
కృష్ణాజిల్లా జుఝవరంలో నల్లజెండాలు, నల్లబ్యాడ్జీలు చేతబూని ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌తో పాటు పాదయాత్ర సాగిస్తున్న పార్టీ నేతలు, ప్రజలు
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కృష్ణా జిల్లాను నందమూరి తారకరామారావు జిల్లాగా మారుస్తామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు. ఎన్టీఆర్ సొంతూరు నిమ్మకూరును అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. జగన్ ప్రకటనపై గ్రామస్తులు, ఎన్టీఆర్ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్ర 149వ రోజు సోమవారం కృష్ణా జిల్లా పామర్రు, పెడన నియోజకవర్గాల్లో కొనసాగింది. మార్గం మధ్యలో ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు ప్రజలు జగన్‌ను కలిశారు. తమ గ్రామంలో జరిగే అక్రమాలు, అన్యాయాలు చూడాలని కోరారు. ఊరికి సమీపంలో నీరు–చెట్టు పేరుతో 50 అడుగుల లోతు తవ్విన ప్రాంతాన్ని జగన్‌కు చూపించారు. చెరువును తవ్వి, ఆ మట్టిని ట్రాక్టర్ రూ.350, లారీ రూ.600 చొప్పున అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని గ్రామస్తులు వివరించారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్ దత్తత తీసుకున్న తమ ఊరి పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రూ.50 లక్షల కుంభకోణమని ఎన్టీఆర్ బంధువులు సైతం జగన్‌కు చెప్పారు. చంద్రబాబుకు తాము బంధువులమని చెప్పుకునేందుకే సిగ్గు పడుతున్నామని నందమూరి వెంకటేశ్వరరావు జననేతకు తెలిపారు. దీనిపై జగన్ స్పందిస్తూ..
ఎన్టీఆర్ బంధువులకే వేధింపులు
‘‘నీరు– చెట్టు అంటే మూడు నాలుగు అడుగులు తవ్వితే సిల్ట్ తీసేసినట్టుగా భావించాలి. అప్పుడు కొద్దో గొప్పో మేలు జరుగుతుంది. అలాంటిది ఏకంగా 50 అడుగుల లోతు వరకూ తవ్వేస్తున్నారు. పక్కనే పొక్లెయిన్ కన్పిస్తోంది. దీన్ని బట్టి పరిస్థితి అర్థమవుతోంది. ఎక్కడా కూలీలను వాడటం లేదు. అన్నీ యంత్రాలే. తవ్విన మట్టిని అమ్ముకుంటున్నారు. పైగా నీరు–చెట్టు కార్యక్రమం చేస్తున్నామని ప్రభుత్వం నుంచి మళ్లీ డబ్బులు తీసుకుంటున్నారు. ఇక్కడేమో పొక్లెయిన్‌లను పెట్టి తవ్విస్తూ.. లేబర్‌ను పెట్టి తవ్వించామని రికార్డుల్లో రాస్తున్నారు.
ఇంత పెద్ద గుంతలో పశువులో, మనుషులో పడితే బయటకొచ్చే పరిస్థితే ఉండదు. దీనివల్ల ఈ ప్రాంతంలో నీళ్లు ఉపయోగపడవు. ఎన్టీరామారావు గారి సొంత ఊళ్లో, లోకేశ్ దత్తత తీసుకున్న గ్రామంలో రూ.50 లక్షల కుంభకోణం. నిన్నకూడా ఎన్టీఆర్ భార్య బసవతారకం బంధువులు నా దగ్గరకొచ్చారు. మచిలీపట్నంలో 22 ఎకరాల భూమి అమ్మడానికి ఇష్టపడకపోతే ఓ ఎంపీ వేధింపులకు దిగారట.. భార్య, పిల్లలను స్టేషన్‌లో ఐదు రోజులుగా కూర్చోబెట్టడమట.. రాత్రికి ఆయన ఖర్చుతోనే హోటల్ బుక్ చేస్తారట.. అక్కడికి తీసుకెళ్లి మళ్లీ స్టేషన్‌కు తీసుకొస్తారట. ఈ వేధింపులు భరించలేక వాళ్లు నన్ను కలిశారు. ఇంత దారుణమైన పరిస్థితి ఉంటుందా? వీళ్లు చేసే పనుల వల్ల ప్రజలకు మేలు జరుగుతోందా? చెడు జరుగుతోందా? రైతులకు నష్టం జరుగుతోందని తెలిసి కూడా ఏమాత్రం ఆలోచన లేకుండా ఇష్టమొచ్చిన పద్ధతిలో చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని చెరువుల పరిస్థితీ ఇంతే. నీరు–చెట్టు పేరుతో దోచేస్తున్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిమ్మకూరును అన్ని విధాలా అభివృద్ధి చేయడమే కాదు.. కృష్ణా జిల్లా పేరును నందమూరి తారక రామారావు జిల్లాగా మారుస్తాం’’ అని జగన్ అన్నారు.
ఏ ఊరినీ వదలకుండా దోచేస్తున్నారన్నా..
‘గుండెల్లో గునపాలు దిగి, గాయాలతో శోకిస్తున్న నేల తల్లిని చూడన్నా.. అర్ధరాత్రి అడ్డగోలుగా మట్టినే దోచేస్తున్న అరాచకం చూడండన్నా.. ఇంతకన్నా వంచన ఉంటుందా? ఇంత మోసం మరెక్కడైనా ఉంటుందా?’ అని నిమ్మకూరులో జననేత జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట జనం ఆగ్రహం వక్తం చేశారు. ఎన్టీఆర్ అల్లుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌లు ఈ అక్రమాలకు బా«ధ్యులని వివరించారు. నిమ్మకూరు, యలకుర్రు, కొండిపర్రు, బల్లిపర్రు చెరువుల్లోని మట్టిని విచ్చల విడిగా తవ్వుతున్నారని వివరించారు. తమ ఆస్తులకు సైతం రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కాళ్లు కడిగి పిల్లనిస్తే ఇలా కాళరాత్రి చూపిస్తాడా? దొంగల్లుడిని ఊరు తట్టుకోలేకపోతోంది’అని శివయ్య, మాణిక్యం వాపోయారు.
