ఆంధ్రకు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం

Andhra And Punjab Match Finshed As Draw - Sakshi

పంజాబ్‌తో రంజీ ట్రోఫీ మ్యాచ్‌ ‘డ్రా’  

సాక్షి, విశాఖపట్నం: మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా రాణించడంతో పంజాబ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌ను ఆంధ్ర జట్టు ‘డ్రా’గా ముగించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 328/5తో ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆంధ్ర చివరకు 423 పరుగులకు ఆలౌటైంది. ఏడు పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సంపాదించింది. చివరి రోజు ఆంధ్ర 95 పరుగులు జతచేసి మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది. రికీ భుయ్‌ (181; 15 ఫోర్లు, 4 సిక్స్‌లు) క్రితం రోజు స్కోరుకు 30 పరుగులు జతచేసి పెవిలియన్‌ చేరగా... షోయబ్‌ ఖాన్‌ (52; 6 ఫోర్లు) అర్ధశతకం సాధించాడు.

పంజాబ్‌ బౌలర్లలో అరంగేట్రం స్పిన్నర్‌ మయాంక్‌ మార్కండే 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పంజాబ్‌ ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 102 పరుగులు చేసింది. శుబ్‌మన్‌ గిల్‌ (54 నాటౌట్‌; 7 ఫోర్లు) అర్ధసెంచరీతో మెరిశాడు. ఆంధ్ర బౌలర్లలో విజయ్‌ కుమార్, షోయబ్‌ ఖాన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. అంతకుముందు పంజాబ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 414 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిసినా తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సంపాదించిన ఆంధ్రకు మూడు పాయింట్లు, పంజాబ్‌కు ఒక పాయింట్‌ లభించాయి.

హైదరాబాద్‌ మ్యాచ్‌ ‘డ్రా’
తిరువనంతపురం: వర్షం అంతరాయం కలిగించిన కేరళ, హైదరాబాద్‌ మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 30/1తో ఆదివారం చివరి రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన హైదరాబాద్‌ ఆట ముగిసే సమయానికి 112 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. సందీప్‌ (155 బంతుల్లో 56 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకం సాధించగా... హిమాలయ్‌ అగర్వాల్‌ (132 బంతుల్లో 48; 7 ఫోర్లు), సుమంత్‌ (136 బంతుల్లో 42 నాటౌట్‌; 5 ఫోర్లు) ఆకట్టుకున్నారు. అంతకుముందు కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 495/6 వద్ద డిక్లేర్‌ చేసింది. మ్యాచ్‌లో రెండు జట్ల ఇన్నింగ్స్‌లు పూర్తి కాకపోవడంతో రెండు జట్లకు చెరో పాయింట్‌ కేటాయించారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top