‘మీ ఆదరాభిమానాలతోనే మంత్రినయ్యా’

YSRCP Minister Taneti Vanith Attended a Meeting In Kovvuru - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి(కొవ్వూరు రూరల్‌) : పదవులు, రాజకీయాలు శాశ్వతం కాదని, మనుషుల మధ్య బంధాలు నిలిచి ఉంటాయని నమ్మే వ్యక్తిలో తాను ఒకరినని స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. గురువారం మండలంలోని పశివేదలలో నిర్వహించిన కొవ్వూరు నియోజకవర్గ యునైటెడ్‌ పాస్టర్స్‌ అసోసియేషన్‌ (కృపా) సమావేశానికి మంత్రి వనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌  పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి, జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి, తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి దైవసేవకుల ప్రార్థనలే కారణమన్నారు. అందరి అధరాభిమానాలతోనే 2009 నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నానన్నారు. టీడీపీ కంచుకోటగా ఉన్న కొవ్వూరు నియోజకవర్గంలో ప్రతిపక్షంలో పనిచేయడం కత్తి మీద సాములాంటిదైనా, తనతో పాటు చాలా మంది నాయకులు కష్టనష్టాలకు ఓర్చి వెంట నడిచారన్నారు. ప్రతిపక్షంలో ఉండగా తనపై రకరకాల నిందలు వేశారని, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తరువాత సొంత పార్టీలోనే ఉంటూ అవే నిందలను కొనసాగిస్తున్నారని, వారి మనసు మారేలా అం దరూ ప్రార్థనలు చేయాలని కోరారు.

మహిళగా తాను కుటుంబం, బంధువులను సైతం పక్కనబెట్టి పార్టీ కోసం పనిచేస్తున్నానన్నారు. క్రైస్ట్‌ ఫెలోషిప్‌ ప్రార్థనా మందిరంలో జరిగిన రాష్ట్ర పాస్టర్స్‌ ఫెలోషిప్‌ అధ్యక్షుడు బిషప్‌ ప్ర తాప్‌ సిన్హా, చీప్‌ అడ్వయిజర్‌ బిషప్‌ సుభాకర్‌ శాస్త్రి, జిల్లా అధ్యక్షుడు జోషప్‌ కొమ్మనాపల్లి, ట్రెజరర్‌ రెవ జ్యోతి ఆనంద్‌ ప్రసంగించారు. కృపా అధ్యక్షుడు రెవ. కె.జోషప్‌ అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన సభ్యులకు మంత్రి తానేటి వనిత చేతులమీదుగా ఐడీ కార్డులను అందజేశారు. మంత్రి తానేటి వనితను కృపా కార్యవర్గ సభ్యులు ఘనంగా సత్కరించారు. కృపా గౌరవ అధ్యక్షుడు వై.ప్రభాకర్, కార్యదర్శి ఎంవీ సత్యన్నారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు మోజేస్, మాజీ ఎమ్మెల్సీ, వైసీపీ సీనియర్‌ నాయకులు కోడూరి శివరామకృష్ణ, బొబ్బా సుబ్బారావు, ముళ్లపూడి కాశీవిశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top