శిఖర్‌ నడిపించగా...  | Dhawan stars as India ease past Bangladesh | Sakshi
Sakshi News home page

శిఖర్‌ నడిపించగా... 

Mar 9 2018 1:06 AM | Updated on Mar 9 2018 7:16 AM

Dhawan stars as India ease past Bangladesh - Sakshi

శ్రీలంక చేతిలో పరాజయం నుంచి భారత్‌ వెంటనే కోలుకుంది. బౌలర్ల సమష్టి ప్రదర్శనకు తోడు శిఖర్‌ ధావన్‌ మరోసారి కదం తొక్కడంతో ముక్కోణపు టి20 టోర్నీలో బోణీ చేసింది. ఆడుతూ పాడుతూ బంగ్లాదేశ్‌పై ఏకపక్ష విజయాన్ని అందుకుంది. టి20 తరహాలో భారీ షాట్లు, మెరుపు బ్యాటింగ్‌ పెద్దగా కనిపించని ఈ మ్యాచ్‌లో టీమిండియా పూర్తి ఆధిపత్యం కొనసాగించగా... బంగ్లాదేశ్‌ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఫలితంగా మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే గెలుపు రోహిత్‌ సేన ఖాతాలో చేరింది.   

కొలంబో: ముక్కోణపు టి20 టోర్నీ (నిదహాస్‌ ట్రోఫీ)లో భారత్‌ తొలి విజయాన్ని అందుకుంది. గురువారం ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఆరు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. లిటన్‌ దాస్‌ (30 బంతుల్లో 34; 3 ఫోర్లు), షబ్బీర్‌ రహమాన్‌ (26 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. భారత బౌలర్లలో ఉనాద్కట్‌ 3, ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’  విజయ్‌ శంకర్‌ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్‌ 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 140 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (43 బంతుల్లో 55; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) తన ఫామ్‌ను కొనసాగిస్తూ మరో హాఫ్‌ సెంచరీ నమోదు చేయగా, సురేశ్‌ రైనా (27 బంతుల్లో 28; 1 ఫోర్, 1 సిక్స్‌) సహకారం అందించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 54 బంతుల్లో 68 పరుగులు జోడించారు. చివర్లో మనీశ్‌ పాండే (19 బంతుల్లో 27 నాటౌట్‌; 3 ఫోర్లు) రాణించాడు. తమ తర్వాతి మ్యాచ్‌లో భారత్‌ సోమవారం శ్రీలంకతో తలపడుతుంది.  

నిస్సారంగా... 
భారత్‌తో గతంలో ఆడిన ఐదు టి20ల్లోనూ ఓడిన బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ ఈ మ్యాచ్‌లోనూ నాసిరకంగా కనిపించింది. టి20 స్థాయిలో ఎలాంటి మెరుపులు లేకుండా, ఒక్క ఆటగాడు కూడా ధాటిగా ఆడకుండా జట్టు ఇన్నింగ్స్‌ సాగింది. మధ్యలో భారత్‌ రెండు క్యాచ్‌లు వదిలేసినా, రనౌట్‌ అవకాశాలు వృథా చేసినా ఆ జట్టు వాటిని ఉపయోగించుకోలేకపోయింది. జట్టు ఇన్నింగ్స్‌లో ఏకంగా 55 డాట్‌ బాల్స్‌ ఉండటం పరిస్థితిని సూచిస్తోంది. ఉనాద్కట్‌ వేసిన మూడో ఓవర్లో సిక్సర్‌ కొట్టిన సర్కార్‌ (14) అదే ఓవర్లో వెనుదిరగడంతో బంగ్లా తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత శార్దుల్‌ తొలి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన తమీమ్‌ (15) తర్వాతి బంతికే అవుటయ్యాడు. విజయ్‌ శంకర్‌ తొలి ఓవర్లో రైనా, సుందర్‌ క్యాచ్‌లు వదిలేయడంతో బతికిపోయిన దాస్‌ ఆ తర్వాత మరికొన్ని పరుగులు జోడించగలిగాడు. కీపర్‌ కార్తీక్‌ క్యాచ్‌తో ముష్ఫికర్‌ (18) ఆట ముగిసింది. రివ్యూ ద్వారా భారత్‌ ఈ ఫలితం పొందగా... విజయ్‌ శంకర్‌ కెరీర్‌లో ఇది తొలి వికెట్‌ కావడం విశేషం. కెప్టెన్‌ మహ్ముదుల్లా (1) కూడా ప్రభావం చూపలేకపోయాడు. దాస్‌ను చహల్‌ ఔట్‌ చేయగా, చివర్లో వేగంగా ఆడే ప్రయత్నం చేసిన షబ్బీర్‌ను చక్కటి బంతితో ఉనాద్కట్‌ డగౌట్‌కు పంపించాడు. బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసిన మన బౌలర్లు కొన్ని సార్లు గతి తప్పారు. 11 వైడ్‌లు, 2 నోబాల్‌లు సహా మొత్తం 15 పరుగులు ఎక్స్‌ట్రాలు ఇచ్చారు.   

అర్ధసెంచరీ భాగస్వామ్యం... 
స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్‌కు పెద్దగా ప్రతిఘటన ఎదురు కాలేదు. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినా ఎలాంటి ఇబ్బంది లేకుండా టీమిండియా విజయం దిశగా దూసుకెళ్లింది. ఇన్నింగ్స్‌ రెండో బంతిని ఫోర్‌గా మలచి ధావన్‌ శుభారంభం చేయగా, రెండో ఓవర్లో రోహిత్‌ (17) తాను ఎదుర్కొన్న ఐదు బంతుల వ్యవధిలో మూడు బౌండరీలు బాదాడు. అయితే ముస్తఫిజుర్‌ బంతిని రోహిత్‌ వికెట్లపైకి ఆడుకోగా, కొద్ది సేపటికి రూబెల్‌ బౌలింగ్‌లో రిషభ్‌ పంత్‌ (7) కూడా అదే తరహాలో అవుటయ్యాడు. ఈ దశలో ధావన్, రైనా చకచకా పరుగులు సాధిస్తూ పోయారు. ధావన్‌ గత మ్యాచ్‌ జోరును కొనసాగించగా, రైనా మాత్రం తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడాడు. మెహదీ హసన్‌ బౌలింగ్‌లో స్లాగ్‌ స్వీప్‌ ద్వారా కొట్టిన సిక్సర్‌తో రైనా అంతర్జాతీయ టి20ల్లో 50 సిక్సర్లు పూర్తి చేసుకోవడం విశేషం. నజ్ముల్‌ బౌలింగ్‌లో ఫైన్‌లెగ్‌ దిశగా ఫోర్‌ కొట్టిన ధావన్‌ 35 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. విజయానికి చేరువైన దశలో తక్కువ వ్యవధిలో వీరిద్దరు వెనుదిరిగినా... దినేశ్‌ కార్తీక్‌ (2 నాటౌట్‌)తో కలిసి పాండే జట్టును గెలిపించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement