
సాక్షి, కృష్ణా : కృష్ణా జిల్లాను నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) జిల్లాగా మార్చుతామని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నిమ్మకూరు నియోజకవర్గంలోకి ప్రవేశించిన ఆయన వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ పేరును జిల్లాకు పెడతామని చెప్పారు.
తెలుగు ప్రజలకు ముఖ్యంగా బలహీన వర్గాల కోసం ఎన్టీఆర్ తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన పుట్టిన గడ్డ నిమ్మకూరుకు నా పాదయాత్ర చేరిన సందర్భంగా ఎన్టీఆర్‌కు నివాళులు అర్పిస్తూ కృష్ణాజిల్లా పేరును నందమూరి తారక రామారావు జిల్లాగా మారుస్తామని ప్రమాణం చేస్తున్నానని... వైఎస్ జగన్ ఈ సందర్భంగా ట్విట్ చేశారు.
NTRgaru devoted his life to the service of Telugus, especially the downtrodden. As a tribute to him, standing on his home ground, Nimmakaru, during my Padyatra, I pledge to rename Krishna district to "Nandamuri Taraka RamaRao (NTR)" district
— YS Jagan Mohan Reddy (@ysjagan) 30 April 2018
ఎన్టీఆర్ జన్మస్థలం నిమ్మకూరులో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ఎన్టీఆర్ బంధువులు స్వయంగా వైఎస్ జగన్‌కు చూపించారు. నీరు-చెట్టు పథకం కింద చెరువును 50 అడుగుల లోతు తవ్వుతున్నారని చెప్పారు. ఎనిమిదిన్నర లక్షల ఖర్చుతో చెరువును తవ్వుతూ.. తవ్విన మట్టి ఒక ట్రాక్టర్‌కు 350 రూపాయలు, లారీకి 600 రూపాయలకు అమ్ముకుని తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొక్లెయిన్లతో మట్టి తవ్విన దృశ్యాలను వైఎస్ జగన్ చూపించారు.
ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిమ్మకూరు గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. గ్రామస్థుల ఫిర్యాదుపై స్పందించిన వైఎస్ జగన్ నీరు చెట్టు పథకంలో చెరువుల పూడిక తీతలో భాగంగా మూడు నుంచి నాలుగు అడుగులు తవ్వుతారని చెప్పారు. కానీ పథకం పేరు చెప్పి 50 అడుగులు తవ్వి మట్టిని అమ్ముకుంటున్నారని తెలిపారు. అంతేకాకుండా మళ్లీ లేబర్‌ను పెట్టి తవ్వించామని చెప్పి ప్రభుత్వం నుంచి డబ్బును తీసుకుంటున్నారని సర్కారు అవినీతి ఎండగట్టారు. ఇలా ఎన్టీఆర్ జన్మస్థలం దాదాపు 50 లక్షల రూపాయల స్కాం జరుగుతోందని వివరించారు.
నందమూరి బంధువులు వైఎస్ జగన్‌తో ఈ మేరకు మాట్లాడారు. అనంతరం నిమ్మకూరుతో పాటు ఎన్టీఆర్ పేరును కృష్ణా జిల్లాకు పెడతామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిమ్మకూరును అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. మరోవైపు కృష్ణాకు ఎన్టీఆర్ పేరును పెడతామనే వైఎస్ జగన్ ప్రకటనపై గ్రామస్థులు, ఎన్టీఆర్ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ వంటి మహానాయకుడికి ఇది చక్కని గౌరవమని అభిప్రాయపడ్డారు.