కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ కోవర్టులు

TRS coverts in Congress says gajjela kantham - Sakshi

టీపీసీసీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం ఆరోపణలు

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీలో కేసీఆర్, కేటీఆర్‌లకు కోవర్టులున్నారని, వారంతా ఎప్పటికప్పుడు ఆ ఇద్దరితో టచ్‌లో ఉంటున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం ఆరోపించారు. బుధవారం మధ్యాహ్నం గాంధీభవన్‌ ఎదుట ఆయన విలేకరులతో మాట్లాడారు. కరీంనగర్‌లో ఇద్దరు నాయకులు, హైదరాబాద్‌లో మరో ముగ్గురు నేతలు టీఆర్‌ఎస్‌ కోవర్టులుగా పనిచేస్తూ కాంగ్రెస్‌ అధికారంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. కరీంనగర్‌ నేతలు కేటీఆర్‌కు, హైదరాబాద్‌ నాయకులు కేసీఆర్‌తో టచ్‌లో ఉన్నారన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో గత నాలుగు పర్యాయాలుగా కొప్పుల ఈశ్వర్‌ను కరీంనగర్‌లో టీఆర్‌ఎస్‌కు కోవర్టుగా ఉన్న నాయకుడే గెలిపిస్తున్నారని, అందుకే నాలుగుసార్లు ఓడిపోయిన వ్యక్తికి మళ్లీ టికెట్‌ ఇప్పించారని ఆరోపించారు. ఇటు చొప్పదండిలో 6 నెలల క్రితమే పార్టీలో చేరిన వ్యక్తికి టికెట్‌ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

30 నియోజకవర్గాల్లో డమ్మీ అభ్యర్థులే..
జిల్లాకో రెండు, మూడు సీట్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 30 నియోజకవర్గాల్లో డమ్మీ అభ్యర్థులను పెట్టి కాంగ్రెస్‌ అధికారంలోకి రాకుండా ఆ ఐదుగురు అడ్డుకుంటున్నారని గజ్జెల కాంతం ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ 10–15 మంది ఉద్యమకారులకు న్యాయం చేసిందని, విద్యార్థి నేతలకు సైతం టికెట్లిచ్చిందని, మరి కాంగ్రెస్‌ ఎంతమందికి టికెట్లిచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్‌ కోవర్టులు కోట్లు దండుకుని టికెట్లు అమ్ముకుంటున్నారని, హైకమాండ్‌కు తప్పుడు సమాచారమిచ్చి మోసం చేస్తున్నారన్నారు. ఉద్యమకారులు, ఉస్మానియా విద్యార్థులకు టికెట్లు ఇవ్వాలని రాహుల్‌గాంధీ చెప్పినప్పటికీ న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆధారాలతో బయటపెడతాం..
కోవర్టులెవరో పేర్లు చెప్పాలని విలేకరులు ప్రశ్నించగా.. తెలంగాణ ఉద్యమకారులు, ఉస్మానియా విద్యార్థి నేతలతో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామని గజ్జెల కాంతం చెప్పారు. అక్కడ అన్ని విషయాలను సాక్ష్యాలతో సహా బయటపెడతామన్నారు. భవిష్యత్‌ కార్యాచరణను కూడా ప్రకటిస్తామని చెప్పారు. ఈ వ్యవహారాన్ని పార్టీ హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్తామని, కాంగ్రెస్‌ పార్టీకి ద్రోహం చేస్తున్న వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top