
లాస్ ఏంజెలిస్: అమెరికా విఖ్యాత బాస్కెట్‌బాల్ ప్లేయర్, దివంగత కోబీ బ్రయాంట్ మరణానంతరం కూడా తన అభిమానులకు తానెంతటి ఆరాధ్యమో ప్రపంచానికి చాటుతున్నాడు. నేషనల్ బాస్కెట్‌బాల్ లీగ్ (ఎన్‌బీఏ) నుంచి రిటైర్ అవుతూ... తన వీడ్కోలు ప్రసంగంలో భుజాలపై వేసుకున్న టవల్‌ను ఒక వేలం పాటలో ఉంచగా... అది 33,077 అమెరికన్ డాలర్లు (రూ.24.89 లక్షలు) పలికి కోబీ క్రేజ్‌ను మరోసారి తెలియజేసింది. ఈ వేలం పాటలో కోబీ అభిమాని ఒకరు ఈ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నాడు. తన 20 ఏళ్ల ఎన్‌బీఏ కెరీర్ మొత్తం లాస్ ఏంజెలిస్ లేకర్స్‌కే ప్రాతినిధ్యం వహించిన కోబీ... ఈ ఏడాది జనవరి 26న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు.