పవన్‌కు రామచంద్రయ్య సవాల్‌..!

YSRCP Leader C Ramachandraiah Slams Pawan Kalyan - Sakshi

సత్తా ఉంటే పవన్‌ సవాల్‌ స్వీకరించాలి : సీ రామచంద్రయ్య 

సాక్షి, వైఎస్సార్‌ కడప : చెగువేరా గురించి స్పీచ్‌లు దంచికొట్టే పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబులో ‘చెగువేరా’ను చూశాడేమోనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సీ రామచంద్రయ్య ఎద్దేవా చేశారు. అందుకే టీడీపీ స్క్రిప్ట్ చక్కగా ఫాలో అవుతున్నారని విమర్శలు గుప్పించారు.‘ప్రజలు నవ్వుకుంటారని గాని, అభిమానులు బాధ పడతారనే ఫీలింగే లేదు. చంద్రబాబే నిన్నటి వరకు వెన్నుపోటు దారుడు అనుకుంటే... అభిమానులకు పవన్ వెన్నుపోటు పొడిచి బాబును మించిపోతున్నాడు’ అని వ్యాఖ్యానించారు. ప్యాకేజీ పాలిటిక్స్‌ చేయడానికి పార్టీ ,జెండా ఎందుకని చురకలంటించారు. జనసేనలో కుటుంబ సభ్యుల ప్రమేయం ఉండదని చెప్పి నాగబాబును రంగంలోకి దించారని.. పవన్‌ మాట నిలకడ లేని వ్యక్తి అని అన్నారు. ‘నీకు చేతనైతే అన్ని చోట్లా అభ్యర్థులను నిలబెట్టి.. లాలూచీ రాజకీయాలు చేయడం లేదని నిరూపించుకో’ అని సవాల్‌ విసిరారు.

వాళ్లేనా స్టార్‌ క్యాంపెయినర్లు..
బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన వారిని చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్లుగా పెట్టి జగన్‌పై లేనిపోని విమర్శలు చేయిస్తున్నారని రామచంద్రయ్య మండిపడ్డారు. వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబు డిప్రెషన్‌లోకి వెళ్తున్నారని అన్నారు. అందుకనే ఏమాత్రం సంబంధం లేని కేసీఆర్‌ను ఆంధ్ర రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తూ.. ఆంధ్ర, తెలంగాణా ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘హైదరాబాద్‌లో నువ్‌ చేసిన అభివృద్ధి ఏమిటి. నీ అస్మదీయులకు లీకులిచ్చి భూములు కొనుగోలు చేయించావ్. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డావ్‌. విదేశాల్లో అయితే నువ్‌ చేసిన పనికి ఊచలు లెక్కించేవాడివే. నీ హైటెక్‌సీటీ బాగోతమంతా ఒక విదేశీ విద్యార్థిని తన థీసిస్‌లో వివరించింది. ఇదే ఫార్ములాను అమరావతిలోనూ ఫాలో అయ్యావ్‌. అమరావతి చుట్టూ నీ అస్మదీయులు భూములు కొనేలా చేశావ్‌. ప్రజల డబ్బుతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి నీ అనుయాయులకు మేలు చేశావ్‌. నువ్వు చరిత్ర చెత్త బుట్టలో పడిపోతున్నావ్. ఓటమి భయంతో నీ మాటలు తడబడుతున్నాయ్‌. ఆ భయం నీ ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది’ అని రామచంద్రయ్య బాబు చర్యలను ఎండగట్టారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top