సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నందుకు సచిన్, గంగూలీ, ద్రవిడ్‌లు తనను తిట్టారని సెహ్వాగ్‌ చెప్పాడు. నాట్‌వెస్ట్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌ తమ ముందుంచిన 325 పరుగుల లక్ష్యంపై కంగారు వద్దని, తక్కువ వన్డేలాడిన వాళ్లే అంత స్కోరు చేసినపుడు... ఏడాదికి 30–35 వన్డేలాడే తామెందుకు చేయలేమని గంగూలీతో చెప్పినట్లు సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. కైఫ్‌ వీరోచిత ఇన్నింగ్స్‌తో నాట్‌వెస్ట్‌ ట్రోఫీ భారత్‌ వశమైన సంగతి తెలిసిందే. ఈ ఐపీఎల్‌లో గేల్‌పై నమ్మకంతోనే రెండో రోజు వేలంలో అతన్ని కనీస ధరకు తీసుకున్నట్లు చెప్పాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top