ఎ‍మ్మెల్యేను జైల్లో పడేసి ఉంటే అకృత్యాలు మళ్లీ జరిగేవా? | YS Jagan Slams TDP For Not Taking Action on Chitamaneni at Mahila Mukhamukhee | Sakshi
Sakshi News home page

ఎ‍మ్మెల్యేను జైల్లో పడేసి ఉంటే అకృత్యాలు మళ్లీ జరిగేవా?

Feb 15 2018 5:21 PM | Updated on Oct 20 2018 6:19 PM

YS Jagan Slams TDP For Not Taking Action on Chitamaneni at Mahila Mukhamukhee - Sakshi

మహిళల ముఖాముఖిలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

రేణమాల (ఉదయగిరి నియోజకవర్గం), శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు : అక్రమంగా ఇసుకను దోచుకుంటూ, అడ్డుకున్న మహిళా ఎ‍మ్మార్వోను జుట్టుపట్టి ఈడ్చిన ఎమ్మెల్యేను కాల్చి పారేయకుండా, కనీసం అరెస్టు చేసి జైల్లో వేయకుండా.. బాధితురాలిపై చంద్రబాబు ప్రభుత్వం కన్నెర్ర జేసిందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా చెప్పిన మాటలు అక్షర సత్యమని అన్నారు.

గురువారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని రేణమాల గ్రామంలో ఏర్పాటు చేసిన మహిళల ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. ‘సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఓ దళిత మహిళను బట్టలూడదీసి అవమానించి, ఆ ఘటనను చిత్రించి సోషల్‌మీడియాలో పెడితే చర్యలు లేవు. మహిళలపై జరుగుతున్న దాడులపై ఫిర్యాదును మహిళా కమిషన్‌ తీసుకోకపోవడంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. దీంతో దిగొచ్చిన కమిషన్‌ ఫిర్యాదును స్వీకరించింది.

బాబు హయాంలో మహిళలపై దారుణంగా వేధింపులు జరుగుతున్నాయి. బాబుకు సంబంధించిన ఎమ్మెల్యే ఇసుకను దోచుకుంటూ అడ్డుతగిలిన ఓ మహిళా ఎమ్మార్వోను జుట్టుపట్టుకు ఈడ్చాడు. ఆ దాడికి చింతమనేనిని అప్పుడే ఎన్‌కౌంటర్‌ చేయాల్సింది పోయి.. అతనిపై కనీస చర్యలు కూడా తీసుకోలేదు. ఘటన జరిగిన వెంటనే ఎమ్మెల్యేను నాలుగు తన్నులు తన్ని జైల్లో పడేసి ఉంటే.. రాష్ట్రంలో మహిళలపై ఇలాంటి అకృత్యాలు మళ్లీ జరిగేవి కావు. ఆ ఎమ్మెల్యేను ప్రభుత్వం వదిలేయడం వల్లే ఇంకా మహిళలపై దాడులు జరగుతున్నాయి.

ఎన్నికల ప్రణాళికలో బెల్టు షాపులు రద్దు అని చంద్రబాబు ఊరూరా చెప్పారు. ఇవాళ ప్రతి గ్రామంలో కూడా మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఉందో లేదో కానీ బెల్టు షాపు లేని గ్రామం లేకుండా చేశారు. ఫోన్‌ కొడితే మద్యం ఇంటికొచ్చే హైటెక్‌ పాలనను సాగిస్తున్నారు. ఏటా మద్యం వినియోగం 20 శాతం పెరుగుతోంది. ఆర్థిక చిక్కుల్లో పడిన డ్రాక్వా సంఘాల రుణాలను అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామని అన్నారు. ఇంకా చంద్రబాబు ఇచ్చిన ఇలాంటి హామీలు చెప్పుకుంటూ పోతే నాలుగు పేజీలు ఉన్నాయి.

ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకుని చెప్పమని అడుగుతున్నా. ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేని పరిస్థితి. రైతులకు పూర్తిగా రుణ మాఫీ చేస్తానన్నారు ఈ పెద్ద మనిషి. రైతు రుణాలు, పొదుపు సంఘాలకు ఇవ్వాల్సిన డబ్బులను బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించడం లేదు. దీంతో బ్యాంకులు వడ్డీలేని రుణాలను ప్రజలకు ఇవ్వడం లేదు.
రేపు మన అందరి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నాం అన్న విషయం చెబుతున్నా. అక్కచెల్లమ్మలకు పొదుపు సంఘాల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తాం. నాలుగు దఫాల్లో ఆ డబ్బును నేరుగా మీ చేతికే ఇస్తాం. బ్యాంకులకు ఇవ్వం. రెండో వైపున ఇవాళ చంద్రబాబు హయాంలో సున్నా వడ్డీ పథకం అమలు కావడం లేదు.

