మళ్లీ మొదటికి.. | Sakshi
Sakshi News home page

మళ్లీ మొదటికి..

Published Mon, Jan 22 2018 9:06 AM

confusion on panchayath and municipality borders - Sakshi

గ్రామ పంచాయతీలకు ముందస్తు ఎన్నికల ప్రకటన నేపథ్యంలో కొత్త పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అదే సమయంలో కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలపైనా కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతమున్న మున్సిపాలిటీలు, నగర పంచాయతీల విస్తరణకు సంబంధించి గతంలోనే టౌన్‌ ప్లానింగ్‌ విభాగం ప్రతిపాదనలు రూపొందించింది. తాజాగా దూరం ప్రాతిపదికన కాకుండా.. పట్టణీకరణ చెందుతున్న గ్రామాలను మాత్రమే మున్సిపాలిటీల్లో విలీనం చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. –సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి

సంగారెడ్డి : జిల్లా కేంద్రంతో పాటు సదాశివపేట, జహీరాబాద్‌ మున్సిపాలిటీలు, అందోలు–జోగిపేట నగర పంచాయతీల్లో సమీప గ్రామాలను విలీనం చేయాలని మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం ఇటీవల ప్రతిపాదనలు రూపొందించింది. మున్సిపాలిటీ సరిహద్దుల నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీలో విలీనం చేయాలని ప్రతిపాదించారు. ఈ మేరకు సంగారెడ్డి, సదాశివపేటలో ఏడేసి, జహీరాబాద్‌లో పది, అందోలు–జోగిపేట నగర పంచాయతీలో ఒక గ్రామ పంచాయతీ చొప్పున మొత్తం 25 పంచాయతీలను  విలీనం చేయాలని నిర్ణయించారు. ప్రతిపాదిత విలీన గ్రామ పంచాయతీల తీర్మానం కూడా తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటి వరకు 12 గ్రామ పంచాయతీలు తీర్మానం చేయగా.. అన్ని చోట్లా విలీనాన్ని ముక్త కంఠంతో వ్యతిరేకించారు. మున్సిపాలిటీల్లో సమీప గ్రామ పంచాయతీల విలీనానికి సంబంధించి.. మార్గదర్శకాల్లో స్వల్ప మార్పులు చేయాలని భావిస్తోంది. మున్సిపాలిటీ సరిహద్దుల నుంచి దూరాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవద్దని తాజాగా ఆదేశించింది. మున్సిపాలిటీ సరిహద్దు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండి.. వేగంగా పట్టణీకరణ చెందుతున్న గ్రామ పంచాయతీలను మాత్రమే విలీనం చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించింది. కొత్తగా జనావాసాలు, వెంచర్ల ఏర్పాటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఉదాహరణకు గతంలో సంగారెడ్డి మున్సిపాలిటీలో ఏడు గ్రామ పంచాయతీల విలీనాన్ని ప్రతిపాదించారు. తాజా ఆదేశాల ప్రకారం పట్టణీకరణ చెందుతున్న నాగాపూర్, మల్కాపూర్, పోతిరెడ్డిపల్లి, కందిగ్రామాలు మాత్రమే విలీనమయ్యే అవకాశం ఉంది.

ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి సమావేశం..
మున్సిపాలిటీలు, నగర పంచాయతీల సరిహద్దుల విస్తరణ, కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి మెదక్‌ జిల్లాకు ప్రత్యేక అధికారిని నియమించింది. ప్రత్యేక అధికారిగా నియమితులైన జాన్‌ ఎఫ్‌ కెన్నడీ శనివారం మెదక్, సంగారెడ్డి జిల్లాల మున్సిపల్‌ అధికారులు, డీపీఓలతో సమావేశమయ్యారు. సోమవారం సిద్దిపేట జిల్లాకు చెందిన అధికారులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఏర్పాటు, సరిహద్దు విస్తరణకు సంబంధించి ప్రతిపాదనల రూపకల్పనలో పాటించాల్సిన మార్గదర్శకాలపై ప్రత్యేక అధికారి సూచనలు చేస్తున్నారు. కాగా 20వేలకు పైబడిన జనాభా కలిగిన గ్రామ పంచాయతీలను నగర పంచాయతీలుగా మారుస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో అమీన్‌పూర్, బొల్లారం, నారాయణఖేడ్, కోహిర్, తెల్లాపూర్‌ పంచాయతీలకు నగర పంచాయతీ హోదా కోసం ప్రతిపాదనలు రూపొందించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెల్లాపూర్, కోహిర్‌ జనాభా 15వేలకు మించడం లేదు. సమీప గ్రామ పంచాయతీలను విలీనం చేస్తే తప్ప ఈ రెండు పంచాయతీలకు నగర పంచాయతీ హోదా దక్కేలా లేదు. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిని ఆనుకుని ఉండడంతో అమీన్‌పూర్‌ (జనాభా 36,452)ను కూడా ప్రస్తుతానికి నగర పంచాయతీ హోదా ఇచ్చే సూచనలు కనిపించడం లేదు. బొల్లారం, నారాయణఖేడ్‌ గ్రామ పంచాయతీలు మాత్రమే నగర పంచాయతీలుగా మారే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

మళ్లీ మొదటికి!
గ్రామ పంచాయతీ    2011 జనాభా        సమీప గ్రామాలు కలిస్తే..
అమీన్‌పూర్‌              36,452                  44,132
బొల్లారం                   34,667                  36,480
నారాయణఖేడ్‌          18,243                  30,418
కోహిర్‌                     15,075                  29,310
తెల్లాపూర్‌                14,403                  15,087  

Advertisement

తప్పక చదవండి

Advertisement