‘రాజకీయ’ మాధ్యమం...

As Time Goes On, Politicians Are Eager to Use Modern Technology - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో : కాలంతో పాటే అడుగులేస్తూ రాజకీయ నాయకులు ఆధునిక సాంకేతికత వినియోగానికి ఉత్సాహం చూపుతున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు సోషల్‌ మీడియాను అస్త్రంగా మలుచుకుంటున్నారు. ప్రధాన పార్టీల తరఫున  పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు సామాజిక మాధ్యమాలైన వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్లలో ప్రచారం నిర్వహిస్తున్నారు. వీరందరి ప్రధాన లక్ష్యం రానున్న ఎన్నికలే కావడం విశేషం. గత ఎన్నికల తరువాత నాలుగేళ్లుగా అంటీముట్టనట్లున్న నాయకులు హఠాత్తుగా ‘విస్తృత’ పర్యటనలతో నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. 
‘అమ్మా బాగున్నావా.. అక్కా  ఎలా ఉన్నావు... అన్నా నన్ను మరిచిపోకండి’ అంటూ, మంచి, చెడు కార్యక్రమాలకు హాజరవుతూ ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇక్కడివరకు సాధారణమే అయినా, వీటన్నింటిని సోషల్‌ మీడియాకు ఎక్కిస్తూ తమకు కావాల్సిన మైలేజీ పొందుతున్నారు. వీటికి వచ్చే లైక్‌లు, కామెంట్లు  నాయకులకు కొత్త ఉత్సాహం ఇస్తున్నాయి. నాయకులు ఏ పల్లెలో కార్యక్రమాలు చేసినా వెనువెంటనే అనుచరగణం వాటిని సోషల్‌ మీడియాకు ఎక్కిస్తోంది. అంతేకాక, ఓటింగ్‌కు పెడుతూ మద్దతంతా తమకే అని నమ్మించే యత్నం చేస్తోంది.

అభ్యర్థులైతే ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపులు, ఫేస్‌బుక్‌ ఖాతాలు తెరిచి పోస్టింగ్‌లతో వేడి పెంచుతున్నారు. తమ నియోజకవర్గంలోని పాత్రికేయ మిత్రులతో ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేయించి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పోస్ట్‌ చేస్తూ అటు సమాచారం చేరవేత, ఇటు ప్రచారం రెండూ ఒకేసారి పొందుతున్నారు. మండలానికి కొందరి చొప్పున ఎంపిక చేసుకుని వారి ద్వారా గ్రామాల్లో ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా ముందుగానే సమాచారం వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నెట్‌వర్క్‌ కంపెనీలు డాటా చార్జీలను తగ్గించడంతో అందరికీ అందుబాటులోకి వచ్చిన సదుపాయాన్ని సామాజిక మాధ్యమాల వినియోగంతో సద్వినియోగం చేసుకుంటున్నారు.

కామెంట్లు.. కౌంటర్లు..
‘ప్రస్తుతం మన నియోజకవర్గంలో గెలిచేవారు ఎవరు?’ అంటూ... కింద ఉంచుతున్న వివిధ పార్టీల అభ్యర్థుల వారి ఫొటోలకు అనుచరులు తక్షణమే స్పందిస్తున్నారు. కామెంట్లు, కౌంటర్లు పెడుతూ తమకిష్టమైన వారి గుణగణాలు, ఎదుటివారి లోపాలను ఎత్తిచూపుతున్నారు. ‘ఐదేళ్ల కిందట ఇలా ఉండేది... ఇప్పుడు ఇలా మార్చాం. ఈ ఘనత  మా అభ్యర్థిదే. ఇలాంటివి ఎన్నో చేశాం. ఇకపై మరెన్నో చేస్తాం. ఇప్పటికైనా అభివృద్ధికి చేయూతనివ్వండి’ అని ఊదరగొడుతున్నారు. ఇలాంటివాటిపై అనుచరులు జయహో అంటుంటే, ప్రత్యర్థులు మాత్రం వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది కొన్నిచోట్ల శ్రుతి మించి ప్రత్యక్షంగా గొడవలకు దిగే వరకు వెళ్తోంది.

గతి తప్పుతోందా?
ప్రయోజనం మాట అటుంచితే అవాస్తవాల ప్రచారానికీ సోషల్‌ మీడియాను వాడుకుంటున్నారు. లేనివాటిని ఉన్నట్లు చిత్రీకరిస్తూ వార్తలు పోస్ట్‌ చేస్తున్నారు. కొన్నిసార్లు నకిలీ వార్తలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. రాజకీయ నాయకుల కుటుంబాలపై అవాస్తవాలతో బురదజల్లడం, టికెట్లు ఇవ్వకముందే ఇచ్చేశారంటూ ప్రచారం, పార్టీ ఫిరాయింపులు... ఇలా పలు విధాల దుష్ప్రచారాలకు సోషల్‌ మీడియా వేదికవుతోంది.  

పార్టీ వీరాభిమానులు తమ నాయకుడిని పొగిడేందుకు ఇతర పార్టీల వారిని తక్కువ చేస్తున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం తలెత్తుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి, అధికార పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఎందరినో కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్న ఘటనలు చూస్తున్నాం. సోషల్‌ మీడియా ప్రచారాలపై నిత్యం ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిపై దృష్టిపెడితే మిగతా పనులు చేసుకునే పరిస్థితి ఉండదని పోలీసు వర్గాలు వాపోతున్నాయి. ఇదో పెద్ద తలనొప్పిగా మారిందని, ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని విన్నవిస్తున్నారు. మరోవైపు ఎన్నికల సంఘం సోషల్‌ మీడియాపై నిఘా పెట్టామని చెబుతున్నప్పటికీ, నేరుగా నియంత్రించగలిగే పరిస్థితి కనిపించటం లేదు.

పార్టీల ప్రోత్సాహం
స్మార్ట్‌ఫోన్‌ వినియోగం పెరిగిన తర్వాత ఎన్నికల ప్రచార సరళి చాలా మారింది. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ... సోషల్‌ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకుని లాభపడటం ఇప్పుడు అన్ని పార్టీలు, నాయకులకు ఓ  ఉదాహరణగా మారింది. ఈ అస్త్రాన్ని వినియోగించుకునేందుకు ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించుకుంటున్నారు. ‘సోషల్‌ మీడియా వార్‌ రూం’ల ఏర్పాటు ఇందులో భాగమే. పార్టీలోని నాయకులూ తమ వంతుగా వీటికి సాయపడుతుంటారు. 

విమర్శలకు వేదికగా
ప్రచారంతో పాటు విమర్శలు– ప్రతి విమర్శలకూ సోషల్‌ మీడియా వేదికవుతోంది. నాయకులు నెరవేర్చని హామీలు, గతంలో వాటి గురించి మాట్లాడిన మాటలు, ఫొటోలు, అదనంగా క్యారికేచర్లు, వీడియోలను షేర్‌ చేస్తున్నారు. దీంతో సహజంగానే అనుకూల, ప్రతికూల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు కిందిస్థాయి నాయకులు తమకు పార్టీలో ప్రాధాన్యం లేదన్న అసంతృప్తినీ సోషల్‌ మీడియాలోనే వెళ్లగక్కుతుండటం గమనార్హం.  

– ఆర్‌. లవకుమార్‌ రెడ్డి, సాక్షి, అమరావతి బ్యూరో

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top