గేల్‌ మెరుపులు.. ఆకాశంలో ఉరుములు!

Chris Gayle hammers 122 Runs For Vancouver Knights - Sakshi

ఒంటారియో:  టీ20 స్పెషలిస్ట్‌, యూనివర్శల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ మళ్లీ గర్జించాడు. విదేశీ లీగ్‌ల్లో భాగంగా గ్లోబల్‌ టీ20 కెనడాలో వాన్‌కూవర్‌ నైట్స్‌ తరఫున ఆడుతున్న గేల్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. సోమవారం మోంట్రియల్‌ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్‌ బౌండరీల మోత మోగించాడు. 54 బంతుల్లో 12 సిక్సర్లు, 7 ఫోర్లతో  అజేయంగా 122 పరుగులు సాధించాడు. మోంట్రియల్‌ బౌలర్లను ఊచకోత కోస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తొలి వికెట్‌కు విస్సే(51)తో కలిసి 63 పరుగులు జత చేసిన గేల్‌.. చెడ్విక్‌ వాల్టన్‌తో కలిసి మరో 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

తొలి వికెట్‌ భాగస్వామ్యం నెలకొల్పే క్రమంలో నెమ్మదిగా ఆడిన గేల్‌.. ఆపై రెచ్చిపోయి ఆడాడు. మూడో వికెట్‌కు వాన్‌ దెర్‌ డస్సెన్‌(56)తో​ కలిసి 139 పరుగుల భారీ భాగస్వామ్యం సాధించడంలో దోహదపడ్డాడు. దాంతో వాన్‌కూవర్‌ నైట్స్‌ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 276 పరుగులు సాధించింది. ఇది టీ20 చరిత్రలో రెండో అత్యధిక స్కోరుగా నమోదైంది. టాప్‌ ప్లేస్‌లో అఫ్గానిస్తాన్‌ ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గాన్‌ 278 పరుగులు చేసింది. ఫలితంగా టీ20ల్లో అత్యధిక స్కోరు రికార్డు అఫ్గాన్‌ పేరిట లిఖించబడింది. ఆ తర్వాత వాన్‌కూవర్‌ నైట్స్‌దే టీ20ల్లో అత్యధిక స్కోరు.కాగా, వాన్‌కూవర్‌ విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే అవకాశం మోంట్రియల్‌ టైగర్స్‌కు రాలేదు. గేల్‌ గర్జన తర్వాత ఆకాశంలో ఉరుములు, మెరుపులు కారణంగా మ్యాచ్‌ను రద్దు చేశారు. దాంతో ఈ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top