ఏటీపీ కప్‌ విజేత సెర్బియా

Djokovic Beats Nadal to Lead Serbia to ATP Cup Win - Sakshi

ఫైనల్లో స్పెయిన్‌పై గెలుపు

అదరగొట్టిన జొకోవిచ్‌

సిడ్నీ: తొలి ఏటీపీ కప్‌ టీమ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ విజేతగా సెర్బియా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో నొవాక్‌ జొకోవిచ్‌ సారథ్యంలోని సెర్బియా 2–1తో రాఫెల్‌ నాదల్‌ నాయకత్వంలోని స్పెయిన్‌పై గెలుపొందింది. రెండో సింగిల్స్, డబుల్స్‌ మ్యాచ్‌లో బరిలో దిగిన జొకోవిచ్‌ రెండు మ్యాచ్‌లనూ గెలిచి జట్టుకు ఒంటి చేత్తో కప్‌ను అందించాడు. తొలి సింగిల్స్‌ మ్యాచ్‌లో బాటిస్టా అగుట్‌ (స్పెయిన్‌) 7–5, 6–1తో డుసాన్‌ లజోవిచ్‌ (సెర్బియా)పై గెలుపొంది స్పెయిన్‌కు 1–0 ఆధిక్యాన్నిచ్చాడు. నిలవాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో రెండో సింగిల్స్‌ మ్యాచ్‌ బరిలో దిగిన జొకోవిచ్‌ 6–2, 7–6 (7/4)తో ప్రపంచ నంబర్‌వన్‌ నాదల్‌పై నెగ్గడంతో స్కోరు 1–1తో సమమైంది. తొలి సెట్‌లో జోకర్‌ బలమైన సరీ్వస్‌లకు నాదల్‌ దగ్గర సమాధానమే లేకపోయింది.

కానీ రెండో సెట్‌లో మాత్రం నాదల్‌ కాస్త ప్రతిఘటించాడు. దీంతో సెట్‌ టై బ్రేక్‌కు వెళ్లింది. అక్కడ మరోసారి విజృంభించిన జొకోవిచ్‌ టై బ్రేక్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకున్నాడు. 2013 నుంచి హార్డ్‌ కోర్టులపై నాదల్‌తో జరిగిన ప్రతీ మ్యాచ్‌లోనూ జొకోవిచ్‌ గెలవడం విశేషం. ఇక కప్‌ విజేతను నిర్ణయించే డబుల్స్‌ పోరులో జొకోవిచ్‌–విక్టర్‌ ట్రయెస్కీ ద్వయం 6–3, 6–4తో లోపెజ్‌–కరెనో బుస్టా జోడీ (స్పెయిన్‌)పై గెలిచింది. దాంతో ఏటీపీ కప్‌ సెర్బియా సొంతం అయింది. ఈ టోర్నీలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన జొకోవిచ్, బాటిస్టా అగుట్‌ ఖాతాలో 750 ఏటీపీ పాయింట్లు చేరాయి.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top