ఉత్తరాంధ్రలోనే భాగ్యలక్ష్మికి భారీ ఆధిక్యత

YSRCP Leader Won Huge Majority in Visakhapatnam - Sakshi

విశాఖపట్నం , పాడేరు: పాడేరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ రెండోసారి పాగా వేసింది. ఈ పార్టీ అభ్యర్థి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి   ఉత్తరాంధ్ర స్థాయిలోనే అత్యధిక మెజార్టీతో మొదటి స్థానంలో నిలిచారు. భాగ్యలక్ష్మికి 71,153 ఓట్లు పోలవగా, టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరికి 28,349 ఓట్లు లభించాయి. దీంతో భాగ్యలక్ష్మి 42,804 ఓట్ల ఆధిక్యతతో విజయంసాధించారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాలకు గాను 28 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు.   పాడేరు  అభ్యర్థి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అత్యధిక మెజార్టీ సాధించి మొదటిస్థానంలో నిలిచారు. ప్రతి రౌండ్‌కి, ప్రతి పోలింగ్‌ బూత్‌లోను, అన్ని మండలాల్లో వైఎస్సార్‌సీపీకి మెజార్టీ ఓట్లు లభించాయి. ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్‌ నుంచి వైఎస్సార్‌సీపీ ఆధిపత్యం కొనసాగింది. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి 26,114 ఓట్ల ఆధిక్యత లభించింది. ఈ సారి ఎన్నికల్లో పాడేరు అసెంబ్లీ అభ్యర్థుల సంఖ్య పెరిగింది. 14 మంది పోటీలో నిలిచారు. ఓట్ల చీలిక ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు వేసిన అంచనాలుతలకిందులయ్యాయి. ఏకపక్షంగా వైఎస్సార్‌సీపీ హవా కనిపిం చింది. ఎన్నికలు మొదలు కాక ముందు నుంచి పాడేరులో వైఎస్సార్‌సీపీ గెలుపు తథ్యమని అంచనాలు ఉన్నప్పటికీ ఈ సారి ఎన్నికల్లో మాత్రం వైఎస్సార్‌సీపీకి అనూహ్యమైన మెజార్టీ లభించడం విశేషం.

అరకు లోక్‌సభ పరిధిలో స్థానాలన్నీ వైఎస్సార్‌సీపీ కైవసం
అరకు లోక్‌సభ స్థానంతో పాటు ఆ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. గత 2014 ఎన్నికల్లో కూడా వైఎస్సార్‌సీపీ అన్ని స్థానాల్లో విజయ కేతనం ఎగురవేసింది. ఈ సారి ఎంపీ అభ్యర్థి గొడ్డేటి మాధవికి రెట్టింపు ఆధిక్యత 2,19,836  ఆధిక్యత లభించడమే కాకుండా అసెంబ్లీ అభ్యర్థులు కూడా మెజార్టీలో ఆధిక్యత సాధించారు. గతసారి అరకు స్థానాలన్నీ వైఎస్సార్‌సీపీ గెలుచుకోవడంతో తెలుగుదేశం ప్రభుత్వం ఈ నియోజకవర్గంపై వివక్ష చూపింది. వైఎస్సార్‌సీపీని గెలిపించారని పలుసార్లు ఇక్కడ బహిరంగ వేదికలపై సీఎం చంద్రబాబు ప్రజల్ని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. దీంతో మరింత పట్టుదలగా ఈ సారి ఎన్నికల్లో కూడా ఓటర్లు వైఎస్సార్‌సీపీ వైపు మొగ్గు చూపించారు. రెండోసారి వైఎస్సార్‌సీపీ అరకు స్థానాలన్నింటిని క్లీన్‌ స్వీప్‌ చేయడంతో పార్టీకి మరింత పట్టు పెరిగింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top