రాజకీయ దురుద్దేశంతోనే ఓట్ల తొలగింపు

ysrcp and loksatta party leaders complaint on voters removed in srikakulam district - Sakshi

అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు అధికారులు చేస్తున్నారు

ఎమ్మెల్యే వార్డులో ఒక్క ఓటూ పోలేదు  

కలెక్టర్‌కు వైఎస్‌ఆర్‌సీపీ, వామపక్ష పార్టీ నేతల ఫిర్యాదు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఇటీవల జరిగిన ఓటర్ల రివిజన్‌ ప్రత్యేక సమ్మరీ కార్యక్రమంలో శ్రీకాకుళం నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఓటర్లను తొలగించారని, అధికార పార్టీకి చెందిన నాయకులు చెప్పినట్టు అధికారులు వ్యవహరించి వాస్తవిక ఓటర్లకి ఓటు లేకుండా చేశారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు, ఉభయ కమ్యూనిస్టు, లోక్‌సత్తా పార్టీ ప్రతినిధులు మండిపడ్డారు. ఇదే విషయమై జిల్లా కలెక్టర్‌ కె.ధనంజయరెడ్డిని బుధవారం తన ఛాంబర్‌లో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కో ఆర్టినేటర్‌ ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ ఇంతలా ఓట్లు రద్దయిన ప్రక్రియ జరగలేదన్నారు. జిల్లా వ్యాప్తంగా ఒక లక్షా రెండు వేల మంది ఓట్లను తొలగిస్తే.. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం నగరంలోనే సుమారు 28 వేల ఓట్లను రద్దు చేయడం దారుణమన్నారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే రాజకీయ దురుద్దేశంతోనే అధికారులకు చెప్పి, ఓట్లను తొలగించారన్నారు.

తమ పార్టీ బలంగా ఉన్న చోట వందలాది ఓట్లును తొలగించారన్నారు. హెచ్‌బీ కాలనీ, చిన్నబరాటం వీధి, మాజీ చైర్‌పర్సన్‌ ఎంవీ పద్మావతి ఉన్న ప్రాంతంలోనూ, వివిధ ప్రాంతాల్లో వందల సంఖ్యలో గత 30 ఏళ్లుగా నివాసం ఉన్నవారు, గతంలో పలు పదవులు చేసినవారి పేర్లు సైతం ఈ కొత్త జాబితాలో లేవన్నారు. పూర్తి వివరాలు, జాబితాను కలెక్టర్‌కు అందజేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ చాల గొప్పదని, ఈ హక్కును రద్దు చేసే అధికారం ఎవ్వరికీ లేదన్నారు. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికలకు వెళ్లాలని.. అలాకాకుండా అడ్డదారిలో ఓట్లను తొలగించి ప్రయోజనం పొందాలన్నా దురుద్దేశం మంచిది కాదన్నారు. జిల్లాలోనూ, నగరంలోనూ వేలల్లో ఓట్లు రద్దయినా, స్థానిక శాసన సభ్యురాలు ఉన్న ప్రాంతంలో ఒక్క ఓటు కూడా ఎందుకు పోలేదని, అధికారులు ఎందుకు మార్పులు చేయలేదని కలెక్టర్‌ను ధర్మాన ప్రశ్నించారు. గతంతో పలు పధవులు చేసిన వారి ఓట్లు, వారి కుటుంబ సభ్యుల పేర్లను సైతం తొలగించారని కలెక్టర్‌కు వివరించారు. పట్టణంలో టీడీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని హౌసింగ్‌ బోర్డు కాలనీ, ఆఫీషియల్‌ కాలనీ ప్రాంతాలో వేలాది ఓట్లను తొలగించారన్నారు. తొలగించిన వారి వివరాలను కలెక్టర్‌కు నేతలు అందజేశారు. తొలగించిన ఓట్లను తిరిగి చేర్పించాలని కోరారు. తొలగించిన వారి ఓట్లు చేర్పించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి, ఇంటింటా సర్వేలు చేసి అర్హులందరికీ ఓటు హక్కును కల్పించాలన్నారు.

ప్రజా స్వామ్యానికి అగాధం:తమ్మినేని
శ్రీకాకుళం పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ఓట్ల తొలగింపు ప్రజా స్వామ్యానికి పెద్ద అగాధమన్నారు. రాజకీయాల్లో ఓట్లు తొలగించడం అన్యాయమన్నారు. అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు అధికారులు కూడా ఓట్లను తొలగించడం సరికాదని వ్యాఖ్యానించారు. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. చర్యలు తీసుకొకపోతే ప్రతిసారి ఇవే పొరపాట్లు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఓట్లు తమకు  అనుకూలంగా లేవనే ఇబ్బందితోనే అధికార పార్టీ ప్రమేయంతో  28 వేల ఓట్లను నగరంలో తొలగించడం దారుణమన్నారు. దీనిపై ఎన్నిక కమిషన్‌ పరిధిలో చర్యలు తీసుకోవాలని, అప్పటికీ చర్యల్లేకపోతే న్యాయస్థానం ద్వారా రక్షణ పొందాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ముందుగానే అ«ధికారులు చర్యలు తీసుకొని, వాస్తవంగా తొలగించిన ఓట్లను తిరిగి పునరుద్ధరించాలని కలెక్టర్‌కు తమ్మినేని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే తమ పార్టీ యువ నేత స్వరూప్, తదితరులకూ పూర్తి అవగాహన ఉందని, వారి సాయం తీసుకోవాలని, ఒక్క ఓటు కూడా తప్పిపోకుండా చూడాలని కోరారు.

సూర్యమహాల్‌ ప్రాంతంలో దళితులకు చెందిన 250 ఓట్లను తొలగించారని, మాజీ కౌన్సిలర్‌ రఫీ కుటుంబ సభ్యుల ఓట్లు లేవని, చిన్నబరాటం వీధిలో 321 నుంచి 610 వరకు, శిమ్మ రాజశేఖర్‌ వార్డు పరిధిలో 168 ఓట్లు లేవన్నారు. హౌసింగ్‌ బోర్టు కాలనీలో జేఎం శ్రీను, వారి  కుటుంబ సభ్యులు ఓట్లు లేవని, కొంతమందిన ఓట్లను ఓ పోలింగ్‌ కేంద్రం నుంచి దూరంగా ఉన్న మరో కేంద్రానికి పంపించారని కలెక్టర్‌కు తమ్మినే వివరించారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్,  çటెక్కలి, పలాస నియోజకవర్గాల సమన్వయకర్తలు  పేరాడ తిలక్, సీదిరి అప్పలరాజు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి మార్పు ధర్మారావు, పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శి ఎంవీ పద్మావతి,  జిల్లా అధికార ప్రతినిధి శిమ్మ రాజశేఖర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మామిడి శ్రీకాంత్,  శ్రీకాకుళం నగర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అందవరపు సూరిబాబు,  జెడ్పీ మాజీ  చైర్మన్‌ వైవీ సూర్యనారాయణ, డాక్టర్‌ సెల్‌ జిల్లా కన్వీనర్‌ పైడి మహేశ్వరరావు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి టి.కామేశ్వరి,   కమ్యూనిస్టు పార్టీ నాయకులు బైరి కృష్ణమూర్తి, కోరాడ నారాయణరావు, లోక్‌ సత్తా నాయకుడు పంచాది రాంబాబు ఉన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top