అసలు చాపెల్‌ ఎవడు : గేల్‌ ఫైర్‌

Chris Gayle Asks Who Is Chappell - Sakshi

ముంబై : ఐపీఎల్‌-11 సీజన్‌లో తన బ్యాట్‌తో అభిమానులను అలరించాడు వెస్టిండీస్‌ విధ్వంసకర్‌ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌గేల్‌. అయితే ఓ చానెల్‌ ఇంటర్వ్యూలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ ఇయాన్‌ చాపెల్‌ పేరును ప్రస్తావిస్తే చిర్రుబుర్రులాడాడు. 2016 బిగ్‌బాష్‌ లీగ్‌ సందర్భంగా గేల్‌ మహిళా జర్నలిస్టు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి విమర్శలు ఎదుర్కొన్నా విషయం తెలిసిందే.  అప్పట్లో ఈ ఘటనపై ఇయాన్‌ చాపెల్‌ స్పందిస్తూ.. గేల్‌ను ప్రపంచ వ్యాప్తంగా నిషేదించాలన్నాడు. క్రికెట్‌ ఆస్ట్రేలియా బిగ్‌బాష్‌ లీగ్‌లో అనుమతించకుండా చర్యలు తీసుకోవాలని కోరాడు. ఇక క్రికెట్‌ ఆస్ట్రేలియా సైతం  గేల్‌కు 10 వేల యూఎస్ డాలర్లు జరిమానాగా విధించింది. అనంతరం బిగ్ బాష్ లీగ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ వంటి ఘటనలు ఏమైనా జరిగితే మాత్రమే జోక్యం చేసుకుంటామని, ఆటగాళ్ల నియమాకాల విషయం మాత్రం తమకు సంబంధం లేదని, బిగ్ బాష్‌లీగ్‌లో గేల్ ఆడేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని  సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ జేమ్స్ సదర్లాండ్‌ పేర్కొనడంతో గేల్‌కు ఊరట లభించింది.

అసలు అప్పుడేం జరిగిందంటే..
2016 బిగ్‌ బాష్‌ లీగ్‌ సందర్భంగా హోబార్ట్‌ హరికేన్స్‌-మెల్‌బోర్న్ రెనగేడ్స్‌ మ్యాచ్ అనంతరం మహిళా జర్నలిస్టు పట్ల గేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్‌ అనంతరం  టెన్‌ స్పోర్ట్స్ ప్రజెంటర్‌ మెలానీ మెక్‌లాఫిలిన్‌ గేల్‌ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. గేల్ ఇన్నింగ్స్‌ గురించి కొన్ని ప్రశ్నలు అడగ్గా.. గేల్ స్పందిస్తూ.. 'నువ్వు చేసే ఈ ఇంటర్వ్యూ కోసమే నేను చాలా బాగా బ్యాటింగ్ చేశాను. నీ కళ్లు చాలా అందంగా ఉన్నాయి. మనం కలిసి డ్రింక్స్‌కు వెళ్దామా.. మరీ సిగ్గుతో పొంగిపోకు బేబి' అని అన్నాడు. తాజాగా ఈ వివాదాన్ని గుర్తు చేస్తూ సదరు రిపోర్టర్‌ ఇయన్‌ చాపెల్‌ వ్యాఖ్యలను ప్రస్తావించగా.. అసలు ఇయాన్‌ చాపెల్‌ ఎవడని గేల్‌ ఘాటుగా సమాధానమిచ్చాడు. 

ఐపీఎల్ ఫైనల్‌పై స్పందిస్తూ.. రెండు బీకర జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ చూడకుండా ఉంటామా అని, 179 పరుగులు సాధించిన సన్‌రైజర్స్‌ గెలుస్తుందనుకున్నానని, కానీ షేన్‌ వాట్సన్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో చెన్నైని గెలిపించాడని గేల్‌ పేర్కొన్నాడు. క్రీజులో పరుగుల తీయడానికి వెనకడుగేస్తారన్న ప్రశ్నకు సైతం ఆగ్రహం వ్యక్తం చేశాడు. అవసరమైతే నాలుగు పరుగులు కూడా తీస్తానన్నాడు. ఈ సీజన్‌ కింగ్స్‌పంజాబ్‌ తరపున బరిలోకి దిగిన గేల్‌.. ప్రారంభ మ్యాచుల్లో విధ్వంసం సృష్టించినా చివర్లో తడబడటంతో ఆ జట్టు లీగ్ దశ నుంచే నిష్క్రమించిన విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top