చినబాబు, పెదబాబు ఆగడాలు అడ్డుకోకునే ధైర్యం జగన్‌కే ఉందని మహాలక్ష్మి, సువర్ణ, విశ్వేశ్వరరావు తెలిపారు. మోసం, దగా, వంచనకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని 72 ఏళ్ల పాపయ్య తన అనుభవాలను చెప్పాడు. ‘ఎన్టీఆర్ ఆత్మ ఎంత క్షోభిస్తోందో.. జగన్ వచ్చి స్వయంగా ఈ ప్రాంతాన్ని చూశాడు.. కొంతైనా మేలు జరుగుంది’ అని మల్లేశ్వరి, రమ, ప్రభావతి అన్నారు. భగభగ మండే ఎండలోనూ జనం ఆయన అడుగులో అడుగేస్తూ, టీడీపీ ప్రభుత్వ అరాచకాలను వివరించేందుకు పోటీ పడ్డారు. కంచర్లవారి పాలెంలో మొదలైన పాదయాత్ర జుజ్జవరం, నిమ్మకూరు క్రాస్, నిమ్మలూరు, నిడుమోలు, తరకటూరు, పర్ణశాల మీదుగా సాగింది. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబుపై, రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్న కేంద్రంపై పాదయాత్ర సాక్షిగా ప్రజలు నిరసన గళం విన్పించారు. ఊరూరా జనం నల్లబ్యాడ్జీలు, జెండాలతో ఎదురొచ్చారు. యువత, విద్యార్థులు నల్లచొక్కాలు వేసుకుని పాదయాత్రలో పాల్గొన్నారు. ‘హోదా సాధించే దమ్ము, ధైర్యం మీకే ఉన్నాయన్నా’ అని జుజ్జువరం వద్ద రాజేశ్వర్, రామారావు, ప్రవీణ్ జననేతతో అన్నారు. ‘మీ వెంట మేముంటాం... ఏ పోరాటానికైనా కదిలొస్తాం’ అని తురకటూరు వద్ద నల్లబ్యాడ్జీలు ధరించిన పల్లవి, మంజుల, సాయి ప్రభ నల్ల బ్యాడ్జీలు ధరించి చెప్పారు.
అడుగడుగునా వినతులే..
జాతీయ రహదారి పేరుతో తమ ఇళ్లన్నీ కూల్చేసి, నిలువ నీడ లేకుండా చేశారని కంచర్లవారిపురానికి చెందిన తలారి లక్ష్మీ మనోహరి, లక్ష్మిలు జగన్ ఎదుట బావురుమన్నారు. ఇందిరమ్మ ఇళ్లనూ కూల్చేశారన్నా, ఇదెక్కడి ప్రభుత్వం? అంటూ మలయతిప్ప గ్రామానికి చెందిన సావిత్రి, సరోజ కన్నీరు పెట్టుకున్నారు. వికలాంగుడైన కొడుకుతో కలిసి 40 ఏళ్లుగా ఉంటున్న ఇంటిని కూల్చేసి, రోడ్డున పడేశారని బలయప్పనపేటకు చెందిన కనపర్తి పద్మలత తెలిపింది. ‘ఈ సర్కారు పాడుగాను... ఎప్పుడు పోతుందాని ఎదురు చూస్తున్నాం’ అందామె. టీడీపీ నేతలు తన ఇంటిని ఆక్రమించుకుని బెదిరిస్తున్నారని, చంద్రబాబు సర్కార్ మాఫియాకు నిలయమైందని సీతరాంపురం గ్రామానికి చెందిన మట్టా లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది. మచిలీపట్నం–విజయవాడ రహదారి నిర్మాణంలో రాత్రికి రాత్రి ఖాళీ చేయించి తమ జీవితాలను రోడ్డుపాలు చేశారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ జెండాపై ఎమ్మెల్యేగా గెలిచి.. టీడీపీలో చేరిన ఉప్పులేటి కల్పనకు అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని చెప్పారు.
నాలుగేళ్లుగా వ్యవసాయం చేసే పరిస్థితి లేదని రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు యర్నేని నాగేంద్రనా««థ్ వివరించారు. ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయిందన్నారు. కొల్లేరు సరస్సు కనుమరుగు కాకుండా చూడాలని కోరారు. సాగునీటి సమస్య పరిష్కారానికి కొన్ని ప్రత్యామ్నాయ విధానాలతో కూడిన నివేదికను జగన్‌కు అందజేశారు. గోదావరి–పెన్నా నదుల అనుసంధానంతో ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. సబ్సిడీ రుణాలను దోచేస్తున్నారని చెప్పినందుకు అక్రమ కేసులు పెట్టారని గుడ్లవల్లేరు మండలం విన్నకోట గ్రామానికి చెందిన మద్దాల వెంకమ్మ అనే మహిళ జగన్ వద్ద కన్నీటిపర్యంతం అయ్యారు. రైతులు, ఆశా వర్కర్లు, నిరుద్యోగులు, పింఛన్లు, రుణాలు అందని వారు, ఇళ్ల బిల్లులు మంజూరు కాని వారు జగన్ ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. అందరి సమస్యలు ఓపికగా విన్న జగన్.. మనందరి ప్రభుత్వం రాగానే అందరి సమస్యలు పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.