
కేరళ క్రికెట్ లీగ్ 2025లో పెను సంచలనం నమోదైంది. శనివారం త్రివేండ్రం రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కాలికట్ గ్లోబ్‌స్టార్స్ బ్యాటర్ సల్మాన్ నిజార్ విధ్వంసం సృష్టించాడు. నిజార్ కేవలం 26 బంతుల్లోనే 12 సిక్సర్లతో 86 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తాను ఆడిన 26 బంతుల్లో అతను వరుసగా 1, 0, 1, 1, 6, 1, 0, 1, 1, 1, 2, 1, 1, 6, 6, 6, 6, 6, 1, 6, 2, 6, 6, 6, 6, 6 బాదాడు.
నిజార్ 72 పరుగులు సిక్సర్ల ద్వారానే వచ్చాయి. తొలుత బ్యాటింగ్‌కు ఇబ్బంది పడ్డ నిజార్.. ఆఖరి రెండు ఓవర్లలో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బాసిల్ థంపి వేసిన 19వ ఓవర్లో తొలి ఐదు బంతుల్లో వరుసగా 6, 6, 6, 6, 6 కొట్టిన అతను చివరి బంతికి సింగిల్ తీసి మళ్లీ స్ట్రైకింగ్‌కు వచ్చాడు. అభిజిత్ ప్రవీణ్ వేసిన ఆఖరి ఓవర్లో తొలి బంతికి సిక్స్ బాదగా, తర్వాతి బంతి వైడ్ అయింది.
దాంతో అదనపు బంతికి 2 పరుగులు సాధించిన నిజార్...తర్వాతి ఐదు బంతుల్లో మళ్లీ వరుసగా 6, 6, 6, 6, 6 కొట్టి ముగించాడు. అతడి విధ్వంసం ఫలితంగా కాలికట్ జట్టు చివరి 12 బంతుల్లో 71 పరుగులు చేసింది. తద్వారా టీ20 క్రికెట్‌లో ఆఖరి రెండు ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా కాలికట్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. నిజార్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్ కంటే ముందు అల్లెప్పీ రిపిల్స్‌పై కేవలం 26 బంతుల్లో 44 పరుగులు చేశాడు.
అంతేకాకుండా రంజీ ట్రోఫీ గత సీజన్‌లో కేరళ తరపున లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. 86.71 యావరేజ్‌తో 607 పరుగులు నమోదు చేశాడు. ఈ క్రమంలో అతడిని ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ ట్రయల్స్‌కు పిలిచింది. కానీ వేలంలో అతడిని సీఎస్‌కే కొనుగోలు చేయలేదు.
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. త్రివేండ్రం రాయల్స్‌పై 13 పరుగుల తేడాతో కాలికట్ విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత కాలికట్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. అనంతరం 19.3 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌట్ అయింది.
చదవండి: T20 WC 2026: టీమిండియా ఓపెనర్లుగా ఊహించని పేర్లు!