‘ధోని కంటే అతనే అత్యుత్తమం’ | Buttler is better than Dhoni in white ball cricket, Paine | Sakshi
Sakshi News home page

‘ధోని కంటే అతనే అత్యుత్తమం’

Jun 25 2018 5:02 PM | Updated on Jun 25 2018 5:04 PM

Buttler is better than Dhoni in white ball cricket, Paine - Sakshi

మాంచెస్టర్‌: ప్రపంచ క్రికెట్‌లో భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని స్థానం ప్రత్యేకం. భారత క్రికెట్‌ జట్టును ఉన్నత స్థానంలో నిలపడంతో పాటు రెండు వరల్డ్‌ కప్‌(వన్డే, టీ20 వరల‍్డ్‌ కప్‌)లు సాధించిన ఘనత ధోనిది. అటు కెప్టెన్‌గా, ఇటు వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మన్‌గా తనదైన ముద్రను ధోని సొంతం చేసుకున్నాడు. టీమిండియా కెప్టెన్సీ పదవికి ధోని చాలాకాలం క్రితమే వీడ్కోలు చెప్పినప్పటికీ, వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మన్‌గా మాత్రం ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. గత కొన్నేళ్లుగా వన్డే క్రికెట్‌లో ఉత్తమ వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మెన్‌లలో ధోనిదే టాప్‌ ప్లేస్‌.  కాగా, ఆస్ట్రేలియా కెప్టెన్‌ టిమ్‌ పైనీ దృష్టిలో ధోని కంటే ఉత్తమ వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ అట. వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మన్లలో బట్లర్‌కు ఎంత  రేటింగ్‌ ఇస్తారు అనే దానిపై స్పందించిన పైనీ.. అతనే టాప్‌ అంటూ పేర్కొన్నాడు.

‘వన్డే క్రికెట్‌లో ఉత్తమ కీపర్‌-బ్యాట్స్‌మన్లలో బట్లరే ముందు వరుసలో ఉన్నాడు. ఇక్కడ అతనికి పోటీగా ఎవరూ లేరనేది నా అభిప్రాయం. ఎంఎస్‌ ధోని మంచి వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మన్‌. కానీ ప్రస్తుతం మాత్రం బట్లర్‌ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. పరిస్థితుల్ని ఆకళింపు చేసుకుని ఆడటంలో బట్లర్‌ దిట్ట. ప్రధానంగా వన్డే గేమ్‌లో బట్లర్‌ చాలా ప్రమాదకరమైన ఆటగాడు’ అని పైనీ తెలిపాడు.  ఆసీస్‌తో జరిగిన చివరి వన్డేలో బట్లర్‌(110 నాటౌట్‌) అజేయంగా శతకం సాధించి సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

Advertisement
 
Advertisement
Advertisement