సున్నా వడ్డీ పథకం మనకు కావాలి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పొదుపు సంఘాలు బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రతి ఏడాది కచ్చితంగా కడతామని చెబుతున్నాం. ప్రతి ఒక్కరూ లక్షాధికారి కావాలన్నదే నాన్నగారి కల. అందుకు సున్నా వడ్డీ రుణాలను మహిళలు వినియోగించుకోవాలి. ఇవాళ మన పిల్లల్ని ఇంజనీర్లుగా, డాక్టరు చదువులు చదివించాలంటే భారీగా ఖర్చు అవుతోంది. ప్రభుత్వం రూ. 35 వేలు ముష్టివేసినట్లు ఇస్తోంది. ఫీజులు చూస్తే లక్ష పైన ఉన్నాయి.

మిగిలిన డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు తల్లిదండ్రులు. ఏటా అంత ఖర్చు పెట్టాలంటే కుటుంబాలపై పెనుభారం పడుతుంది. అప్పులు చేసి పిల్లల్ని చదివిస్తున్నారు చాలా మంది తల్లిదండ్రులు. పేదరికం నుంచి మన కుటుంబాలు బయటపడాలంటే మన పిల్లల్లో ఒక్కరన్నా ఇంజనీర్లు, డాక్టర్లు కావాలి. అప్పుడే వాళ్లకు జీతాలు వేలల్లో వస్తాయి. అలాంటప్పుడే పేదరికం నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. మన ప్రియ నేత వైఎస్‌ తన హయాంలో ప్రతి ఒక్క కుర్రాడిని చదివించారు. ఇవాళ ఆ పరిస్థితి పోయింది. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంజనీరింగ్‌, డాక్టర్‌ ఇలా ఏ చదువైనా ప్రభుత్వమే చెప్పిస్తుంది. ఫీజులకు ఎన్ని లక్షలైనా భరిస్తాం.

మీ పిల్లల్ని ఇంజనీర్లు, డాక్టర్లు చేయడమే కాదు. హాస్టల్స్‌లో ఉండి చదవడానికి ప్రతి పిల్లాడికి, ప్రతి పాపకు సంవత్సరానికి 20 వేలు ఇస్తాం. పిల్లలు గొప్పగా చదవగలుగుతారు. పెద్ద చదువులకు పిల్లల కింది చదువులు బలంగా ఉండాలి. చిట్టిపిల్లల్ని బడికి పంపించినందుకు తల్లులకు సంవత్సరానికి రూ.15 వేలు ఇస్తాం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఏపీలో 32 శాతం మంది నిరక్షరాస్యులు ఉన్నారు. అక్షరాస్యతను పెంచడానికి ఈ కార్యక్రమం చేపడతాం. ఆ రోజు ఎన్నికలప్పుడు ఇల్లు కట్టిస్తానన్నాడు బాబు. ఒక్క ఇల్లూ కట్టించలేదు. ఒకవేళ కట్టించిన ఒకటీ, రెండు ఇళ్లను జన్మభూమి కమిటీలు పంచుకున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి, మహిళ పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించి ఇస్తాం.

అవ్వతాతల పరిస్థితి దారుణంగా ఉంది. జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తే తప్ప పింఛన్‌ రావడం లేదు. ఓట్లేసే వారికే పెన్షన్‌ ఇస్తున్నారు. దేవుడి దయ వల్ల రేపు మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికీ పింఛన్‌ అందేలా చేస్తాను. ఎస్సీ, ఎస్టీ, బీసీలు మైనార్టీలకూ చెబుతున్నా. పింఛన్‌ను రూ. 2 వేలకు పెంచుతాం. పింఛన్‌ అందే వయసును 45కు కుదిస్తామని చెబుతున్నా.
మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతోంది. మద్యం నుంచి ఎక్కువ డబ్బులు రాబట్టాలని చూస్తున్నారు.

ఈ ఎన్నికలు అయిన తర్వాత 2024 ఎన్నికలు వచ్చే సరికే మద్యాన్ని పూర్తిగా లేకుండా చేసి తీరుతాం. ఆ తర్వాతే వచ్చి ఓట్లు వేయాలని అడుగుతాం. మొత్తం మూడు దశల్లో మద్యంపై నిషేధం ఉంటుంది. మొదటి దశలో మద్యాన్ని తగ్గించే దిశగా ప్రయత్నిస్తాం. రెండో దశలో మద్యానికి పూర్తిగా బానిసై ఉన్నవారిలో మార్పుకోసం వారందరికీ ఆసుపత్రుల్లో చికిత్స చేయిస్తాం. మూడో దశ వచ్చే సరికి మద్యం దొరకని పరిస్థితిని తెస్తాం.’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement