కేసీఆర్‌కు అంబేద్కర్‌ అంటే అలర్జీ

 Uttam Kumar Reddy Blasts On RSS Rally In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నడిబొడ్డున ట్రాఫిక్ క్లియర్ చేసి ఆరెస్సెస్‌ కవాతుకు ఎలా అనుమతిచ్చారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్లు కర్రలతో భయానక వాతావరణం సృష్టిస్తే, దానికి పోలీసులు సహకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరెస్సెస్‌ ర్యాలీకి సంబంధించిన వీడియోను పవర్‌పాయింట్‌ ద్వారా మీడియాకు చూపించాడు. గాంధీభవన్‌లో శుక్రవారం కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో కాంగ్రెస్‌ నేతలు మున్సిపల్‌ ఎన్నికలు, చేపట్టాల్సిన ర్యాలీ, తదితర అంశాలపై చర్చించారు.

అనంతరం ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘తిరంగ్‌ యాత్ర’, ‘సేవ్‌ నేషన్‌-సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌’కు అనుమతులివ్వడం లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. 130 కోట్ల మంది భారతీయులు హిందువులేనంటూ రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌కు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్నది ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌ కాదని కల్వకుంట్ల పోలీస్‌ సర్వీస్‌ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక 135వ కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం నాడు అన్ని జిల్లాల్లో జెండావిష్కరణ చేసుకుని ఉదయం 11 గంటలకు గాంధీ భవన్‌ చేరుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

కేసీఆర్‌ లోపాయకారి ఒప్పందం చేసుకున్నారు
మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ వ్యతిరేక విధానాలపై దేశ వ్యాప్తంగా ర్యాలీలు చేశామని హైదరాబాద్‌లో కూడా ర్యాలీ చేయాలనుకున్నామన్నారు. కానీ ట్రాఫిక్ సమస్య పేరుతో అనుమతి నిరాకరించారని పేర్కొన్నారు. తాము అంబేద్కర్‌ విగ్రహం దగ్గరికి మాత్రమే వెళతామంటున్నాం. కానీ అంబేద్కర్ అంటే కేసీఆర్‌కు ఎలర్జీ అని పేర్కొన్నారు. నిజామాబాద్‌లో ఎన్నికల కోడ్‌ ఉన్నప్పటికీ ఎంఐఎం సభకు ఎలా అనుమతి ఇచ్చారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. మజ్లీస్, బీజేపీతో కేసీఆర్ లోపాయకారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ఈ దేశంలో హిందువులు మాత్రమే కాదు.. అన్ని మతాల వారు ఉన్నారని వ్యాఖ్యానించారు. అందుకే ఇది సెక్యులర్ దేశమని నొక్కి చెప్పారు. ఆర్ఎస్ఎస్ తరహాలోనే కాంగ్రెస్‌ ర్యాలీకి అనుమతి ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఎలాగైనా రేపు సేవ్‌ ఇండియా-సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌ ర్యాలీ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top